iDreamPost
iDreamPost
ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ దినపత్రికలు అమరావతి గురించి ప్రముఖంగా వార్తలు రాశాయి. ఐదేళ్ళ క్రితం ఇదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసిన అమరావతి ఇప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురయిందని, ఆశల సమాధి అయిందని ఒక పత్రిక రాస్తే, అమరావతి కల మూడు ముక్కలయింది ఇంకో పత్రిక రాసింది.
గడచిన ఐదేళ్ళు ప్రపంచ స్థాయి నగరమని, ప్రపంచ నగరమని, గ్లోబల్ డెస్టినేషన్ అని చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించారు. విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అధికారంలో ఉన్న టిడిపి నేతలు ఒక నగరం నిర్మించే పని ఒక యజ్ఞంలా చేశారు. ఇందులో రైతులనుండి భూమి సమీకరించడం, ప్రైవేటు సంస్థలకు కేటాయించడం మినహా ఇతరత్రా పనులేవీ పెద్దగా జరగలేదు. అసెంబ్లీ, సచివాలయాలకు ఆరు భవనాలు నిర్మించారు. ఆపైన సివిల్ కోర్టు అంటూ నిర్మించిన ఓ భవనంలో హై కోర్టు తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా అక్కడ సంపూర్ణంగా జరిగిన పనులేవీ కనిపించవు. సగం వేసిన రోడ్లు, సగం నిర్మించిన భవనాలు, సగం పూర్తిచేసిన శంకుస్థాపన పనులు మినహా ఇంకేవీ అక్కడ కనిపించవు. రాజధానిగా గుర్తించిన 29 గ్రామాల్లో దొండపాడు పరిసరాల్లో కొన్ని, రాయపూడి పరిసరాల్లో కొన్ని అసంపూర్తిగా ఉన్న అపార్టుమెంట్లు, నేలపాడు గ్రామ పరిసరాల్లో పునాది వేసిన గుర్తులు, ఉద్దండరాయునిపాలెం పరిసరాల్లో ఇంకొన్ని పునాది వేసిన గుర్తులు మినహా అక్కడ కనిపించేవి ఏవీ ఉండవు. ఇందులో ప్రజల ఆశలు ఎక్కడున్నాయో? ఏ ప్రజల ఆశలు ఉన్నాయో మాత్రం ఏ పత్రికా చెప్పలేదు.
చారిత్రక అమరావతి – చంద్రబాబు అమరావతి
ఇక ఈ అమరావతి ఎవరిదీ అనేది పెద్ద ప్రశ్న. చారిత్రక అమరావతి, శాతవాహనులు, గజపతి వంశీయులు, బౌద్ధ సన్యాసులు తిరుగాడిన అమరావతి వేరు. చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం అని చెప్పే అమరావతి వేరు. చారిత్రక అమరావతికి, చంద్రబాబు అమరావతికి పొంతన లేదు. పోలిక లేదు. కానీ తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు, ఆయన బాజా భజంత్రి మీడియా మాత్రం చారిత్రక అమరావతి, చంద్రబాబు అమరావతి ఒక్కటే అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాయి.
అమరావతి అని పేరు కనిపించగానే శాతవాహనులు అంటూ, శ్రీకృష్ణదేవరాయలు అంటూ, గౌతమ బుద్ధుడు అంటూ కూనిరాగం అందుకునే చంద్రబాబు లేదా ఆయన భజంత్రీ మీడియా ఆ చారిత్రక అమరావతిని రాజధాని అమరావతిలో ఎందుకు భాగం చేయలేదో చెప్పగలరా?! కనీసం ఈ రాజధాని అమరావతి వేరు, ఆ చారిత్రక అమరావతి వేరు అనే నిజం అయినా చెప్పగలరా!?
ఎవరి ఆశలు?
నాలుగు పంటలు పండే భూములతో పాటు మెట్ట భూములు కూడా తీసుకున్న చంద్రబాబు ఎంతమంది తన సామాజికవర్గం వారితో పెట్టుబడులు పెట్టించారు? ఎంతమంది అక్కడ భూములు కొన్నారు? హైదరాబాద్, బెంగుళూరు నగరాలతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలనుండి ఎంతమంది చంద్రబాబు సామాజికవర్గ నేతలు ఇక్కడ భూములు కొన్నారో చెప్పగలరా? వారెవరూ భూములు కొనకూడదు అని కాదు గానీ, ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన సంకేతాల మేరకు ఆశావహులు, పెట్టుబడి పెట్టేవారు నూజివీడు వైపు వెళ్ళి భూములు కొంటుంటే చంద్రబాబు సామాజికవర్గం వారు మాత్రమే తుళ్ళూరు మండలంలోని గ్రామాల్లో భూములు ఎలా కొనగలిగారు? ఇంకొందరు ఏకంగా అమరావతి నగర సరిహద్దులు ముందే తెలిసినట్టు వాటి పరిధి బయట భూములు ఎలా కొనుగోలు చేశారు? ఇప్పుడు వీరి ఆశల పునాదికేనా సమాధి కట్టింది?
భూములు సమీకరిస్తుంటే పోరాటం చేసిన రైతులు, రైతు కూలీల గురించి చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఉపాధి కోల్పోయి వలస పోతున్న 29 గ్రామాల వ్యవసాయ కూలీల వెతలు ఎప్పుడైనా చంద్రబాబు విన్నారా? వారి ఆశలు అప్పుడే సమాధి అయ్యాయి కదా!? ఇప్పుడు కొత్తగా సమాధి అయింది వారి ఆశలా లేక ఏదో ఆశించి అక్కడ ముందుగానే పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారి ఆశలా? లేక అక్కడ మహా నగరం నిర్మిస్తే తమ ఆస్తుల విలువ కోట్లల్లో ఉంటుందని కలలు కన్న వారి ఆశలేనా సమాధి అయింది? వారి కలలేనా ముక్కలయింది? లేక ఉపాధి కోల్పోయి వలస పోతున్న వారి కలలు కూడానా?
అక్కడ రైతులు భూములు అమ్ముకున్నారు. రేటు ఎంత అనేది పక్కన పెడితే రైతులు చాలామంది తమ భూములు అమ్ముకున్నారు. మరి ఆ భూములు కొన్నవారు వాటిని రాజధానికి సమీకరణలో ఇచ్చారా? లేదా? ఈ కొన్న భూములు ఎక్కడున్నాయి? రైతులు అమ్మిన భూములు ఎక్కడున్నాయి? ఈ లెక్కలు ఎప్పుడైనా చెప్పారా? చర్చ ఈ దిశగా ఎప్పుడైనా నడిపారా?
అక్కడ 29 గ్రామాల్లో ఆ పైన రాజధాని అమరావతి నగర సరిహద్దు వెలుపల జరిగిన భూముల లావాదేవీల గురించి ప్రస్తావించండి. అప్పడు మాట్లాడితే ఎవరి కలలు ముక్కలయ్యాయో, ఎవరి ఆశలు సమాధి అయ్యాయో తేలిపోతుంది. చర్చ ఆ దిశగా నడిపించండి.