iDreamPost
android-app
ios-app

అమరావతి ఉద్యమంలో వాళ్లెందుకు కనిపించడం లేదు..

  • Published Aug 24, 2020 | 2:31 AM Updated Updated Aug 24, 2020 | 2:31 AM
అమరావతి ఉద్యమంలో వాళ్లెందుకు కనిపించడం లేదు..

అమరావతి పరిరక్షణ ఉద్యమం అంటూ చంద్రబాబు ఆరంభంలో కొంత హడావిడి చేశారు. చివరకు జోలెపట్టి ఆయన భార్య ప్లాటినం గాజులు కూడా తీసుకున్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటించి రాజధానిని రక్షించుకుంటామని శపథం చేశారు. అనంతరం సుమారు ఐదారు గ్రామాల్లో ఆందోళనలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. స్వయంగా ఆయన పలుమార్లు తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో నిరసన శిబిరాల్లో పాల్గొన్నారు. అమరావతి కోసం ఎంతటి త్యాగాన్నయినా చేస్తామని ప్రకటించారు.

కట్ చేస్తే అమరావతి పేరుతో ఉద్యమం అంటూ చంద్రబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నిన్నటి తో 250 రోజులు నిండినట్టు ప్రకటించారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ, హైదరాబాద్ లోనూ కూడా నిరసనలు చేసినట్టు ఆ రెండు పత్రికల కథనాలను బట్టి తెలుస్తోంది. కానీ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్లు ఆందోళన చేసినప్పటికీ హైదారబాద్ లోనే ఉన్న చంద్రబాబు, చినబాబు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజంగా అమరావతి మీద చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉందా అనే సందేహం వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి ఏ ఉద్యమం అయినా తొలుత ప్రభుత్వంతో సంప్రదింపులు ఉంటాయి. లేదా అనూహ్యంగా మొదలయితే ఆ తర్వాతనయినా చర్చలు ఉంటాయి. కనీసం వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలుంటాయి. కానీ అమరావతి వ్యవహారంలో ఎలాంటివేమీ కనిపించవు. చివరకు 250 రోజుల తర్వాత కూడా రైతుల తరుపున ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని కలిసింది లేదు. కనీసం ఏ మంత్రితోనూ మాట్లాడింది లేదు. తమ డిమాండ్లపై చర్చలు లేవు. సంప్రదింపులు లేవు. అంటే సమస్య పరిష్కారం కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారా అనే సందేహం వస్తుంది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో ఆడుకుంటున్నారా అనే అనుమానం వస్తుంది. అప్పట్లో భూములు ఇవ్వాలని ఒత్తిడి చేసి, ఇప్పుడు ఇచ్చిన వాళ్లను బలిపశువులను చేసే ప్రయత్నం జరుగుతుందా అనే సందేహం వినిపిస్తోంది.

ఓవైపు ప్రభుత్వంతో కనీసం మంతనాలు కూడా లేకుండా మరోవైపు ప్రజలు నిరసనలు చేస్తుంటే సంఘీభావం కూడా తెలుపకుండా చంద్రబాబు మరోసారి అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారా అనే అభిప్రాయం బలపడుతోంది. కరోనాకి భయపడి ఆయన ఇంట్లో జూమ్ మీటింగులకే పరిమితం అయితే కనీసం ఆయన కుమారుడు, మంగళగిరి టీడీపీ నేత అయినా కనిపించాలి కదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వారిద్దరూ రాలేకపోతే టీడీపీ ఎంపీ గళ్లా జయదేవ్ ఎందుకు రాలేకపోతున్నారని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఏమయ్యారని నిలదీస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఇతర పార్టీల నేతలు వచ్చినప్పటికీ టీడీపీ సీనియర్ నేతలు ఎందుకు మొఖం చాటేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతల తీరుతో అమరావతి ఆందోళనకారుల్లో కూడా అనుమానాలు బలపడుతున్నాయి. రైతులకు , ప్రభుత్వానికి మధ్య వివాదం పెంచడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ఉన్నారనే వాదన వినిపిస్తోంది. సమస్య పరిష్కారం కోసం, రైతులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయాల కోసం కాకుండా కేవలం రాజకీయాలే ఆలోచిస్తూ, సమస్యను మరింత జఠిలం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందనే వాదన బలపడుతోంది. దాంతో అమరావతి రైతుల్లో ఇప్పుడు టీడీపీ నేతల పట్ల మొదలయిన అనుమానాలు ఒక్కొక్కటీ రుజువవుతున్న వేళ రానురాను ఆపార్టీకి చివరకు ఆ కొన్ని గ్రామాల్లో కూడా పట్టు నిలుపుకోవడం సాధ్యమా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.