iDreamPost
iDreamPost
ఏపీ శాసనమండలిలో ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే పిల్లి బోస్ కి సంబంధించిన సీటు కాల పరిమితం ఏడాది లోపు ఉండడంతో భర్తీకి అవకాశం లేకుండా పోయింది. దాంతో మోపిదేవి స్థానంలో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగష్ట్ 24న ఎన్నిక జరగబోతోంది. గెలిచిన వారికి రెండున్నరేళ్ల పదవీకాలం ఉంటుంది. 2023 మార్చి 29 వరకూ వారికి అవకాశం ఉంటుంది.
దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల మూడు ఖాళీలుగా కాగా వాటిని రెండు ఎస్సీ, ఒకటి మైనార్టీ వర్గాలకు కేటాయించారు. వారిలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ని మాదిగ కోటాలో మొదట మండలికి పంపించారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో మాల కులానికి చెందిన పండుల రవీంద్రబాబుతో పాటు మైనార్టీ కోటాలో జకియా ఖానమ్ కి అవకాశం దక్కింది. టీడీపీకి రాజీనామా చేసిన సమయంలో తన పదవిని వదులుకున్న డొక్కాకి వెంటనే అవకాశం రాగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పండుల, జకియాకి ఛాన్స్ దక్కింది.
ప్రస్తుతం ఒకే ఒక్కడికి అవకాశం ఉండడంతో పలువురు తమకే ఆ సీటు దక్కుతుందనే ఆశాభావంతో కనిపిస్తున్నారు. ఈ జాబితాలో మర్రి రాజశేఖర్ పేరు ముందుగా వినిపిస్తోంది. ఆయనకు చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం వదులుకున్నందుకు గతంలోనే జగన్ హామీ ఇచ్చారు. ఈసారి ఓసీలలో అవకాశం ఇస్తే కమ్మ కులానికి చెందిన మర్రి రాజశేఖర్ కి మార్గం సుగమం అవుతుందని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో కాపు కోటాలో తోట త్రిమూర్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే రామచంద్రాపురం నుంచి బోస్ రాజ్యసభకి, చెల్లుబోయిన వేణు జగన్ క్యాబినెట్ కి బెర్తులు దక్కించుకున్నారు. దాంతో మళ్లీ వెంటనే అదే ప్రాంతం నుంచి త్రిమూర్తులకు అవకాశం కష్టమేనని అంతా చెబుతున్నారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి ఈసారి అవకాశం ఇచ్చి, ఆతర్వాత మార్చిలో మర్రి రాజశేఖర్ కి ఛాన్స్ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందని చెబుతున్నారు. మార్చి నెలలో మొత్తం 10 సీట్ల భర్తీకి అవకాశం ఉంది. దాంతో ఎక్కువ మంది ఆశావాహులకు అప్పుడే న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ఈ తరుణంలో మర్రి రాజశేఖర్ కి ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి ఛాన్స్ వస్తుందా లేక మార్చి వరకూ వేచి చూడాలా అన్నది జగన్ చేతిలో ఉంది. ఆయన ఈ వారంతంలోగా తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు. మరోసారి ఏకగ్రీవంగా మండలి ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.