iDreamPost
android-app
ios-app

మీసాల రాజు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?

  • Published Oct 05, 2021 | 8:16 AM Updated Updated Oct 05, 2021 | 8:16 AM
మీసాల రాజు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?

గుబురు మీసాలు.. అచ్చతెలుగు పంచకట్టు.. స్వచ్ఛమైన గోదారోళ్ల యాసతో ‘కనుమూరు బాపిరాజు’ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. శాసనసభ్యునిగా… రాష్ట్రమంత్రిగా.. పార్లమెంట్‌ సభ్యునిగా… తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా.. రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన ఆయన గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటే ఉన్నారన్నట్టుగా… లేదంటే లేరన్నట్టుగా ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నా.. విభజన తరువాత జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన బాపిరాజు నామమాత్రంగా కూడా ఓట్లు పొందలేకపోయారు. విభజన పాపం మూటగట్టుకున్న పార్టీలో కొనసాగుతుండడం వల్ల ఆయన ప్రజలకు క్రమేపీ దూరమవుతున్నారు. ఏడు పదుల వయస్సు దాటడం వంటి కారణాలతో ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడం లేదు. అయితే హైదరాబాద్‌ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో సొంత గ్రామానికే ఆయన పరిమితమవుతున్నారు.

Also Read : ఆ మాజీ ఐఏఎస్,మాజీ కేంద్రమంత్రి రాజకీయ మౌనం ఎందుకు?

బాపిరాజు రాజకీయంగా అదృష్టవంతుడు. స్వతంత్రునిగా పోటీ చేసి గెలవడమే కాదు.. పక్క జిల్లాకు వెళ్లి మరీ గెలుపు సాధించడం ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన 1978లో కృష్ణా జిల్లా కైకలూరు నుంచి పోటీ చేసి కేవలం 46 ఓట్ల స్వల్పమెజార్టీతో విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్‌ పార్టీ తరపున అదే నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989లలో విజేతగా నిలిచారు. సొంత జిల్లాలోని అత్తిలి నుంచి 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజేతగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సైతం ఎదురొడ్డి 1983, 1985, 1994లలో సైతం బాపిరాజు విజేతగా నిలిచారు.

1989లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బాపిరాజు రాష్ట్రమంత్రి అయ్యారు. అప్పటి కాంగ్రెస్‌ తరపున ముఖ్యమంత్రులుగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల మంత్రివర్గంలో బాపిరాజు ఉన్నారు. చెన్నారెడ్డి సిఎంగా ఎక్సైజ్‌ శాఖ ఇస్తానంటే బాపిరాజు ససేమేరా వద్దని నిరాకరించారు. చిత్రంగా కోట్ల సీఎంగా అదే శాఖ కేటాయించగా బాపిరాజు అంగీకరించాల్సి వచ్చింది. చిత్రంగా అదే శాఖా మంత్రిగా ఉన్న సమయంలో 12 డిస్ట్రీలరీస్‌, 12 బ్రూవరీస్‌ అనుమతులు మంజూరు విషయంలో ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి రావడం విశేషం. మంత్రిగానే కాదు, శాసనసభ్యునిగా కూడా ఆయన రాజీనామా చేయడం ద్వారా బాపిరాజు తన నిబద్ధతను చాటుకున్నారు. బుజ్జగింపులకు తావులేకుండా ముఖ్యమంత్రి కూడా చెప్పకుండా రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో టిక్కెట్‌ అడగకపోవడం బాపిరాజు నైతికతకు నిదర్శనం.

Also Read : తమ్మినేని వీరభద్రం ఏం చేస్తున్నారు..?

ఆయన విజయపరంపరకు 1996 నర్సాపురం పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో బ్రేక్‌ పడింది. నాటి ఎన్నికల్లో రాష్ట్ర మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేతిలో ఓటమి చెందిన ఆయన 1998న జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి విజయం సాధించారు. కేవలం 13 నెలలు మాత్రమే పదవిలో ఉన్న ఆయన 1999 జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో సినీ నటుడు కృష్ణంరాజు చేతిలో ఓటమి చవిచూశారు. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంపీగా ఉన్న సమయంలో రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది పేదలకు హైదరాబాద్‌లో నిమ్స్‌ వంటి ఉన్నత ఆస్పత్రులలో వైద్యసేవలు అందేలా సహాయపడేవారు. ఆయనతోపాటు ఆయన భార్య అన్నపూర్ణమ్మఅందించిన సేవలు బాపిరాజుకు ప్రజల్లో మంచి పేరును తీసుకువచ్చాయి. అన్నపూర్ణమ్మ ఇటీవల కాలం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చేవరకు ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగాయి.

పశ్చిమ రాజకీయాల్లో బాపిరాజు స్థానాన్ని ఒక విధంగా ఆయన బంధువులు భర్తీ చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుత నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఆయనకు స్వయానా అన్నకుమారుడే. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు స్వయానా బావమరిది. విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 2014, 2019లలో పోటీ చేసిన బాపిరాజు అతి తక్కువ ఓట్లు సాధించారు.

ఆ పార్టీని వీడలేక, ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక బాపిరాజు సతమతమవుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీలో ఒకనాటి కీలకనేతలు వలే రాజకీయాల్లో ఉన్నామని అనిపించుకుంటున్నారే తప్ప చురుగ్గా మాత్రం లేరు. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉండడమే కాదు.. కాంగ్రెస్‌ పార్టీని వీడకపోవడం.. గుబురు మీసకట్టుతో రాజకీయాల్లో తన విలక్షతను బాపిరాజు కాపాడుకుంటూనే వస్తున్నారు.

Also Read : నన్నపనేని రాజకుమారి పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పినట్లేనా..?