iDreamPost
iDreamPost
వైఎస్ జగన్ తన రూటే సెపరేటు అని మరోసారి నిరూపించుకున్నారు. పారదర్శకంగా పాలన చేస్తామని చెప్పిన ఆయన మాటను పాటిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. పత్రికల ద్వారా వాస్తవాలను వెల్లడించేందుకు ముందుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం విధించిన వ్యాట్, దాని పూర్వాపరాలను ప్రజల ముందుంచారు. పెద్ద మొత్తంలో పెట్రోల్ ధరలు పెంచిన వాళ్లే రోడ్డెక్కి ధర్నాలు చేస్తారా అంటూ బీజేపీని నిలదీశారు. అందుకు తోడుగా చంద్రబాబు ద్వంద్వనీతిని తూర్పారబట్టారు.
ఇన్నాళ్లుగా తమ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను మాత్రమే పత్రికల్లో ప్రకటనలుగా ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యింది. దానికి అనుగుణంగా భారీ ప్రకటనలు విడుదల చేసింది. పెట్రోల్ ధరల విషయంలో గడిచిన ఐదారేళ్లుగా అవలంభిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు పూనుకుంది. తద్వారా జగన్ తనదైన శైలిలో వాస్తవాలను జనం ముందుంచడం ద్వారా విపక్షాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా జనాలకు పూర్తి విషయాలు తెలియజేయడం ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా సాగాలనే తన సంకల్పాన్ని ఆచరించి చూపించారు.
ఒకరేమో ఇబ్బడిముబ్బడిగా పెంచేసి, అరకొరగా తగ్గించి, ఇప్పుడు ధర్నాలు అంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శింశించారు. తన హయంలో ఎంతపెంచారన్నది మరచిపోయినట్టుగా ఇప్పుడు చంద్రబాబు రాజకీయాలకు పూనుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం కోసమే ఈ ప్రకటన అంటూ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారికంగా పేర్కొనడం విశేషం.
కేంద్రం ఏకంగా రూ. 3.35 లక్షల కోట్లు వసూలు చేస్తూ అందులో రాష్ట్రాలకు కేవలం రూ. 19వేల 475 కోట్లు మాత్రమే అంటే 5.8 శాతం మాత్రమే చెల్లిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 41 శాతం కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు వాటాగా రావాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా సెస్ లు, సర్ చార్జీలంటూ రాష్ట్రాలకు ఎగనామం పెడుతున్న తీరుని ఎండగట్టారు. 2019 మే నెలలో లీటర్ పెట్రోల్ రూ. 76.89గా ఉంటే నవంబర్ 1 , 2021 నాటికి దానిని రూ. 116గా పెంచింది నిజం కాదా అని నిలదీశారు.
జగన్ హయంలో కేవలం ఒకే ఒక్క రూపాయి అదనంగా పన్నులు వేసిన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు పాలనలోనే రూ. 4 చొప్పున వ్యాట్ కి అదనంగా వసూలు చేసిన సంగతిని గుర్తు చేశారు. అయినా ఇవన్నీ విస్మరించి అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా రాజకీయాలకు పూనుకోవడం తగదని తేల్చేశారు. ప్రజలకు అవాస్తవాలు చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నం సహించేది లేదన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. నిజాలు చెప్పడం ద్వారా జనాల ముందు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసేందుకు సిద్ధమయ్యింది. తద్వారా జగన్ తన పాలనా విధానంలో మరో కొత్త ప్రక్రియకు సిద్ధమయినట్టుగా కనిపిస్తోంది. విపక్షాల అవాస్తవాలను అధికారికంగా ఎండగట్టే విధానం చేపట్టినట్టు స్పష్టమవుతోంది. ఇది టీడీపీ సహా ఇతర పార్టీలను ఇరకాటంలో పెడుతుందనడంలో సందేహం లేదు.