iDreamPost
android-app
ios-app

ఇప్పుడేం అంటారు ‘బాబూ..’

  • Published Aug 28, 2020 | 8:41 AM Updated Updated Aug 28, 2020 | 8:41 AM
ఇప్పుడేం అంటారు ‘బాబూ..’

రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ పౌరుడే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, పాలనా విధానాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళుతున్నారు. దీనికి ప్రజామోదం కూడా లభిస్తోంది.

అయితే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆయన బృందం, ఆ బృందంలోని మీడియాకు మాత్రం పాలనలో రంధ్రాలు మాత్రమే కన్పిస్తున్నాయి. జరుగుతున్న సంక్షేమంపై ఏ విధంగా బుదరచల్లాలా అన్న ఆలోచనలు మాత్రమే వస్తున్నాయి. ఇది వారి మానసిక స్థితి లోపమా? అన్న సందేహాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రజల దృక్కోణం నుంచి చూడకుండా కేవలం తమ ప్రయోజనాల వైప నుంచి మాత్రమే వ్యవహరించి ఈ ‘బృందం’ వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగానే ఉంది.

జగన్‌ పాలన ప్రారంభమయ్యాక వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు. పౌరుని వద్దకు ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడంలో ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందన్నది వచ్చిన ఆ ఫలితాలు ద్వారా ఇప్పటికే ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. కరోనా వంటి మహ్మారి విజృంభిస్తున్న వేళలో ప్రభుత్వ యంత్రాంగానికి వాలంటీర్లు అందించిన సేవలు ప్రజా రోగ్యాన్ని కాపాడడంలో అదనపు ప్రయోజనాన్ని చేకూర్చాయి. కోవిడ్‌ వ్యాధి గ్రస్తులు, వారి కాంటాక్ట్స్‌ తితర వివరాల క్షేత్రస్థాయి సమాచారం వేగంగా ప్రభుత్వం వద్దకు చేరేందుకు ఈ వ్యవస్థ చురుగ్గా స్పందించింది. సమాచారాన్ని ప్రభుత్వానికి అందించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని కోవిడ్‌ 19 నివారణకు సేవలను విస్తృతం చేయగలిగింది. ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలను ప్రశంసించారు.

అయినప్పటికీ చంద్రబాబు అండ్‌ బృందం వాదన మాత్రం వేరుగా ఉంది. వాలంటరీ వ్యవస్థలో ప్రభుత్వం తనకు కావాల్సిన వాళ్ళను మాత్రమే నియమించుకుంది అన్నదే వీరి వాదన. పదేపదే ఇదే విషయాన్ని ఇప్పటి వరకు వల్లెవేస్తూ వస్తోంది. ప్రజలు ఏ మాత్రం పట్టించుకోనప్పటికీ తన మీడియా ద్వారా కూడా ఇదే విషయాన్ని వారి మెదళ్ళలోకి జొప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

అయితే పాలనా ప్రక్షాళనాయజ్ఞాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్న జగన్‌ ప్రభుత్వం విధుల్లో అలసత్వం వహించిన వాలంటీర్లను కూడా తొలగించి తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకుంది. తమకు కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 19 గ్రామవాలంటీర్లను అధికారులు తొలగించారు. ఇప్పటి వరకు విష ప్రచారాన్ని జోరుగా చేసిన నారావారు వారి మీడియాకు ఇదే ఇప్పుడు ఖంగుతినే అంశం. ఒక వేళ జగన్‌ తన పార్టీ వాళ్ళను మాత్రమే వాలంటీర్లుగా నియమిస్తే విధుల్లోనుంచి ఎందుకు తొలగిస్తారు? అన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది.

టీడీపీ హయాంలో ఎన్ని ఆరోపణలు వచ్చినాగానీ జన్మభూమి కమిటీలను కదపకుండా ప్రజలతో ఓ ఆటాడుకున్న విషయాన్ని ఇంకా మర్చిపోలేదు. అయితే చంద్రబాబు ఓటమికి ఉన్న శతకోటి కారణాల్లో ఈ జన్మభూమి కమిటీలు కూడా ఒకటని చెబుతారు. అయితే దీనిని ఏ నాడూ ఆయన ఒప్పుకోలేదు. అదే ఉద్దేశంతో వార్డు/గ్రామ వాలంటీర్లపై కూడా ఆరోపణలు దిగారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నది వాలంటీర్ల తొలగింపుతో స్పష్టమైపోయింది. తన ప్రభుత్వంలో పౌరుడే కింగ్‌ అని, పౌరుడికి అందే సేవల్లో ఏ మాత్రం పొరపాటు జరిగినా క్షమించేది లేదన్నది చాటిచెప్పినట్లయింది.

ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ల పనితీరుపై సమీక్షలు ఇప్పటికే ప్రారంభమాయ్యయి. విధినిర్వహణా సామర్ధ్యం, పౌరులతో వారి వ్యవహారశైలి, సంక్షేమ పథకాలను అందించడంలో అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలను సంబంధిత అధికారులు స్వయంగానే పర్యవేక్షిస్తున్నారు. తద్వారా మరింత మెరుగైన సేవలను పౌరులకు అందించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.