iDreamPost
iDreamPost
అర్థరాత్రి పూట మందుబాబులు సిట్టింగ్ వేసుకున్నారు. రోడ్డుపక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో ఎవరూ లేని సమయంలో మందు కొడుతున్న సమయంలో మాటా, మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయపడిన పెదకూరపాడుకి చెందిన వ్యక్తి పొత్తూరు వెంకటనారయణ దళితుడు. అంతే చంద్రబాబు అండ్ కో రెడీ అయిపోయారు. దానికి ఓ కథ అల్లేశారు. చంద్రబాబుని దుర్భాషలాడుతుంటే వద్దని చెప్పినందుకు దాడి చేశారంటూ ఓ ప్రచారం ముందుకు తెచ్చారు. అసలు అర్థరాత్రి పూట మందుకొడుతున్నప్పుడు తాగిన మైకంలో ఎవరేమి మాట్లాడుతారో ఎవరికి తెలుస్తుంది. తాగిన తర్వాత హద్దు మీరి ఒకరిపై ఒకరు తగువులాడితే దానికి వైఎస్సార్సీపీకి ఏం సంబంధం ఉంటుంది. కానీ టీడీపీకి, పచ్చ మీడియాకు అవేమీ అవసరం లేదు. లాజిక్కులతో పని లేకుండా మ్యాజిక్కులు చేసేయవచ్చని భ్రమిస్తున్నారు.
1990ల నాటి పొలిటికల్ స్కెచ్చులతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బాబు వేస్తున్న కొత్త ఎత్తుగడగా ఇది మిగిలిపోతుంది. పోలీసుల అనుమానాలు కూడా మరో రీతిలో ఉండడం విశేషం. గాయపడిన వెంకటనారాయణ నేరస్తుడు. అతనిపై నాలుగు కేసులు కూడా ఉన్నాయి. బహుశా కేసులు ఎక్కువగా ఉండడమే అదనపు అర్హతగా టీడీపీ నేతలు అతని గాయాలను రాజకీయం చేసుకునేందుకు వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ బోయపాలెం ప్రాంతంలోఇటీవల రాత్రి పూట ట్రాన్స్ ఫార్మర్స్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో, ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం యత్నంలో మంటలు చెలరేగి గాయపడి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాలిన గాయాలు కూడా అదే రీతిలో ఉన్నట్టు వైద్యులు చెబుతుండడం ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.
ఓదొంగ అర్థరాత్రి పూట తాను మందుకొడుతుండగా గొడవ జరిగిందని స్వయంగా వీడియోలో చెబితే టీడీపీ నేతలు మాత్రం దానిని బట్టుకుని రాజకీయ ప్రయోజనాలు ఆశించడం చూస్తుంటే ఆపార్టీ ఎంతకైనా దిగజారుతుందని స్పష్టమవుతుంది. తమ రాజకీయాల కోసం మందుబాబులను , వారి తగాదాలను కూడా వాడుకుంటున్న వైనం విస్మయకరంగా కనిపిస్తోంది. నిజంగా మందుబాబుల మధ్య తగాదానే అనుకున్నా తాగిన మైకంలో ఎవరో చేసిన దానిని కూడా వైఎస్సార్సీపీ మీద విమర్శలకు టీడీపీ నేతలు వాడుకునే యత్నంలో ఉన్నారంటే వారెలాంటి పరిస్థితిలో ఉన్నారో తేటతెల్లం చేస్తోంది. మొత్తంగా గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామం రాజకీయ ప్రయోజనాలకు మలచాలని తపిస్తున్న బాబు కుటిలయత్నం మరోసారి బయటపడుతోంది.