iDreamPost
iDreamPost
హిమాలయ పర్వతసానువుల్లో కొలువుదీరిన ఉత్తరాఖండ్ రాష్ట్రం కాశ్మీర్ తరువాత సహజసిద్ధమైన అందచందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అలాగే గంగా, యమున నదులకు పుట్టినిళ్లు.. హరిద్వార్, రుషికేష్, బదరీనాధ్, కేదార్‌నాధ్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు. ఇక్కడి ప్రజలు అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. అంతేకాదు శాంతియుతంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన విలక్షణ వ్యక్తిత్వం ఉన్నవారు. అందుకే ప్రజలు ప్రతీ ఎన్నికల్లో ఏదో ఒక జాతీయపార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కాని రాజకీయ పార్టీలు.. వాటి అధినేతలు.. పాలకులు తమ స్వార్థ మనస్తత్వాలతో అస్థిరమైన పాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో భాగమైన ఉత్తరాంఛల్ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించి కల సాకారం చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పాయి అధికారంలో ఉండగా ఉత్తరాంఛల్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఉత్తరాంఛల్ ప్రాంతం 2000 నవంబరు9న ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పడింది. అప్పట్లో యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2000 నుంచి 2001 వరకు (354రోజులు) నిత్యానందస్వామి తొలి ముఖ్యమంత్రిగా పాలించారు. తరువాత బీజేపీ హయాంలోనే 2001 నుంచి 2002 వరకు (122 రోజులు) భగత్‌సింగ్ కోషిరియా పనిచేశారు.
రాష్ట్ర విభజన తరువాత 2002లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలు సాధించగా, బీజేపీ 19 స్థానాలకు, బీఎస్పీ 7 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణదత్ తివారీ పూర్తికాలం పదవిలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ల ఐదు రోజులు పనిచేశారు. తివారీ మినహా మిగిలిన ఎవ్వరూ ఐదేళ్లు పనిచేసింది లేదు. ఇక రెండవ సారి 2007లో జరిగిన ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి 42 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 36, ఉత్తరాఖండ్ క్రాంతిదల్ 3, స్వతంత్రులు 3తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పదవీ కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. భవన్ చంద్ర ఖండూరి 2007 నుంచి 09 వరకు (రెండేళ్ల 111 రోజులు), రమేష్ పోఖ్రియాల్ 2009 నుంచి 11 వరకు (రెండేళ్ల 75 రోజులు), తిరిగి మరోసారి భవన్ చంద్ర ఖండూరి 2011 నుంచి 12 వరకు (184 రోజులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
Also Read : Up Elections, Priyanka Gandhi, Women Card – యూపీలో ప్రియాంక మహిళా మంత్రం పనిచేస్తుందా?
ఉత్తరాఖాండ్‌కు మూడవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి 42 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 36, ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (పి) 1, బీఎస్పీ 2, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఆ పార్టీ తరపున విజయ బహుగుణ సీఎం అయ్యారు. ఆయన 2012 నుంచి 2014 వరకు (ఏడాది మీద 324 రోజులు) పనిచేశారు. ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదల నివారణ, తరువాత చేపట్టిన సహాయ పునరావస చర్యల విషయంలో విమర్శలు వెెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో హరీష్‌సింగ్ రావత్ సీఎం అయ్యారు.
ఒకే అసెంబ్లీ కాలంలో రావత్ మూడుసార్లు సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. తొలిసారి ఆయన 2014 నుంచి 2016 వరకు (రెండేళ్ల 55 రోజులు) పనిచేశారు. తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు తిరగడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇదే అదనుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. 25 రోజులు రాష్ట్రపతి పాలనలో ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టడంతో రావత్ రెండవ సారి 2016 ఏప్రిల్ 21న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించడంతో కేంద్రం మరోసారి రాష్ట్రపతి పాలన విధించింది. దీనితో రావత్ ప్రమాణం చేసిన తరువాత రోజే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. పంతొమ్మిది రోజుల రాష్ట్రపతి పాలన తరువాత 2016 మే 11వ తేదీ నుంచి 2017 వరకు (311 రోజులు) సీఎంగా ఉన్నారు.
నాల్గవసారి బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 57 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. బీజేపీ మూడింట రెండొంతులు మెజార్టీ సాధించినా ప్రస్తుత ముఖ్యమంత్రితో ముగ్గురు ముఖ్యమంత్రులు పాలిస్తున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ 2017 నుంచి 21 వరకు (మూడేళ్ల 357 రోజులు), తిరాత్ సింగ్ రావత్ 2021లో (116 రోజులు), పుష్కర్ సింగ్ ధమాని 2021 జూలై 4 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రజలు తీర్పు చాలా విస్పష్టం. ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి.. మరో ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తూ తన విలక్షణతను చాటుకుంటుంన్నారు. కానీ సీఎంలే నిలకడగా ఉండడం లేదు. వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఆనవాయితీని కాదని బీజేపీకి మరోసారి పట్టం కడతారో చూడాల్సి ఉంది.
Also Read : Babri Masjid – బాబ్రీ మసీదు కూల్చివేత.. భారత చరిత్రలో పెద్ద మరక -ఆ ఘటనకు 30 ఏళ్లు