iDreamPost
iDreamPost
ఎవరైనా ఏం కోరుకొంటారు? పెళ్లిచేసుకొని, పిల్లను కని, జీవితాన్ని హ్యాపీగా గడిపేయాలని. అది ప్రకృతి ధర్మంకూడా. లేకపోతే వారసత్వం ఎలా ముందుకెళ్లుతుంది? మరి కొందరు పెళ్లీపెటాకులు లేకుండా జీవితాంతం ఎలా బ్రహ్మచారిగా ఎలా గడుపుతారు? మతాలెందుకు బ్రహ్మచర్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి?
భారతదేశంలో జైనులు, బౌద్ధులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. హిందూమతంలోనూ సన్యాసులకు గౌరవం ఉంటుంది. అదే టిబెట్లో ఇంటికో బౌద్ధ సన్యాసి ఉంటాడు. ఎందుకిలా? రాయల్ సొసైటి ప్రొసీడింగ్స్ బి(Royal Society Proceedings B)లో పబ్లిష్ అయిన కొత్త స్టడీ ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించింది. టిబెటిన్ బౌద్ధ ఆరామాల్లో జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న వాళ్లను స్టడీచేసింది.
టిబెట్ స్థానికంగా ఒక ఆచారం నిన్నమొన్నటిదాక ఉండేది. చిన్నకుమారుల్లో ఒకరిని బౌద్ధారామానికి జీవితాంతం సన్యాసిగా ఉండమని పంపిస్తారు. టిబెట్ లో ప్రతి ఏడుగురిలో ఒకరు బౌద్ధ సన్యాసి అయ్యారు. కొడుకును బౌద్ధసన్యాసిగా ఎందుకు మార్చుతున్నారని అడిగితే మతంపేరు చెబుతారు. కాని ఇందులో ఆర్ధిక, సామాజిక, పునరుత్పత్తి సంబంధత విషయాలు దాగున్నాయా? ఊరికే కొడుకును బౌద్ధానికి ఎవరూ దానమివ్వరుకదా!
టిబెట్ లోని గ్రామాల్లో పితృస్వామ్య వ్యవస్థ ఉంది. వాళ్లు మేకలు, యాక్స్ ను పెంచుతారు. చిన్నచిన్న కమతాలుగా భూమిని సాగుచేస్తారు. మాగాణి నేల అక్కడ చాలా తక్కువ. ఈ ఆస్తి అంతా మగపిల్లవాడికి వారసత్వంగా వస్తుంది. అంటే ఇద్దరు మగపిల్లలుంటే ఒకరు సన్యాసిఅయితే, మిగిలిన కుర్రాడికి ఆస్తి వస్తుంది. యాక్స్ అన్నీ ఆ కుర్రాడివే. అదే ఆడపిల్లలంటే వాళ్లకేం లాభంలేదు.
టిబెట్ లో సంపద తక్కువ. ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు మగపిల్లలు ఉంటే ఎవరికీ పెద్దగా ఆస్తి రాదు. బతుకుతెరువూ ఉండదు. అందులో ఒకరైనా సన్యాసిగా బౌద్ధ ఆరామాలకు వెళ్లిపోతే మిగిలినవాళ్లకు అతని వాటా కూడా వస్తుంది. అందువల్ల ఆస్తుల తగాదాలుండవు. పెద్దవాడికి ఆస్తి అందుతుంది. అది వారసత్వం. అందుకే బ్రహ్మచర్యం తీసుకోమని పేరెంట్స్ కోరేది రెండో కొడుకో లేదంటే ఆ తర్వాత పుట్టినవాళ్లనో.
ఇంకో సంగతి, ఒకరైనా బౌద్ధాశ్రమాలకు వెళ్లిన కుటుంబాల్లో పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. చిన్నవాడు సన్యాసి అయిపోతే, అతనికన్నా పెద్దవాళ్లకు పిల్లలు ఎక్కవమంది పుట్టారు. వాళ్లకు చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లకు భార్యలూ చిన్నవయస్సులోనే తల్లి అయ్యారు. అదే ఒక కుటుంబంలో ఎవరూ సన్యాసం తీసుకోకపోతే, వాళ్లకు లేటుగా పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలుకూడా తక్కువే.
ఎందుకీ తేడా? ఇంట్లో మగపిల్లలు తగ్గితే ఆస్తి ఎక్కువగా వస్తుంది. అందువల్ల తొందరగా పెళ్లిళ్లు అవుతాయి. పోషించే స్తోమత ఉంటుంది కాబట్టి, పిల్లలను కంటారంట. మగవాళ్లు తగ్గితే ఆడవాళ్లకు కోసం పోటీ కూడా తగ్గుతుంది కదా! ఒక విధంగా ఒక కుర్రాడు తాను బ్రహ్మచర్యంలో ఉంటే తన సోదరుడు పిల్లలను ఎక్కువగా కనే అవకాశమిస్తున్నాడు.