iDreamPost
android-app
ios-app

మాజీ ఎమ్మెల్యే భంజదేవ్ టీడీపీలో ఇక నామమాత్రమేనా?

  • Published Oct 11, 2021 | 11:12 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
మాజీ ఎమ్మెల్యే భంజదేవ్ టీడీపీలో ఇక నామమాత్రమేనా?

సీనియర్లను పక్కన పెడుతూ రెండురోజుల క్రితం టీడీపీ అధిష్టానం ఆరు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమించింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు ఎస్టీ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని నియమించడంతో ఇప్పటివరకు ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ భంజదేవ్ ఇక నామమాత్రం కానున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్లు చేసిన సేవలు మరిచి పదవి నుంచి తప్పించడం పట్ల ఆయన అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దాంతో కొత్త ఇంఛార్జి సంధ్యారాణికి ఆయన నుంచి సహకారం అందుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరి మధ్య గతం నుంచీ విభేదాలు ఉన్న విషయాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

వయసు, వరుస ఓటములే కారణం

సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్న భంజదేవ్ వయసు 67 ఏళ్లు. మూడుసార్లు టీడీపీ తరఫున సాలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయితే 2004 ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్నదొర భంజదేవ్ ఎస్టీ కాదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు భంజదేవ్ ఎన్నికను కొట్టివేస్తూ 2006లో తీర్పు ఇవ్వడంతో ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఇదే వివాదం కారణంగా 2009లో పోటీకి దూరమైన ఆయన 2014, 2019 ఎన్నికల్లో రాజన్నదొర చేతిలో ఓటమి చవి చూశారు.

సంధ్యారాణికి సహకారం లభించేనా..

భంజదేవ్ చురుగ్గా లేరన్న కారణంతో పార్టీ అధిష్టానం ఆయన్ను తప్పించి సంధ్యారాణికి ఇంఛార్జి పదవి కట్టబెట్టింది. కానీ వారిద్దరి మధ్య మొదటి నుంచీ విభేదాలు ఉన్నాయి. 2009లో కాంగ్రెసు నుంచి టీడీపీలో చేరిన సంధ్యకు ఆ వెంటనే పోటీ చేసే అవకాశం లభించింది. కుల ధ్రువీకరణ వివాదం వల్ల భంజదేవ్ పోటీకి అనర్హుడు కావడంతో ఆమెకు టికెట్ ఇచ్చినా.. సంధ్య ఓడిపోయారు.

2014 ఎన్నికల నాటికి భంజదేవ్ కుల ధ్రువీకరణ వివాదం నుంచి బయటపడటంతో మళ్లీ ఆయనకే టీడీపీ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి సంధ్యారాణి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ సాలూరులోనూ ఆమె వర్గం సహాయ నిరాకరణ, సిటింగ్ ఎమ్మెల్యే రాజన్నదొరకు ఉన్న ఆదరణ కారణంగా భంజదేవ్ కూడా ఓడిపోయారు. తర్వాత కాలంలో చంద్రబాబు సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో నియోజకవర్గ టీడీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఎవరి వర్గాన్ని వారు కాపాడుకోవడానికే ప్రయత్నించడంతో 2019 ఎన్నికల్లోనూ భంజదేవ్ కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో భంజదేవ్ ను తప్పించి సంధ్యారాణిని ఇంఛార్జిగా నియమించారు. గతంలో తనకు సహకరించని ఆమె విషయంలో భంజదేవ్ కూడా అదే రీతిలో వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు ఎమ్మెల్యే రాజన్నదొర పనితీరు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ టీడీపీకి అవకాశం లేకుండా చేస్తాయంటున్నారు.