Idream media
Idream media
మహా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ.. నాడు ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా వెలిసిన పార్టీ. 38 ఏళ్ల చరిత్ర దాని సొంతం. అదే తెలుగుదేశం. కానీ.. ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబునాయుడి నాయకత్వ లోపం.. రాష్ట్ర విభజనలో ఆయన వేసిన తప్పటడుగుల నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ అతీగతీ లేకుండా పోయింది. ప్రస్తుతం కనీసం కార్యవర్గ సభ్యులు కూడా దొరకని దుస్థితి. ఐదేళ్ల క్రితం 120 మందితో రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటైంది. వారిలో దాదాపు 50 మంది వరకూ ఇతర పార్టీల్లోకి వెళ్లిపో్యారు. నూతన కార్యవర్గం ఏర్పాటు సంవత్సరాల తరబడి జరగడం లేదు. కార్యవర్గం లోకి వచ్చేవారు లేకపోవడమే దీనికి కారణం.
గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీలోనే లేకుండా పోయింది. ఫలితంగా ఉన్న నాయకులు కూడా టీడీపీ ని వదిలేశారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షడుగా పని చేసిన ఎంఎన్ శ్రీనివాస్ లాంటి వారు కూడా పార్టీకి దూరమయ్యారు. 2015లో తెలంగాణ కమిటీ అధ్యక్షుడిగా ఎల్.రమణను, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా అనుముల రేవంత్ రెడ్డిని చంద్రబాబు నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ నియామకంతో పార్టీలో కొంత జోష్ కనిపించింది. ఆ తర్వాత ఓటుకు నోటు కుంభకోణంలో రేవంత్ ఇరుక్కోవడంతో ఆ పార్టీ కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత ఆ లోటు పూడ్చేవారే కరువయ్యారు. అప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలుగా ఉన్న ఆరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, సాయన్న, కేపీ వివేకానంద టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. దీంతో గ్రేటర్ లో కూడా టీడీపీ పట్టు కోల్పోయింది. ఫలితంగా తదనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ గెలిచారు. ఆయన కూడా టీఆర్ఎస్ ప్రజాకర్షక పాలనతో ఆ పార్టీలో చేరిపోయారు.
సభ్యత్వ నమోదూ శూన్యం
తెలుగుదేశం పార్టీ నిబంధనావళి మేరకు ప్రతీ రెండేళ్ల కోసారి సభ్యత్య నమోదు చేసేవారు. కొన్ని సంవత్సరాలుగా సభ్యత్యం నమోదు చేసే వారు కానీ.. సభ్యత్వం తీసుకునే వారు కానీ కరువయ్యారు. దీంతో 2018 నుంచి సభ్యత నమోదు కార్యక్రమం కూడా చేపట్టడం లేదు. దీంతో ఎల్.రమణే ఇప్పటికీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ 3 సార్లు అదే కమిటీ కొనసాగుతూ వస్తోంది. మండల, పట్టణ కమిటీల ఏర్పాటులోనే టీడీపీకి చుక్కెదురవుతోంది. కార్యవర్గం కరువవుతోంది. కేవలం పార్టమెంటరీ నియోజకవర్గ కమిటీ మాత్రం ఆ పార్టీ ఇప్పటి వరకూ వేయగలిగింది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.
చంద్రబాబు వైఫల్యమే..
తెలంగాణలో తెలుగుదేశానికి గట్టి పట్టే ఉండేది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీకి తిరుగులేదు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ లోని 24 నియోజకవర్గాలకు గాను అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా గెలిచిన అనంతరం.. తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం పార్టీ నాయకులకు మాట్లాడే సమయం కూడా ఇచ్చేవారు కాదని, అలాగే కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి. పటిష్ట నాయకత్వం లేకపోవడం వల్లే తెలంగాణలో తెలుగుదేశం మూతపడే స్థితికి వచ్చిందని ఎంపీ గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన సభలో బహిరంగంగానే వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఏకంగా ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురిని నిలబెట్టి చంద్రబాబునాయుడే ప్రచారానికి వచ్చినా గెలిపించుకోలేకపోవడం ఆయన మాటలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.