గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ తరఫున వాయిస్ వినిపించే సీనియర్లు కరవయ్యారు. ముఖ్యంగా విశ్లేషణాత్మకంగా, చురుకుగా మాట్లాడే మహిళా నేతలు లోని లోటు మీడియాలో జరిగే చర్చల్లో తెలుస్తోంది. కొందరు సీనియర్లు టీడీపీని వీడి వేరే పార్టీలోకి వెళుతుండగా మరికొందరు వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి. గతంలో టీవీ ఛానళ్లలో సమర్థంగా వాదనలు వినిపించిన ఆ పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ప్రస్తుతం రాజకీయాలపై స్పందించడం లేదు. వయోభారం, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతోనే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
2014కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నన్నపనేని రాజకుమారి టీవీ చర్చల్లో ఎక్కువగా పాల్గొనేవారు. తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ విధానాలపై టీడీపీ వర్షెన్ ను ప్రజలకు చేరవేసేవారు. కట్టుబొట్టుతో పాటు రాజకుమారి మాటల్లో కూడా తెలుగుదనం ఉండటంతో ఆమె మాటలను ప్రజలు కూడా ఆలకించేవారు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఆమె టీడీపీ నేతలపై విమర్శలు చేయడంలో కూడా ముందుండేవారు.
Also Read : రాజకీయాల్లో వంగవీటి రాధా తప్పటడుగులు సరిదిద్దుకునేనా..!
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించారు. కానీ చంద్రబాబు మంత్రివర్గంలో రాజకుమారికి చోటు దక్కలేదు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఆమెను వరించింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలి హోదాలో ఆమె రాష్ట్రంలో పర్యటించారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన సందర్భంలో ఆమె బాధితులకు దగ్గరకు వెళ్లి ఓదార్చేవారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించేవారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఇంట్లోనే కాలుజారి పడిపోవడంతో స్వల్పంగా గాయాపడ్డారు. అప్పటి నుంచి ఆమె ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. అంతకు మందు మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ పలు ఆందోళనలలో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమ శిబిరానికి వెళ్లి మద్దతు కూడా తెలిపారు. 2014 ఎన్నికల్లో రాజకుమారి కుమార్తె డాక్టర్ సుధ, వైసీపీ తరఫున వినుకొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
35 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు
1983లో టీడీపీ తరఫున సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి నన్నపనేని రాజకుమారి విజయం సాధించారు. అప్పటికి ఆమె వయస్సు 35 సంవత్సరాలు లోపే. 1989లో వినుకొండ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1989 తర్వాత చీఫ్ విప్ గా పనిచేశారు. వినుకొండ నుంచి 1994లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. 1999లో మళ్లీ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, మహిళా విభాగం చీఫ్ గా పనిచేశారు. టీడీపీ నుంచే శాసనసమండలికి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు.
Also Read : ఆ మాజీ ఐఏఎస్,మాజీ కేంద్రమంత్రి రాజకీయ మౌనం ఎందుకు?
నాదెండ్ల కేబినెట్ లో నెలరోజుల మంత్రి..
1983లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన నన్నపనేని రాజకుమారి,, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు వర్గంలో చేరారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల కేబినెట్లో మంత్రి గా ఉన్నారు. నన్నపనేని రాజకుమారిని, గిట్టని వారు ఆమెను ‘చేపలపులుసు’ పేరుతో ఎగతాళి చేస్తుంటారు. ‘‘ఒడిశాలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు అప్పటి సీఎం చెన్నారెడ్డితో పాటు పలువురు సీనియర్లు, నన్నపనేని వెళ్లారు. అక్కడ సీఎం చెన్నారెడ్దికి భోజనం తెచ్చే విషయంలో అలస్యమవ్వగా .. నన్నపనేని ఓ తెలుగువారి ఇంటికి వెళ్లి చేపల పులుసు తో భోజనం తయారు చేశారు. ఈ విషయం పత్రికల్లో హైలెట్ అవడంతో ఆమెను ప్రత్యర్థులు విమర్శించేవారు. పదవి కోసం కాకపట్టే పనిలో భాగంగానే చేపల పులుసు వడ్డించారని ఆరోపించేవారు.’’ ఈ విషయమై ఆమెను చాలా మీడియా ఇంటర్వ్యూలోనూ విలేకర్లు ప్రశ్నించేవారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో ఆమె చేసిన ఓ వ్యాఖ్య సంచలనంగా మారింది. ‘
ఇటీవలి కాలంలో కొందరు స్త్రీలు కూడా దుర్మర్గంగా వ్యవహరిస్తున్నందున పురుషులకు కూడా కమిషన్ అవసరమని’ నన్నపనేని అభిప్రాయపడ్డారు. దీంతో మహిళా సంఘాల నేతల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే టీవీ సీరయళ్లు కూడా సెన్సార్ పరిధిలో తీసుకురావాలని ఆమె డిమాండ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Also Read : కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గురించి తెలుసా..?