iDreamPost
iDreamPost
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ మైనారిటీ నేత, మాజీమంత్రి అన్వర్ రాజాను ఏఐఏడీఎంకే బహిష్కరించింది. దీంతో ముస్లిం నేతలు లేని పార్టీగా మారిందన్న అసంతృప్తి ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో రాజాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఏడీఎంకే కో ఆర్డినేటర్ పన్నీరుసెల్వం, డిప్యూటీ కో ఆర్డినేటర్ పళనిస్వామిల పేర్లతో జారీ చేసిన ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యతో పార్టీకి ముస్లిం నేతలే లేకుండా పోయారు. ఉన్న ముగ్గురు ప్రముఖ నేతల్లో ఒకరైన మహ్మద్ జాన్ మార్చిలో మృతి చెందారు. మరో నేత నిలోఫర్ కఫిల్ ను గత మే నెలలో తొలగించారు. ఇప్పుడు రాజాను కూడా బహిష్కరించడంతో మైనారిటీ నేతలు లేని పార్టీగా మారింది.
ఎంజీఆర్ సహచరుడు
అన్వర్ రాజా ఏడీఎంకేలో అత్యంత సీనియర్ నాయకుడు. 1960లో అవిభక్త డీఎంకేలో చేరిన ఆయన ఎంజీ రామచంద్రన్ ఏడీఎంకే పార్టీ పెట్టినప్పుడు అందులోకి మారి.. అప్పటి నుంచి కొనసాగుతున్నారు. రామనాథపురానికి చెందిన ఆయన అక్కడి నుంచి ఎంపీగా కూడా పని చేశారు. 2001-2006 మధ్య ఏడీఎంకే ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. దివంగత జయలలితకు, పార్టీకి మద్దతుగా రాష్ట్రంలో ముస్లిం వర్గాలను కూడగట్టడంలో కీలకపాత్ర పోషించారు. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వం, బీజేపీతో పొత్తుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక జిల్లా పార్టీ సమావేశంలో ఏడీఎంకే, బీజేపీ పొత్తును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ పొత్తు వల్లే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. దీనికితోడు పార్టీలోకి మళ్లీ రావడానికి ప్రయత్నిస్తున్న శశికళ మద్దతుదారుడిగా రాజాకు పేరుంది. ఇవన్నీ ఆయన బహిష్కరణకు దారితీశాయని అంటున్నారు.
వ్యతిరేకించిన పన్నీరు సెల్వం
రాజా బహిష్కరణను పార్టీ సమన్వయకర్త ఓ.పన్నీరుసెల్వం మొదట వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చివరికి ఒత్తిడికి తలొగ్గి అయిష్టంగానే అంగీకరించారని అంటున్నారు. మరోవైపు రాజా బహిష్కరణపై పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పళనిస్వామి సీఎం అయిన తర్వాత నుంచి పార్టీ పరిస్థితి దిగజారిందని ఆరోపిస్తున్నారు. ఆయన ఆధిపత్యంలోనే పార్టీ బీజేపీకి దగ్గరైందని, అదే పార్టీ ఓటమికి దారి తీసిందని అంటున్నారు.
తాత్కాలిక ప్రిసీడియం చైర్మన్ గా ముస్లిం నేత
మరోవైపు ఏడీఎంకే తాత్కాలిక ప్రిసీడియం చైర్మన్ గా ఎంజీఆర్ మండ్రమ్ కు చెందిన తమిళ మగన్ హుస్సేన్ నియమితులయ్యారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి బదులు సమన్వయకర్త, ఉప సమన్వయకర్తలతో కూడిన ద్వంద్వ నాయకత్వాన్ని కొనసాగించడానికి కార్యవర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. పార్టీ పాథమిక సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
Also Read : Mamata , Modi – మమతా ఎత్తులు, మోడీ ఆల్ హ్యాపీస్