iDreamPost
android-app
ios-app

గ్రేటర్ బరిలో పత్తాలేని లోక్ సత్తా

గ్రేటర్ బరిలో పత్తాలేని లోక్ సత్తా

గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు, చిన్నాచితక పార్టీలు కూడా ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాయి. వీలైనన్ని చోట్ల అభ్యర్థులను పోటీకి ప్రచారంలో దూసుకుపోయాయి. గెలుపు పట్ల విశ్వాసం లేనిచోట్ల కూడా తమ రాజకీయ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బరిలో నిలిచాయి. కానీ గుడ్ పాలిటిక్స్ గురించి గొప్పచెప్పే లోక్ సత్తా పార్టీ మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో పత్తాలేకుండా పోయింది. బీజేపీకి మద్దతు ప్రకటించి జనసేన గ్రేటర్ లోనూ తమకు పట్టుందని చాటుకుంటే… లోక్ సత్తా మాత్రం కంటికి కనిపించలేదు.

దారితప్పిన దేశ రాజకీయాలకు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ ప్రజల్లోకి జయప్రకాశ్ నారాయణ 2006లో లోక్ సత్తా పార్టీని ప్రారంభించారు. పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారిగా ఉండాలనే వాదనను బలంగా వినిపించారు జయప్రకాశ్ నారాయణ. ఉన్నత వర్గాల్లో, విద్యావంతుల్లో లోక్ సత్తా పట్ల ఆసక్తిని రేకెత్తించారు. కానీ క్రమంగా ఆ పార్టీ తన కార్యకలాపాలను తగ్గించుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.

2009 గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన లోక్ సత్తా ప్రజలకే అధికారాన్నిచ్చే ఎజెండాతో ప్రచారంలో దిగింది. హైదరాబాద్ ను అత్యుత్తమ జీవనయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ఒంటరిగా బరిలోకి దిగిన లోక్ సత్తా మెజార్టీ డివిజన్లలో అభ్యర్థులను పోటీకి నిలిపింది. ఆ పార్టీ తరపున కటారి శ్రీనివాస్ రావును మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ లోక్ సత్తా ఆశించిన ఫలితాలేవీ ఆ ఎన్నికల్లో సాధించలేకపోయింది.

రాజకీయాలను ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఆరంభమైన లోక్ సత్తా ఇప్పటి వరకూ ఎన్నికల రాజకీయాల్లో చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేకపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా లోక్ సత్తా పార్టీ ఉనికిచాటుకోగలిగింది. రాష్ట్ర విభజన తరువాత ఆ పార్టీ భవితవ్యంగా ప్రశ్నార్థకంగా మారింది. చివరకు కూకట్ పల్లి లో కూడా లోక్ సత్తాను ఆదరించేవాళ్లు లేకుండా పోయారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీచేసిన జయప్రకాశ్ నారాయణ ఓటమిపాలవ్వక తప్పలేదు. ఇక అప్పటి నుంచీ ఆ పార్టీ ఎన్నికల పట్ల విముఖతను ప్రదర్శిస్తున్నట్లే కనిపిస్తోంది.

విలువలతో కూడిన రాజకీయల గురించి ప్రవచనాలు చెప్పే జయప్రకాశ్ నారాయణ ఏనాడూ ప్రజల మనిషి అనిపించుకోలేకపోయారు. మేధోపరమైన ప్రసంగాలతోనే దేశాన్ని మార్చేయాలనుకున్నారు. కానీ… ఆయన గొంతు ఎప్పుడూ కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే వినిపిస్తుంది. అందుకే… లోక్ సత్తా పార్టీని ప్రజలు ఆదరించలేకపోయారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల పట్ల కూడా జయప్రకాశ్ నారాయణ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో రైతాంగమంతా ఇవి కార్పోరేట్ల ప్రయోజనాలు కాపాడే చట్టాలంటుంటే అందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నారు జయప్రకాశ్ నారాయణ. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని నాయకత్వం వల్లే ప్రజల నిజమైన సమస్యలు లోక్ సత్తా అర్థంచేసుకోలేకపోయిందని పలువరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి దేశ రాజకీయాలను మార్చాలని ఆరాటపడ్డ లోక్ సత్తా, తనను తాను మార్చుకుంది తప్ప ఎలాంటి మార్పు సాధించలేకపోయింది. అవినీతి, మతోన్మాదం రాజకీయాలను శాసిస్తున్న ప్రస్తుత సందర్భంలో కూడా లోక్ సత్తా పార్టీ తాను ప్రకటించుకున్న ఆశయాల కోసమైనా ఎన్నికల్లో పోటీ చేసి, తాను నమ్మే రాజకీయాల్ని ప్రచారం చేయాల్సింది. పూర్తి నిస్తేజంగా మారిన ఆ పార్టీ ఆమాత్రం సాహసం కూడా చేయలేకపోయింది.