iDreamPost
android-app
ios-app

నారా లోకేష్ సింహంలా ఎప్పుడు మారారు..?

  • Published Jun 19, 2021 | 5:23 AM Updated Updated Jun 19, 2021 | 5:23 AM
నారా లోకేష్ సింహంలా ఎప్పుడు మారారు..?

పులిబిడ్డ, నేను సింహం లాంటి వాడిని అంటూ ఎవరైనా అనగానే సోషల్ మీడియాలో సెటైర్లు పేలడం సాధారణమే. ఇప్పుడు అనూహ్యంగా నారా లోకేష్ తాను సింహాన్ని అంటుంటే అలాంటి స్పందనే తప్పలేదు.. లోకేష్ కి ప్రత్యక్ష రాజకీయాల అనుభవం నిండా ఐదారేళ్లు. అందులో మూడేళ్లు మంత్రిగాను, అంతకుముందు ముఖ్యమంత్రి తనయుడిగాను అధికారం వెలగబెట్టారు. అంటే విపక్షంలో ఆయనకు అనుభవమే లేదు. అందుకే రెండేళ్లుగా అధికారం కోల్పోయిన తర్వాత అనేక అగచాట్లు పడుతున్నారు.

రాజకీయ నేతలు తమ అసలు సత్తా చాటుకునేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. జగన్ కూడా ప్రతిపక్ష నాయకుడిగానే ప్రజలకు చేరువయ్యారు. నారా లోకేష్ అలాంటి అనుభవాల నుంచి నేర్చుకోవాల్సి ఉంది. కానీ అనుభవరాహిత్యం తో అనేక అంశాల్లో తెలిపోతున్నా, నేర్చుకోవాలనే విషయం మాత్రం ఆయనకి తెలియడం లేదు. అయితే వ్యవహారశైలి మార్చుకోవడానికి మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే శరీర బరువు విషయంలో ఏమి చేశారో గానీ బాగా స్లిమ్ అయ్యారు. అదే పద్ధతిలో ప్రజలకు చేరువయ్యే పనులు చేస్తే భవిష్యత్ ఉంటుంది.

నారా లోకేష్ ఇప్పుడు ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. సొంతపార్టీ నేతలే ఆయన సారధ్యానికి ససేమిరా అంటున్నారు. లోకేష్ తీరుతో అసంతృప్తిగా ఉన్నారు . అధికారంలో ఉండగా అణగిమనిగి వ్యవహరించిన వాళ్లే ఇప్పుడు “పార్టీ లేదు.. బొక్కాలేదు” అనే వరకూ వచ్చేసారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ నిత్యం వెంటాడుతున్నారు. ఇప్పటికే కుప్పం లో వెలిసిన పోస్టర్లు మాత్రమే కాకుండా అనేక మంది తమ్ముళ్ల మనసులో ఆయన ఉన్నారు. దాంతో తన నాయకత్వ సత్తాని జనాలకి చూపించే ముందు పార్టీ లో ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ లోకేష్ కి అది పెట్టినట్టు లేదు. నాయకుడి మీద విశ్వాసం పెంచేందుకు ఏమి చేయాలి అనేది ఆయనకు పెట్టినట్టు లేదు.

ఫలితంగా పబ్లిక్ లో నోటికి పని చెప్పేందుకు లోకేష్ ని కొందరు పురిగొల్పినట్టు కనిపిస్తోంది. వయసు రీత్యా తండ్రి చంద్రబాబు హైదరాబాద్ ఇంటికే పరిమితం కావడం ఆశ్చర్యం లేదు. కానీ నారా.లోకేష్ కూడా కరోనా కారణంగా హైదరాబాద్ లో మకాం వేసి ఏపీలో గెస్ట్ పొలిటీషియన్ అయిపోయారు. దాన్ని మరుగునపరిచేందుకు ‘మొరుగుతున్నారు’ లాంటి మాటలు ఎరువు తెచ్చుకున్నారు. సినిమాల్లో కొందరికి కొన్ని క్యారెక్టర్లు సూట్ అయినట్టుగానే, పాలిటిక్స్ లో కూడా ఏ నాయకుడైన తనదైన పంథాలో సాగితేనే జనం హర్షిస్తారు. కానీ లోకేష్ మాత్రం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరో తన కామెంట్స్ ద్వారా కాక రేపుతున్నారని, తాను కూడా ఆ దారిన వెళ్లేందుకు ఆసక్తి చూపడం ఆశ్చర్యమే.

లోకేష్ దూకుడు చేతల్లో చూపితే ఆయనకి, టీడీపీకి శ్రేయస్కరం. కానీ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారుతున్నారు. టీడీపీ శ్రేణులను ఆకట్టుకోలేక, ప్రత్యర్థుల నుంచి విమర్శలకు సమాధానం లేక తేలిపోవాల్సి వస్తోంది. అందుకే లోకేష్ ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా అసలుకే ఎసరు తెస్తున్నాయి. టీడీపీ ని మరింత ఇరకాటంలో నెడుతున్నాయి. ఆయన తాజా పర్యటనకు కర్నూలు జిల్లా అధ్యక్షుడు , నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ కూడా మొఖం చాటేయడం దానికో నిదర్శనం. మాస్ లీడర్ గా ఎదగాలనే ప్రయత్నం చేయాలి తప్ప, రాజకీయాల కోసం వ్యక్తిగత కక్షలను రాజకీయం చేయడం, నేరుగా జగన్ కి ముడిపెట్టాలనే ఆలోచనకు రావడం లోకేష్ అవకాశవాదాన్ని చాటుతోంది. ఏడాది క్రితం వరకూ టీడీపీ కి దూరంగా ఉన్న వారి హత్యలని కూడా సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్నట్టుగా చిత్రీకరించాలనే యత్నం అభాసుపలుజేస్తోంది. సీమలో ఫ్యాక్షన్ కక్షలు మళ్ళీ పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వేటాడుతా అంటూ ఆయన వాడిన పదజాలం స్థానిక టీడీపీ శ్రేణులను సైతం సంతృప్తి పరచకపోగా, కొత్త చిక్కులు పెడుతున్నారనే ఆలోచనకు దోహదపడింది.

Also Read : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫ్రాడ్ ? ! …. సంస్థకు సెబీ వందల కోట్ల జరిమానా