iDreamPost
android-app
ios-app

అశోక్ గెహ్లాట్ ఆ విష‌యం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం వెనుక మ‌ర్మ‌మేంటి..?

అశోక్ గెహ్లాట్ ఆ విష‌యం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం వెనుక మ‌ర్మ‌మేంటి..?

అసెంబ్లీని హాజరు‌ప‌ర‌చాల‌ని రెండు రోజుల క్రితం రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ‌ర్గం చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. సోమవారం నాటికి అసెంబ్లీ ని స‌మావేశ‌ప‌ర‌చాల‌ని ఓ ర‌కంగా గ‌వ‌ర్న‌ర్ తో యుద్ధ‌మే చేసింది. అలాంటిది తాజా ప్ర‌తిపాద‌న‌లో ఆ అంశం లేక‌పోవ‌డానికి కార‌ణాలేంటి..? ‌రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద అశోక్ గెహ్లాట్ శుక్ర‌వారం చేసిన ఆందోళ‌న‌పై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి వ్య‌క్తం చేసిందా..? గ‌వ‌ర్న‌ర్ పై చేసిన వ్యాఖ్య‌లు పార్టీకి, ప్ర‌భుత్వానికి న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసిందా… లేదా ఎలాగైనా అసెంబ్లీని స‌మావేశ ప‌ర‌చాల‌నే వ్యూహం దాగుందా..? అనేది ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

15 రోజుల‌కు పైగా సాగుతున్న రాజ‌స్థాన్ వ్య‌వ‌హారం.. ఎప్పుడు ఏ మ‌లుపు తిరుగుతుందో రాజ‌కీయ నిపుణుల‌కు కూడా అంద‌డం లేదు. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 31 నుంచి ప్రారంభించాలని గవర్నర్‌ను కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన తాజా ప్రతిపాదనలో బల నిరూపణ అంశం ప్రస్తావన లేదని తెలుస్తోంది. కరోనా వైరస్, ఇతర బిల్లులపై చర్చించనున్నట్టు మంత్రివర్గం ప్రతిపాదన చేసిందని, బలనిరూపణ ప్రసక్తి మాత్రం అందులో లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో 200 మంది సభ్యులుండగా, కాంగ్రెస్‌కు (సచిన్ పైలట్, ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సహా) 107 మంది సభ్యుల బలం ఉంది. పైలట్, 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ మహేష్ జోషి అనర్హత నోటీసు పంపడం, అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరచాలంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్ పట్టించుకోకపోవడంతో రాజస్థాన్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా తక్కువ కాలవ్యవధి నోటీసుతో ఈనెల 23వ తేదీ రాత్రి గెహ్లాట్ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకువచ్చినట్టు రాజస్థాన్ గవర్నర్ సెక్రటేరియట్ చెబుతోంది. దానిపై నిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలిపింది. నిబంధనల ప్రకారం కనీసం 21 రోజులకు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశం ఏర్పాటుకు గవర్నర్ చేస్తున్న కాలయాపనపై రాష్ట్రపతిని కలుస్తామని, అవసరమైతే ప్రధాని నివాసం వెలుపల ధర్నాకు దిగుతామని గెహ్లాట్ శనివారం జరిగిన సీఎల్‌పీ సమావేశంలో తెగేసి చెప్పారు. కానీ.. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ కేవలం క‌రోనాపై చ‌ర్చించ‌డానికే చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు.. గవర్నర్‌పై రాజ‌స్థాన్ సీఎం చేసిన వ్యాఖ్య‌లు, రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద ఎమ్మెల్యేలు బైఠాయించి హ‌ల్ చ‌ల్ చేయ‌డంపై బీజేపీ నేత‌లు రంగంలోకి దిగారు. గ‌వ‌ర్న‌ర్ కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ పై క‌త్తులు దూస్తున్నారు.