iDreamPost
iDreamPost
తెలుగు చాలా గొప్పది , ఓ సందర్భానికి , ఓ ఘటనకు , లేదా ఓ అంశానికి సరిపోలిన ఉదాహరణకు చమత్కారాన్ని జోడించి చెప్పటాన్నే సామెత అంటారు . ఇలాంటి సామెతలు మన తెలుగులో ఉన్నన్ని మరే భాషలోనూ ఉండేవేమో .
ఓ ఉదాహరణ చూద్దాం . ఇవాళ పవన్ కల్యాణ్ గారు మండపేట మీటింగ్లో తన అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీ వలనే నేను ఓడిపోయాను . మీకు క్రమశిక్షణ లేకపోవటమే నా ఓటమికి కారణం అన్నారు .
ఈ సందర్భానికి సరైన సామెత “చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం” .
అవును , ఏదైనా మితిమీరి నష్టం జరక్కముందు జాగ్రత్త పడాలి కానీ , జరిగిన తర్వాత అనుకొని ప్రయోజనం ఏముంది? ఆ మాటలు పవన్ కళ్యాణ్ నష్టం జరగక ముందే అని ఉంటె బాగుండేది.
2014లో జనసేన పార్టీ పెట్టిన నాటి నుండి కొందరు పవన్ వీరాభిమానులు హద్దు మీరి ప్రవర్తిస్తుంటే ఏనాడూ పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో ఇతర పార్టీ వాళ్ళు జనేన పార్టీ గురించి చిన్న ప్రశ్న వేసినా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన రచ్చ ,వాడే పదజాలాన్ని ఏ రోజైనా అదుపు చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయలేదు..
తన కుటుంబ సభ్యుల సినీ ఫంక్షన్స్ లో సైతం పవన్ అభిమానుల అల్లరి తట్టుకోలేక నాగబాబు అసహనం వ్యక్తం చేసినప్పుడు కానీ , అల్లు అర్జున్ ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లరి చేసినప్పుడు కానీ వాళ్ళని వారించే ప్రయత్నం ఎంతమాత్రం చేయలేదు పవన్ కళ్యాణ్.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కొందరు భీమవరం అభిమానులు తమ బైక్ సైలెన్సర్లు తీసేసి తిరుగుతుంటే, అది తప్పని వారించకపోగా ఇంట్లో తుపాకీలు కాలిస్తే తప్పులేదు కానీ నా అభిమానులు సైలెన్సర్ లేకుండా బండి తిప్పితే తప్పేంటి అని పవన్ కళ్యాణ్ పరోక్షంగా బాలకృష్ణ ని ఎగతాళి చేయడం కూడా సమంజసం కాదు. అప్పుడే తన అభిమానులను పవన్ మందలించి ఉంటే బాగుండేది.
సోషల్ మీడియాలో కానీ , టీవీ డిబేట్స్ లో కానీ పవన్ అభిమానులు కొందరు వాడే జగుప్సాకర భాషకి, జనం అసహ్యంతో దూరం జరిగిపోతున్నప్పుడే ఈ ప్రమాదాన్ని ఊహించి కట్టడి చేయాల్సింది . కానీ పవన్ తన అభిమానులు అభిమానం పేరుతొ సోషల్ మీడియాలో ఇతరులపై జరిపే దాడిని ఏ ఒక్కసారి ఖండించలేదు. దీనితో అయన అభిమానులకు హద్దులే లేకుండా పోయాయి అనడంలో ఆశ్చర్యం లేదు.
ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి రేణు దేశాయ్ కొంచెం మాట్లాడిందని చివరికి రేణూ దేశాయ్ వ్యక్తిగత జీవితంలోకి పవన్ అభిమానులు చొరబడి రేణూ దేశాయ్ ని పరుష పదజాలంతో దూషించి , చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన అభిమానులను మందలించలేదు. నా వ్యక్తిగత విషయం ఎవరూ మాట్లాడొద్దు . ఓ మహిళని తిట్టడం తప్పు అని పవన్ కళ్యాణ్ అన్న పాపాన పోలేదు.
మొక్కై వంగనిది మానై వంగునా అని ఆ రోజే అభిమానులు చేసే అలాంటి వ్యాఖ్యలను పవన్ ఆపి ఉంటే పవన్ సమక్షంలోనే తలలు తీస్తా అని సవాళ్లు విసిరే పరిస్థితికి ఆయన అభిమానులు దిగజారేవారు కాదు. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? ఆఖరికి ఒక బాధ్యతాయుత పార్టీ అధ్యక్షుడై ఉండి పవనే తాట తీస్తా, తోలు తీస్తా అంటే అయన అభిమానులు తలలు తీస్తాం అనడంలో తప్పేముంది?
ఇది ఖచ్చితంగా పవన్ లో ఉన్న లోపమే. పవన్ కళ్యాణ్ అభిమానులు అదుపు తప్పినప్పుడల్లా చోద్యం చూస్తూ , చూసారా నా అభిమానులు నా జోలికి వచ్చినా , నా గురించి వ్యాఖ్యానించినా ఏం జరుగుతుందో చూడండి అన్నట్టు వ్యూహాత్మకంగా మౌనం పాటించి వారిని ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పా అని సంతోష పడబట్టే వారు ప్రత్యర్ధులని దాటి సమాజంకి , చివరికి పవన్ కళ్యాణ్ కి కూడా తలనొప్పిగా తయారయ్యారు .
చేసుకొన్న వాడికి చేసుకొన్నంత మహాదేవోభవ అని, చోద్యం చూసిన (చేసిన) పాపం అనుభవించక తప్పదు .