రాజకీయ కారణాలతో అనేక అంశాల్లో కేంద్రంలోని ఎన్డీయే, పశ్చిమ బెంగాల్లోని మమత సర్కారు మధ్య తరచూ విభేదాలు పొడసూపుతున్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. రాజకీయ కారణాలు ఈ పరిస్థితులకు దారి తీస్తున్నాయి. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలపెట్టిన ఇటలీ పర్యటనకు కేంద్రం మోకాలడ్డటం రాజకీయ వివాదం రేపుతోంది. ఎన్నికలప్పటి నుంచి బీజేపీ, తృణమూల్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మరోవైపు సీఎం హోదాలో మమత భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం ఇటలీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం
వచ్చే నెల 6, 7 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ లో ప్రపంచ శాంతి సదస్సు జరగనుంది. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మారియో ద్రఝీ వంటి పలు దేశాల అధినేతలతో పాటు పోప్ ఫ్రాన్సిస్, ఈజిప్ట్ అల్ అజర్ గ్రాండ్ ఇమామ్ అహ్మద్ అల్-తయ్యిబ్ వంటి మతాధిపతులు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన కొందరు శక్తిమంతమైన మహిళలను కూడా సదస్సుకు ఆహ్వానించారు. మనదేశం నుంచి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీని ఒంటిచేత్తో ఓడించి మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతాబెనర్జీకి ఆహ్వానం అందింది. ఆ మేరకు ఇటలీ పర్యటనకు మమత సర్కారు అనుమతి కోరగా కేంద్రం తిరస్కరించింది. పర్యటన ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది.
Also Read : వచ్చే నెలలో బ్రేకప్ ఖాయమా, యూపీ ఎన్నికల వరకూ ఆగుతారా
గతంలో చైనా..ఇప్పుడు ఇటలీకి తిరస్కృతి
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం మమత అసహనం వ్యక్తం చేయగా.. తృణమూల్ కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. గతంలో మమత చైనా పర్యటనకు వెళ్లాలనుకున్నప్పుడు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇటలీ పర్యటనను అడ్డుకుంటున్నారని.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని తృణమూల్ అధికార ప్రతినిధి దేవాన్ష్ భట్టాచార్య విమర్శించారు. దేశాల మధ్య సంబంధాల మెరుగుకు తోడ్పడుతుందన్న ఉద్దేశంతో మమత ఇటలీ పర్యటనకు సిద్ధమయ్యారని.. తామేమీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వెళ్లడం లేదని ఆయన అన్నారు. గతంలో ప్రధాని మోదీ ఇటలీ వెళ్లలేదా.. అని నిలదీశారు.
అయితే అనుమతి నిరాకరణకు సంబంధించి విదేశాంగ శాఖ వాదన మరోలా ఉంది. సదస్సుకు ప్రతినిధి బృందాలను తీసుకురావద్దని ప్రపంచ శాంతి సదస్సు నిర్వాహకులు పేర్కొనగా.. దానికి విరుద్ధంగా మమతా బెనర్జీ తన వెంట ఒక బృందాన్ని తీసుకెళ్లడానికి అనుమతి కోరారని పేర్కొన్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడుల శాఖ అధికారులతో కూడిన బృందాన్ని మమత ఇటలీకి తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యారని.. అందుకే అనుమతి నిరాకరించమని కేంద్ర ఉన్నతాధికారులు వివరించారు. ఏమైనా భవానీపూర్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఈ అంశం కూడా రాజకీయ వివాదంగా మారింది.
Also Read : ఆంధ్రజ్యోతివి అబద్ధాలని చాటిచెప్పిన ఆదిత్యానాధ్ దాస్ వ్యవహారం