iDreamPost
iDreamPost
చంద్రబాబు ఉపాయాన్ని నమ్మి టీడీపీ నుంచి నేరుగా బీజేపీలోకి కొందరు నాయకులు వలసెళ్ళిపోయారు. సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించేంత వరకు సదరు వలస నాయకులు బీజేపీ వాయిస్ (అంతర్లీనంగా టీడీపీ వాయిస్)ను ఏపీలో బలంగానే విన్పించేవారు. ఎంతగానంటే ఆఖరికి ఏపీ సీయం వైఎస్ జగన్‌ను కార్నర్ చేస్తూ పలు కీలక అంశాల్లో భిన్నమైన ప్రకటనలు కూడా విడుదల చేసేసేవారు. దీంతో వారి అనుంగు మీడియా వాటిని ఇంతకు పదింతలు చేస్తూ జనం మెదళ్ళలోకి కన్ఫ్యూజన్‌ను ఎక్కిస్తుండేది.
ఎప్పుడైతే సోము వీర్రాజు బీజేపీ పగ్గాలు అందుకున్నారో టీడీపీ నుంచి వలస వెళ్ళిన నాయకుల మైకులకు పవర్ కటై్టనటై్టంది. దీంతో ఎక్కడా వారి గొంతు జనబాహుళ్యంలోకి విన్పించడం లేదు. ఈ తేడాను సోము వీర్రాజుకు ముందు తరువాతగా స్పష్టంగానే ప్రజలు గమనించారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు చెప్పిదానికి భిన్నంగా కూడా ప్రకటనలు చేస్తూ ఏపీలో అమోయ పరిస్థితిని కూడా సదరు వలస నేతలు సృష్టించగలిగారు. మరో వైపు వివరణ ఇచ్చుకోవాల్సిన ఆగత్యాన్ని సోముకు కల్పించేవారు. దీంతో ఇలా కాదని సదరు నాయకుల తోకలు కత్తిరించే పనికి సోము పూనుకోవాల్సి వచ్చింది కూడా. దీంతో ఒకరిద్దరు నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తేనేగానీ వలస నాయకుల హింస నుంచి సోముకు, రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించలేదు.
అయితే జాతీయ కార్యవర్గంలో టీడీపీ నుంచి వెళ్ళిన నేతలకు కీలకపదవులు వచ్చేస్తాయని, తద్వారా మళ్ళీ ఏపీలో చక్రం తిప్పేస్తారంటూ ఊహాగానాలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేస్తూ పుకార్లకు భిన్నంగా బీజేపీ నాయకత్వం వ్యవహరించింది. అప్పటికప్పుడు తమ బ్రతుకుదెరువు కోసం వచ్చి పార్టీ కండువాలు కప్పుకున్ననాయకులను పూర్తిగా పక్కన పెట్టేసి, పార్టీకోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి మాత్రమే కేంద్ర కార్యవర్గాలో ప్రాధాన్యమిచ్చింది. తద్వారా క్రింది స్థాయి కేడర్‌కు కూడా నమ్మకాన్ని పెంచింది. ఇంత వరకు బీజేపీ వైపు నుంచి అంతా సక్రమంగానే జరిగినట్టుగా రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే ఏదో ఆశించి బీజేపీలో చేరిన వలస నాయకుల పరిస్థితే ఇప్పుడేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ్నుంచి అక్కడకెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడ స్టీరింగ్ తిప్పేద్దామనే బహుదూరపు వ్యూహంతో వెళ్ళిన వాళ్ళంతా ఎటువంటి కీలక పదవులు దక్కకుండా ఉండిపోవాల్సి రావడం నిజంగా వారి వైపు నుంచి తీవ్ర ఇబ్బందికర పరిస్థితేనని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాం కాబట్టి అప్రకటిత యువరాజుల్లా రాష్ట్రంలో ప్రవర్తించిన వీళ్ళంతా ఇప్పుడేం చేయబోతున్నారు? అన్నదే ఆసక్తికరంగా మారింది.
నిజానికి వీళ్ళంతా ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పెత్తనం చెలాయించిన వారే. చంద్రబాబు చుట్టూ కోటరీగా ఏర్పడి వ్యూహాలు రచించి కొందరు కరుడుగట్టిన టీడీపీ నాయకుల తలరాతలను కూడా మార్చేసినవారే. కానీ 2019 ఓటమి తరువాత దూరాలోచనతో బీజేపీలో చేరారని, అక్కడినుంచి రాష్ట్రంలో పాలనను నియంత్రించాలని చూస్తున్నారని అధికార వైఎస్సార్‌సీపీ నాయకులు ముందు నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. వలస నాయకుల నోటి నుంచి వెలువడే మాటలు కూడా ఇందుకు బలం చేకూరుస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో వలస నాయకుల భవిష్యత్తు ఉంటన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న మాదిరిగా మారిపోయింది. ఏపీలో ఎటూ గుర్తింపు పోగా కేంద్రంలో సైతం ఉపయోగపడే పదవులు దక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఏ గట్టుకు వీరంతా చేరతారోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు.