iDreamPost
android-app
ios-app

సినీ రంగంలో డ్రగ్స్‌ బానిసలెవరు?

సినీ రంగంలో డ్రగ్స్‌ బానిసలెవరు?

కంగనా రనౌత్‌, బాలీవుడ్‌లో ‘డ్రగ్స్‌ కుంపటి’ రాజేసింది. బాలీవుడ్‌లోనే కాదు, మొత్తంగా ఇండియన్‌ సినిమాకి సంబంధించి ఇది చాలా పెద్ద వివాదం. ‘బాలీవుడ్‌లో చాలామంది డ్రగ్స్‌ బానినలున్నారు.. అందరికీ నార్కోటిక్స్‌ పరీక్షలు చేయండి..’ అంటూ కంగనా రనౌత్‌ సంచలన డిమాండ్‌ చేసింది. తెలుగు సినిమాకి సంబంధించి నటి మాధవిలత కూడా దాదాపు ఇలాంటి వాదననే తెరపైకి తెస్తోంది. కన్నడ, తమిళ సినీ వర్గాల్లోనూ ఇప్పుడు ఈ డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ వాడకం కేవలం సినీ రంగానికే పరిమితమా.? ఇతర రంగాల సంగతేంటి.? అన్న చర్చ తెరపైకి వచ్చింది కూడా. అయితే, అందరికీ నార్కోటిక్స్‌ పరీక్షలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా, ఆ ఫలితాల్ని బయటకు వెళ్ళడించడం కూడా సబబు కాదు. ఆయా కేసులకు సంబంధించి మాత్రమే ప్రత్యేకంగా నార్కోటిక్స్‌ పరీక్షలు జరిగితే జరుగుతాయి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కొందరికి గతంలో ఈ తరహా పరీక్షలు జరిగాయి. ఆ వివరాలు ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. అలాగని, పరీక్షా ఫలితాల్లో నెగెటివ్‌ వచ్చిందనో, పాజిటివ్‌ వచ్చిందనో మనం కంక్లూజన్‌కి వచ్చేయలేం. దానికంటే కొన్ని ప్రత్యేక నిబంధనలు వుంటాయి. కంగన డిమాండ్‌ని నార్కోటిక్స్‌ అధికారులు పరిగణనలోకి తీసుకునే అవకాశమే లేదు. అలాగే మాధవీలత విషయంలోనూ. ‘కేవలం సంచలనాల కోసం చేసే ఆరోపణలు మాత్రమే..’ అంటూ అటు కంగన, ఇటు మాధవీలత వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డ్రగ్స్‌ వాడకం సినీ పరిశ్రమకు చెందినవారిలోనే కాదు.. రాజకీయ రంగానికి చెందినవారిలోనూ కన్పిస్తుంది. అంతెందుకు విద్యార్థులూ డ్రగ్స్‌ బారిన పడుతున్న సందర్భాల్ని చూస్తున్నాం.