iDreamPost
iDreamPost
సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు తమ కొత్త సినిమాల విడుదల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారు. ఇప్పటికే అనౌన్స్ మెంట్లు కూడా ఇచ్చేశారు. వీటిలో రెండు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నవే. కానీ ఖచ్చితంగా అప్పటికంతా పూర్తి చేస్తామనే నమ్మకంతో డేట్లు ప్రకటించారు. కానీ ఎటు తిరిగి నాగార్జున మాత్రం ఎలాంటి చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. బిగ్ బాస్ 4 జరిగినంత కాలం టీవీలో ఫుల్ గా కనిపించిన నాగ్ ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయారు. కనీసం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తాలూకు స్లోనెస్ ఎందుకవుతుందో కూడా పట్టించుకుంటున్నట్టు లేదు.
వైల్డ్ డాగ్ రెండు నెలల క్రితమే ఫినిష్ చేశారు. అదిగో పులి ఇదుగో తోక తరహాలో నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేశారు, రిపబ్లిక్ డే రోజు స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదు. సరే పోతేపోనీ ఇప్పటికైనా ఓ టీజరో లేదా ట్రైలరో రిలీజ్ చేసి కమింగ్ సూన్ అన్నా గొడవ ఉండేది కాదు. అలా కాకుండా హీరోతో మొదలుపెట్టి నిర్మాత దాకా అందరూ సైలెంట్ గా ఉంటే దాన్నేమనుకోవాలి. సంక్రాంతి తర్వాత సుమారు నెల రోజుల గ్యాప్ వచ్చింది. మధ్యలో అన్ని చిన్నా చితకా సినిమాలే ఉన్నాయి. ఆ టైంలో వైల్డ్ డాగ్ వచ్చి ఉంటె థియేట్రికల్ గా ఎంతో కొంత రాబట్టేదన్న అభిమానుల మాటల్లో నిజం లేకపోలేదు.
అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించిన వైల్డ్ డాగ్ కమర్షియల్ అంశాలకు దూరంగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందింది. మాస్ ని టార్గెట్ చేసింది కాదు కాబట్టి డిజిటల్ రిలీజ్ బెస్ట్ అన్న అభిప్రాయం కొందరు ఫ్యాన్స్ లోనూ ఉంది. అయితే ఏదో ఒకటి తేల్చి చెప్పేస్తే బెటర్ కదా. అసలే సీజన్ బాగా వేడెక్కుతోంది. ఫిబ్రవరితో మొదలుపెడితే అక్టోబర్ దాకా నాన్ స్టాప్ గా టాలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. వారం కింద షూటింగ్ మొదలైన సర్కారు వారి పాటే వచ్చే సంక్రాంతిని లాక్ చేసుకున్నప్పుడు మరి వైల్డ్ డాగ్ ఇంత మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు కదా