ప్రపంచదేశాల్ని వణికిస్తున్న ‘కోవిడ్-19’ మహమ్మారిని సాధ్యమైనంత నివారించేందుకు ఏకైక మార్గంగా కనిపించిన లాక్ డౌన్ నిర్ణయాన్నే అమెరికా వంటి దేశాలతో పాటు మన దేశంలో కూడా అమలు చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నంత సులువుగా అమలు చేయలేమన్నది వాస్తవమే అయినా జనాన్ని రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడంలో ప్రభుత్వాలు చాలా వరకు సఫలమయ్యాయనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఏ వ్యాపారాలు జరగట్లేదు. ఇంటి నుంచే ఉద్యోగాలు చేసుకోగల వెసులుబాటు ఉన్న వాళ్ళకు తప్ప మిగతా ఎవరికైనా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుబాటుకు ఇబ్బందే. సొంత ఊళ్లు, రాష్ట్రాలు దాటి వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లిన వాళ్ల జీవితాలు ఎంత దుర్భరమయ్యాయో కనిపిస్తూనే ఉన్నాయి . రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామికులు పని చేసుకునే చోట ఉండలేక, స్వస్థలాలకు చేరుకోడానికి రవాణా లేక చివరికి కాలిబాట పట్టి మైళ్ళ కొద్దీ దూరాలు దాటుతూ, ప్రాణాలు సైతం కోల్పోతున్న సంఘటనలు చూస్తున్నాం. రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పరిధిలో వారికి చేయగలిగిన సహాయం చేస్తున్నాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వమైతే ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రానికి చెందిన ఆహార పదార్ధాలతో క్యాంపులు ఏర్పాటు చేశారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యాల్ని కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ‘శ్రామిక్ స్పెషల్స్ ‘ పేర నిన్నటి నుంచి కొన్ని రైళ్లను ప్రారంభించి హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు ఛార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ రైళ్లను ఉచితంగా నడిపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఉండుంటే హుందాగా ఉండేది. ఈ రైళ్లకు చెల్లించే మొత్తం ఎవరు చెల్లించినా ప్రజల నుంచి పన్నుల రూపంలో కట్టేదే అనే విషయం వాస్తవమే అయినా నలభై రోజులుగా ఎటువంటి ఆదాయం లేని రాష్ట్రాల ప్రభుత్వాలకు కాస్తలో కాస్త ఊరట కలిగేది. ప్రభుత్వ ఖర్చులతో పోల్చుకుంటే ఈ మొత్తం సొమ్ము ఎంత తక్కువైనా, ఎక్కువైనా ఉండచ్చు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో వేలకోట్ల ఖర్చుతో కూడుకున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులు, నిలువెత్తు విగ్రహాలే కాదు, పేద ప్రజల కోసం కూడా ఉన్నాయని దేశానికి సంకేతమివ్వాల్సిన సమయం ఇది.
ప్రతీ ఒక్కరు కోవిడ్ – 19 పై సమరంలో తమ వంతు సహాయం చేయాలని ‘పీఎం కేర్స్’ అని ఫండ్ ప్రారంభించి విరాళాలు చేయాల్సిందిగా కోరారు. పది రూపాయలు ఇవ్వగల సామాన్యుల నుంచి కోట్ల రూపాయలు ఇవ్వగల ఎందరో పారిశ్రామికవేత్తల వరకు విరివిగా దానాలు చేస్తున్నారు. ఆ నిధికి చేరుతున్న మొత్తం డబ్బుల నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండచ్చు, అనుమానించాల్సిన అవసరమే లేదు. అలాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా – మామూలు రోజుల్లో కూడా టికెట్ ధరలు చాలా ఎక్కువగా వసూలు చేస్తూ ప్రయివేటు రైళ్లు నడుపుతున్న వారిని ‘కోవిడ్-19 పై పోరులో భాగంగా వలస కార్మికుల కోసం సకల సదుపాయాలతో ఉచితంగా రైళ్లు నడపవల్సిందిగా పిలుపునిచ్చుంటే ఏ ప్రభుత్వానికీ ఎటువంటి భారం ఉండేది కాదు. మనకోసం అహర్నిశం శ్రమిస్తున్న వారికి కృతజ్ఞతాపూర్వకంగా బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొట్టమన్నారు, మనందరం కలిసి ఒక్కటిగా దీని పై పోరాడుతున్నామన్న సందేశాన్ని చాటి చెప్పి అందరిలో స్ఫూర్తి నింపేందుకు మళ్ళీ బాల్కనీల్లోనే దీపాలు వెలిగించమన్నారు. అలాగే ఈ బాధ్యతను ప్రయివేటు రైళ్లకు అప్పజెప్పి దాన్ని వారు విజయవంతంగా నిర్వహించేలా చేసి ఈ సారి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రజల్ని మరోసారి (కేవలం) ఇళ్లలో నుంచే చప్పట్లు కొట్టమని కోరి ఉండుంటే చాలా బాగుండేది.