iDreamPost
iDreamPost
పార్టీని, తమను పట్టించుకోని ఆ ఇంఛార్జి మాకొద్దు బాబూ.. అని క్యాడర్ చాలా నెలలుగా మొత్తుకుంటోంది. వేరే ఇంఛార్జీని నియమించాలని ఒత్తిడి చేసింది. పార్టీ సీనియర్లు కూడా ప్రత్యామ్నాయ నేత ఎవరన్న దానిపై కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. కానీ చివరికి వచ్చేసరికి అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల విన్నపాలు, ఫిర్యాదులన్నింటినీ బుట్టదాఖలు చేసి పాత ఇంఛార్జికే పట్టం కట్టడంతో కార్యకర్తలు, నాయకులు నీరుగారిపోయారు. ఇష్టం లేని కాపురం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతమాత్రానికే తమను మంగళగిరి వరకు ఎందుకు రప్పించారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇంఛార్జి పదవి ఆశించిన వారు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇదంతా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నాయకత్వం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జరిగిన తంతు.
రెండున్నరేళ్లుగా కనిపించని ఇంఛార్జి
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎదుర్కొంటున్న దుస్థితే తంబళ్లపల్లిలోనూ నెలకొంది. పార్టీ ఇంఛార్జిగా ఉన్న జి.శంకర్ యాదవ్ అయిపుఅజా లేకుండా పోయారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన శంకర్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ద్వారకానాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గ ముఖం చూడటం మానేశారు. దాంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు గానీ, కార్యకర్తలకు అండగా నిలిచేవారు గానీ లేకుండా పోయారు. ఈ పరిస్థితి గురించి పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు అనేకసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇంఛార్జీని మార్చాలని కోరుతూ వచ్చారు. చాలాకాలం ఈ విషయం పట్టించుకోని అధిష్టానం ఎట్టకేలకు ఇంఛార్జి మార్పుపై అభిప్రాయ సేకరణ, పార్టీ పరిస్థితిపై సమీక్ష పేరుతో నియోజకవర్గ క్యాడర్ ను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది.
Also Read : నాని విషయాన్ని త్వరగానే తేల్చేసిన బాబు
వార్నింగ్ తో సరి..
అధిష్టానం పిలుపు మేరకు నియోజకర్గంలోని ఆరు మండలాల నుంచి నేతలు, సీనియర్ కార్యకర్తలు తరలివచ్చారు. మొదట పొలిట్ బ్యూరో సభ్యులు కొందరు వారితో విడివిడిగా మాట్లాడి కొంత ఇంఛార్జిగా ఎవరు ఉంటే బాగుంటుందని ఆరా తీశారు. దాంతో ఉత్సాహంగా మాజీ ఎమ్మెల్యేలు ఏ.వి.లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల పేర్లు సూచించారు. ఒక్కరు కూడా ప్రస్తుత ఇంఛార్జీని కొనసాగించాలని చెప్పలేదు. అనంతరం చంద్రబాబు అందరితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలువురు ప్రస్తుత ఇంఛార్జి శంకర్ పై నేరుగా ఫిర్యాదులు చేశారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారని, పార్టీ పని కోసం, ఇతరత్రా సమస్యలు చెబుదామని ఫోన్ చేసినా స్పందించడంలేదని ఆరోపణలు గుప్పించారు. దాంతో సమావేశంలోనే ఉన్న శంకర్ ను చంద్రబాబు ప్రశ్నించారు.
తన తల్లి మరణం, కరోనా పరిస్థితులు, లాక్డౌన్, వ్యక్తిగత సమస్యల వల్ల అందుబాటులో ఉండలేక పోయానని.. ఇకముందు అలా జరగదని.. తనను ఇంఛార్జిగా కొనసాగించాలని శంకర్ కోరారు. చంద్రబాబు స్పందిస్తూ మూడు నెలలు చూస్తానని, పనితీరు మారకపోతే మార్చేస్తానని హెచ్చరించి వదిలేశారు. పార్టీలో ఎవరో ఎలా పనిచేస్తున్నారో తనకు తెలుసని, అందరూ కలిసి పనిచేయాలని షరా మామూలుగా హెచ్చరించి సమావేశాన్ని ముగించేశారు. అప్పటివరకు ఇంఛార్జి మార్పు ఉంటుందని భావించిన నేతలు చంద్రబాబు నిర్ణయంతో హతాశులయ్యారు. ఇంతవరకు వచ్చాక శంకర్ ఆధ్వర్యంలో ఎలా పని చేయగలమని ప్రశ్నిస్తున్నారు. పేరుకు మూడు నెలలని చెప్పినా మళ్లీ అదెప్పుడు జరుగుతుందో అంటూ నిట్టూరుస్తున్నారు. అధినేత నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు.
Also Read : ముందుకు రాని నేతలు, పలు నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వ లేమి