iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ కిశోర్ కు ఏ పాత్ర ఇద్దాం!

  • Published Jul 30, 2021 | 7:47 AM Updated Updated Jul 30, 2021 | 7:47 AM
ప్రశాంత్ కిశోర్ కు ఏ పాత్ర ఇద్దాం!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెసులో చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన చేరికపై ప్రచారం జరుగుతోంది. పీకేను పార్టీలో చేర్చుకోవాలా.. సలహాదారుగా నియమించాలా అన్న దానిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీనియర్ సహచరులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీలో చేర్చుకుంటే ఏ పదవి ఇవ్వాలి.. ఎటువంటి బాధ్యతలు అప్పజెప్పాలి అన్న విషయమైనా వారు సమాలోచనలు జరిపారు.

సోనియా ఆహ్వానంతో కదలిక

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి.. మమతాబెనర్జీ మూడోసారి సీఎం అయ్యేందుకు దోహదపడిన పీకే.. ఆ ఎన్నికల అనంతరం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రతిపక్షాలు ఏకీకృతమైతే తప్ప మోదీని ధీటుగా ఎదుర్కోలేమని భావించి దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీలతో దఫాదఫాలుగా మంతనాలు జరుపుతూ మోదీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలన్న విషయంలో వారిలో ఏకాభిప్రాయం సాధించారు. ఇదే క్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంకలతో ఈ నెల 13న ఆయన భేటీ అయ్యారు. ఆ సందర్బంగా పార్టీలో చేరాలని సోనియా పీకేను ఆహ్వానించారు. అప్పటినుంచి ఆయన కాంగ్రెసులో చేరుతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే అటు కాంగ్రెస్.. ఇటు పీకే దీనిపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.

పార్టీలో చేర్చుకోవడానికే మొగ్గు

ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై ప్రశాంత్ కిశోర్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తమతో భేటీలో పీకే చేసిన సూచనల గురించి వివరించారు. యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మిగతా పార్టీలతో కలిసి పోరాడటానికి ఇచ్చిన సలహాల గురించి సమావేశంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్, అంబికా సోనీ, కమాలనాథ్, ఏ.కె.ఆంటోనీ, హరీష్ రావత్, కె.సి.వేణుగోపాల్ తదితరులతో పంచుకున్నారు.

పీకేను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందా.. సలహాదారుగా ఉంచుకుంటే బాగుంటుందా అని ఆరా తీశారు. యూపీ ఎన్నికలపై పీకే ఇచ్చిన సూచనలు బాగున్నాయని మెచ్చుకున్న నేతలు.. సలహాదారుగా కంటే పార్టీలో చేర్చుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పార్టీలో చేర్చుకుంటే ఏ పదవి ఇవ్వాలి.. ఎటువంటి బాధ్యతలు అప్పగించాలో సలహా ఇవ్వాలని రాహుల్ వారిని కోరారు. ఆ విషయంలో ఇతమిద్దంగా ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. మరోసారి చర్చించి నిర్ణయించాలని అనుకున్నారు. ఈ పరిణామలతో కాంగ్రెసులో ప్రశాంత్ కిశోర్ చేరిక దాదాపు ఖాయమేనని స్పష్టం అవుతోంది.