iDreamPost
android-app
ios-app

TDP – Janasena – Kuppam Municipality : కుప్పంలో బాబుకు జనసేన సహాయం.. ఈసారి ఎలా అంటే?

TDP – Janasena – Kuppam Municipality : కుప్పంలో బాబుకు జనసేన సహాయం.. ఈసారి ఎలా అంటే?

ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ మొత్తం మీద అన్ని జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టి మొత్తం.. కుప్పం మీదే ఉంది అనడంతో ఏమాత్రం సందేహం లేదు. కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో రాజకీయం అంతా దాని వైపే చూస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండగా విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లతో కుప్పంలో పొలిటికల్‌ హీట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కుప్పం మున్సిపాలిటీ పోరులో భాగంగా శుక్రవారం నామినేషన్ల పర్వానికి తెర పడింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులకు 240 నామినేషన్లు దాఖలు కాగా వైసీపీ తరఫున 89, టీడీపీ తరఫున 126, కాంగ్రెస్‌ తరఫున 14, బీజేపీ తరఫున 5, జనసేన తరఫున 1, ఇండిపెండెంట్లు 5 నామినేషన్లు దాఖలు చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌ను పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీలు వైసీపీ, టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

అందులో రెండు పార్టీల కీల‌క నాయ‌కులు కుప్పంలో మ‌కాం వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైసీపీ తరపున మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కొంద‌రు అక్క‌డ రంగంలోకి దిగి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కూడా రెండు రోజులు ప‌ర్య‌టించి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారంటే ఆయ‌న ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు స్వగ్రామంలో వార్డు మెంబర్లు మొదలు సర్పంచ్, జెడ్పీటీసీలు కూడా వైసీపీ నుంచే ఎన్నిక కావడంతో ఇక్కడ పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. అందుకే జనసేన, బీజేపీ మద్దతు కూడా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ ఉమ్మడి సీఎం అభ్యర్థి అని జనసేన నేతలు భావిస్తూ ఉంటారు.

Also Read : TDP BJP Alliance -బాబుతో పొత్తుకు బీజేపీ సిద్ధం అవుతుందా?

అలా ఏమన్నా సత్తా చాటాలి అంటే ఇలా మాజీ సీఎం చంద్రబాబు ఇలాకాలో, లేదా వైఎస్ జగన్ ఇలాకాలో గట్టి పోటీ ఇవ్వకున్నా కనీసం పోటీ అయినా చేయాలి. గెలుపోటములు పక్కన పెడితే జనాల్లో ఉన్నామనిపించుకోవాలి. కానీ ఇక్కడ అసలు పోటీకి దిగకుండా జనసేన టిడిపికి సాయం చేస్తుందనే అనుమానం ఆ పార్టీ తీరుతో కలుగుతోంది. కుప్పంలో ఉన్న 25 వార్డులకు 240కు పైనే నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో జనసేన తరఫున దాఖలైంది ఒక్కటంటే ఒక్క నామినేషన్‌. ఈ పరిణామంతోనే జనసేన ఇంట్రెస్ట్ ఏమిటో తెలిసిపోతోంది. ఎన్నికలు జరుగుతున్న ఇతర మున్సిపాలిటీల్లో టీడీపీ, జనసేన పార్టీలు అనధికారిక పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తుండగా.. కుప్పంలో మాత్రం అసలు నామినేషన్లనే దాఖలు చేయకుండా.. టీడీపీకి జనసేన సహకరిస్తోందనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే నామ్‌కేవాస్తే మాదిరిగా ఒక్క నామినేషన్‌ దాఖలు చేశారని చెబుతున్నారు. అదీ కూడా జనసైనికులను సంతృప్తి పరచడానికి తప్ప.. మరో లక్ష్యం లేదనే వ్యాఖ్యలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

ప్రధాన పార్టీలు రెండు ఎన్నికల ఇంచార్జ్ లను నియమించగా జనసేన ఆ వైపు కన్నెత్తి చూడడంలేదు. మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను.. టీడీపీ తరపున పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చూస్తుండగా వైసీపీ తరఫున పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే వెంకటగౌడ పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా త్రిలోక్ బరిలోకి దిగుతుండగా వైసీపీ తరఫున డాక్టర్ సుధీర్ బరిలోకి దిగుతున్నారు.

Also Read : Mini Municipal Elections – టీడీపీ పొత్తుల రాజకీయం.. అదే లక్ష్యమా..?