ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా అంతా అలానే ఉందని చూపించడానికి టీడీపీ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అందులోనూ సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్న తరుణంలో వాటిని విమర్శించలేక అప్పులు చుట్టూ చేస్తున్న రాద్ధాంతం హద్దులు దాటుతోంది. అంతా ఓ ప్రణాళిక ప్రకారం ఏపీ ఆర్థిక వ్యవస్థను దిగజార్చేశారనే నిందా ప్రచారానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది.టీడీపీ, అనుకూల పత్రికల ప్రచారాన్ని సకాలంలో గుర్తించి, కౌంటర్ చేయడం మీద వైఎస్సార్సీపీ ఎక్కువ దృష్టి పెట్టాలని కొందరి వాదన.
ఉదాహరణకు ఏపీలో ఉద్యోగుల వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నారనేది ఓ ప్రచారం. ఇటీవల రెండు నెలల పాటు వేతనాలు ఒకటో తేదీ న కాకుండా మొదటి వారంలో జమ చేసిన మాట కూడా వాస్తవమే. ఇది కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణా సహా అనేక రాష్ట్రాల్లో జరిగింది. జరుగుతోంది. కానీ ఈనెల సెప్టెంబర్ ఒకటో తేదీన మళ్లీ ఉద్యోగుల వేతనాలు జమ చేసిన సంగతి జనాలకు చేరలేదు. ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక విధాలుగా శ్రమించి అన్ని వ్యవస్థలను సజావుగా నడిపేందుకు చేస్తున్న యత్నంలో వేతనాలు సకాలంలో చెల్లించడం ఒకటన్నది కాదనలేని సత్యం.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోడ్పడిన అంశాల్లో రుణమాఫీ ఒకటి. అప్పట్లో జగన్ అది సాధ్యం కాదన్నారు.. కానీ చంద్రబాబు చేసి చూపుతా అన్నారు. దాంతో జనం బాబుని నమ్మారు. కానీ తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేయాల్సిన రుణాలు రూ. 87,627 కోట్లు ఉంటే ఐదేళ్లలో ఇచ్చింది మాత్రం కేవలం రూ. 15,279 కోట్లు మాత్రమే. మరి ఐదేళ్లలో టీడీపీ చేసిన సుమారు రెండు లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయంటే సమాధానం ఉండదు. కానీ ఈ రెండేళ్లలోనే జగన్ సర్కారు రైతు భరోసా పథకం కింద నేరుగా ప్రతీ రైతుకి ఇచ్చిన సొమ్ములు మొత్తం రూ. 44,500 కోట్లు. అంటే చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చిన దానికన్నా జగన్ రెండేళ్లలో మూడురెట్లు ఎక్కువగా అందించారు. అది కూడా కరోనా కష్టకాలంలో. ప్రభుత్వ, ప్రజల ఆదాయాలు పడిపోయిన కాలంలో రైతుని ఆదుకునే లక్ష్యంతో జగన్ చేసిన ప్రయత్నం ఇది.
వృధ్దాప్య, వితంతు పెన్షన్ల కోసం చేసిన ఖర్చు చేసినా ఈ వైరుధ్యం కనిపిస్తుంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సామాజిక పెన్షన్ల కోసం రూ. 26 ,403 .57 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ పెన్షన్ల రూపంలో ప్రజలకు ఇచ్చిన మొత్తం. రూ. 37 ,461 .99 కోట్లు. అంటే ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటికి తీసుకెళ్లి అందిస్తున్న పెన్షన్లలో కూడా టీడీపీ మొత్తం పాలన కన్నా ఈ ప్రభుత్వం సగం పాలనా కాలానికే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం విశేషంగా చూడాల్సి ఉంది.
నాడు -నేడు వంటి పథకాలు, అమ్మ ఒడి అంటి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే ఫీజు రీయంబెర్స్ మెంట్ కోసం చంద్రబాబు హయంలో ఇచ్చిన మొత్తం రూ. 13,420 కోట్లు. అందులో మళ్లీ 2వేల కోట్ల బకాయిలను జగన్ వచ్చిన తర్వాతే తీర్చాల్సి వచ్చింది. ఇక ఈ రెండేళ్ల జగన్ ప్రభుత్వం ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన మొత్తం రూ. 20,865 కోట్లు. అంటే ఐదేళ్ల బాబు కన్నా 50 శాతం అదనంగా జగన్ రెండేళ్లలో చెల్లించారు. ఇక ధాన్యం కొనుగోళ్లు నుంచి సకల కార్యక్రమాలకు ఇదే రీతిలో బాబు కన్నా జగన్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే అధికంగా వెచ్చించింది. వాటికి ఓ వైపు నిధుల కొరత, మరోవైపు గత ప్రభుత్వ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం ఉన్నప్పటికీ వెనుకాడకుండా సంక్షేమ కార్యక్రమాలు సాగించింది. మొత్తంగా నేరుగా ఈకాలంలో ప్రజలకు అందిన మొత్తం రూ. 1.05 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి బుగ్గన లెక్కలు అందించారు.
ఇంత సమర్థవంతంగా ప్రతీ కుటుంబానికి నేరుగా లబ్ది చేకూర్చే ప్రయత్నాలు జగన్ చేయడం సహజంగానే ప్రతిపక్షానికి గిట్టదు. అందులో దోషం లేదు. కానీ ఈ పథకాలు నిలిపివేయాలనే ఆలోచనతో అడ్డగోలుగా ప్రచారం చేయడం, అబద్ధాలను ఆధారంగా చేసుకోవడం మాత్రం ఆశ్చర్యం అనిపిస్తోంది. అందుకు టీడీపీ, వంత పాడే పచ్చ మీడియా సాగించే విష ప్రచారం విశేషంగా కనిపిస్తోంది. నిజంగా టీడీపీ ఆరోపించినట్టుగా ఈ కాలంలో జగన్ రూ. 2.01 లక్షల కోట్లు అప్పుగా తెచ్చి ఉంటే అందులో రూ. 1.05 కోట్లు ప్రజలకు చేరింది. టీడీపీ చేసిన అప్పులకు సుమారు రూ 60 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇక మిగిలిన రూ. 40వేల కోట్లతో చేపట్టిన విద్యాసంస్థల అభివృద్ధి, మెడికల్ కాలేజీల ఏర్పాటు, సచివాలయాల సహా ప్రతీ గ్రామంలోనూ మౌలిక వసతుల కల్పన కళ్లెదురుగా కనిపిస్తోంది. అయినా నిత్యం జగన్ ప్రభుత్వం మీద చేసే ప్రచారం మాత్రం ఆగడం లేదు. దానిని ఆధారాలతో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో కౌంటర్ చేయడంలోనే ప్రభుత్వ సమర్థత ఆధారపడి ఉంటుంది.