iDreamPost
android-app
ios-app

శశికళ త‌ప్పుకోవ‌డం లాభ‌మా, న‌ష్ట‌మా?

శశికళ త‌ప్పుకోవ‌డం లాభ‌మా, న‌ష్ట‌మా?

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న‌ట్లు శ‌శిక‌ళ ప్ర‌క‌టించ‌డం త‌మిళ‌నాడులో సంచ‌ల‌న‌మైంది. అయితే కొన్ని రాజ‌కీయ పార్టీల‌కు అది వ‌ర‌మైతే, కొన్నింటికి అది న‌ష్టం చేకూరుస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. శశికళ రాజీనామాతో ఏ పార్టీలో ఏం జరుగబోతోంది? అధికార అన్నాడీఎంకే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?..

తమిళనాట ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. శశికళ తప్పుకోవడంతో తమకెంత లాభమంటూ తమిళ పార్టీలు కూడా బేరీజు వేసుకుంటున్నాయి. శశికళ తాజా ప్రకటనతో తమ ఓట్లు చీలబోవని, గంపగుత్తగా తమకే పడతాయని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ నేతలు సైతం.. ఇదేవిధమైన అంచనాల్లో ఉన్నారు.

శశికళ రాజకీయాల్లోకి కొనసాగితే గనుక ఆమె అభిమానులుగా ఉన్న అన్నాడీఎంకే ఓటర్లు కచ్చితంగా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని, ఆమె తప్పుకోవడంతో వారంతా పార్టీవైపే ఉంటారని అన్నాడీంకే-బీజేపీ కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే శశికళ అన్నాడీఎంకేకు ఓటేయమంటే ఆమె వర్గీయులంతా తమకు అండగా ఉండేవారని పార్టీలోని మరో వర్గం పేర్కొంటోంది.

Also Read:Times Now – C Voter – బెంగాలీలు మళ్లీ మమతానురాగాలే, తమిళనాట పొద్దు పొడుస్తున్నట్టే

పార్టీలో చోటు దక్కకపోవడం వల్లనే శశికళ మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు వారంతా తమకు నష్టం కలిగిస్తారని అంచనా వేస్తోంది. అయితే, ఏం జరిగినా ఆమె ప్రభావం ఉందన్న భావన ప్రజల్లో రాకూడదన్న ఉద్దేశంతో అన్నాడీఎంకే నేతలు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. బుధవారం రాత్రి శశికళ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికీ అన్నాడీఎంకే సీనియర్‌ నేత కేపీ మునుస్వామి స్పందించారు. ఆమె ప్రకటనను స్వాగతించారు. ఆ తరువాత ఆయన సహా పార్టీ నేతలంతా ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు.

మరోవైపు డీఎంకే మాత్రం శశికళ నిర్ణయం తమకే లాభం చేకూర్చి పెడుతుందని భావిస్తోంది. శశికళను ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీలో చేర్చుకోలేదని, ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నారన్న ప్రచారం వల్ల ఆమె మద్దతుదారులంతా దినకరన్‌కు అండగా అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) వైపు వెళితే అన్నాడీఎంకే ఓట్లు చీలడం ఖాయమని, ఇది తమకు లాభం చేకూర్చిపెడుతుందని డీఎంకే నేతలు భావిస్తున్నారు. అందుకే ఆమెకు మద్దతుగా గానీ, వ్యతిరేకంగా గానీ మాట్లాడకుండా మౌనం దాల్చుతున్నారు.

అన్నాడీఎంకే తరఫున పోటీ చేయదలచిన ఔత్సాహికులకు గురువారం ఇంటర్వ్యూలు ముగిశాయి. రెండుమూడు రోజుల్లో అభ్యర్థుల జాబితా వెలువడడం ఖాయం. అదే జరిగితే సీట్లు రాని అసంతృప్తులంతా శశికళ అనుయాయుడిగా పేరుగాంచిన టీటీవీ దినకరన్‌ వద్దకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే బలోపేతమవడం ఖాయం. అందుకే దినకరన్‌ కూడా తమ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా, ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా వేచి ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా వెలువడ్డాక, సీట్లు రాని అసమ్మతి నేతలను తనవైపు తిప్పుకోవచ్చన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలు ముగిశాక పార్టీ పరాజయం పాలైతే .. ఆయా నేతలంతా శశికళ వద్దకు రావడం ఖాయమని అన్ని వర్గాలూ అంచనా వేస్తున్నాయి.

Also Read:నెల్లూరు మాజీ మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే నేతలు ఆమె దరిచేరకపోయినా, దేవర్‌ సామాజికవర్గ ప్రముఖులు మాత్రం ఆమెతో పలు దఫాలుగా చర్చించినట్లు సమాచారం. దేవర్‌ సామాజిక వర్గానికి రాష్ట్రంలో 10 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఆది నుంచి ఈ సామాజికవర్గం అన్నాడీఎంకేకు అండగా ఉంటుందన్న పేరుంది. అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం కూడా దేవర్‌ సామాజికవర్గానికి చెందినవారే.

అయితే ఆది నుంచి జయకు అండగా నిలిచి, పార్టీ బలోపేతానికి కష్టపడిన శశికళను అన్నాడీఎంకే తీవ్రంగా అవమానించిందన్న భావన ఆ సామాజికవర్గం నేతల్లో కనిపిస్తోంది. జయ మరణించాక ‘ధర్మయుద్ధం’ పేరుతో అన్నాడీఎంకేను వీడి, శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం కూడా ఇప్పుడు ఆమె రాక పట్ల సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పళనిస్వామే ఆమెను దూరంగా ఉంచారన్న ప్రచారంతో దేవర్లు కినుక వహించినట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికల్లో అన్నాడీఎంకేపై ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.