తీవ్ర మథనం తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపారు. ఈ నెల 13 లేదా 14న ఆయన బీజేపీలో చేరతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ప్రకటించారు. ఈటల తీసుకున్న నిర్ణయంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల ముందు వరకూ ఈటల మాట్లాడుతూ స్వతంత్రంగానే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటానని చెప్పేవారు. అన్ని పార్టీల నాయకులను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆయనకు సానుభూతితో పాటు పలువురి మద్దతు పెరిగింది. తనకు అన్యాయం చేసిన అధికార పార్టీని ఢీకొట్టేందుకు స్వతంత్రంగా ఈటల సిద్ధమవుతున్నారన్న వార్తలు ప్రజల్లో ఓరకమైన భావనను కలగజేశాయి. అది ఈటలకు మద్దతుగానే ఉండేది. బీజేపీ రూట్లోకి వెళ్లినప్పటి నుంచీ ఈటల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బలహీనపడ్డారా?
ఈ విషయమై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘అధికార పార్టీని ఎదుర్కోవాలని అనుకున్నప్పుడు స్వతంత్రంగానే ఉంటే బాగుండేది. లేదా పార్టీ పెట్టి టీఆర్‌ఎస్ పై వ్యతిరేకత ఉన్న నాయకులందరినీ కలుపుకుంటే రాజేందర్ బలం పెరిగేది. ప్రజల్లో కూడా సానుభూతి పవనాలు వీచేవి.’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘హుజూరాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలిచేవారు. కానీ బీజేపీలో చేరాలన్న నిర్ణయంతో ఆయన బలహీనపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో సమానంగా భాగస్వామి అయిన ఈటల రాజేందర్.. బీజేపీలో చేరతానని చెప్పి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
మైలేజీ తగ్గించుకున్నారా
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈటల రాజేందర్‌ను ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు ఆశ కలిగింది. మరో ఉద్యమ నాయకుడి రూపంలో రాష్ట్రంలో మార్పు రాబోతుంది అని భావించారు. ఈటల నిర్ణయం తప్పా, కాదా అని నేను చెప్పలేను. కానీ, అందరినీ కలుపుకుని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైతే ఈటల మైలేజీ పెరిగేది’’ అని పేర్కొన్నారు. ప్రజల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. బీజేపీకి రాష్ట్రంలో సానుకూలమూ ఉంది… వ్యతిరేకతా ఉంది.. ఇటువంటి క్రమంలో ఈటలకు బీజేపీ నాయకుడనే ముద్ర ఎక్కడో కాస్త నలత లాంటిదేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్‌లో ఈటల వల్ల బీజేపీకి లాభమే కానీ, బీజేపీ వల్ల ఈటలకు లాభం ఉండదనే చర్చ జరుగుతోంది.
Also Read : నేదురుమల్లి వారసులు ఏం చేస్తున్నారు..?