iDreamPost
iDreamPost
ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటించిన ఆర్ఆర్ఆర్ వీడియో టీజర్ సునామిలా విరుచుకుపడింది. అభిమానుల సంతోషం మాములుగా లేదు. సోషల్ మీడియాని దీని తాలూకు వీడియో బిట్స్, స్క్రీన్ షాట్స్ తో ఊపేస్తున్నారు. నెవెర్ బిఫోర్ తరహాలో ఉందని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. చరణ్ తారక్ టీజర్లలో ఏది బాగుందనే ప్రశ్నకు తావివ్వకుండా రాజమౌళి ఎడిట్ చేయించిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి ఈ భారీ విజువల్ వండర్ కు సంబంధించి రెండు పాత్రల పరిచయాలు జరిగిపోయాయి. ఒకరు అల్లూరి సీతారామరాజు మరొకరు కొమురం భీం. వేర్వేరు ప్రాంతాలు, కాలాలకు చెందినవాళ్లు.
ఇది వాస్తవ కథ కానప్పటికీ ఈ ఇద్దరూ యోధులు కలిసి స్వాతంత్రం కోసం సమరం చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద కథకులు విజయేంద్ర ప్రసాద్ దీన్ని తీర్చిదిద్దినట్టు టాక్. రామరాజు నిప్పుకి భీం నీటికి ప్రతినిధులుగా చూపించారు. రెండు టీజర్లలో కొన్ని షాట్స్ ని గమనిస్తే వాటి స్వభావాలను పాత్రకు అన్వయించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. నీరైనా నిప్పైనా ఉప్పెనగా మారితే చాలా ప్రమాదం. వరదలు వచ్చినప్పుడు జరిగే ప్రళయంలో కలిగే ప్రాణ ఆస్తి నష్టాన్ని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఒక చిన్న నిప్పు రవ్వ లంకాదాహనానికి దారి తీస్తుంది.
అలాంటప్పుడు ఆ తీవ్రత బ్రిటిష్ అరాచక శక్తుల మీద ఈ ఇద్దరూ కలిసి చూపిస్తే ఎలా ఉంటుది. దానికి సమాధానమే ఆర్ఆర్ఆర్ లో చూపించబోతున్నారు. నా తమ్ముడు భీం అని రామరాజు చెప్పడం చూస్తుంటే కథలో ఇద్దరిని అన్నదమ్ములుగా చూపించినా ఆశ్చర్యం లేదు. ఇంతకన్నా గూస్ బంప్స్ ఇచ్చే అంశం అభిమానులకు ఏముంటుంది. వీటికి సంబంధించిన క్లారిటీ రావాలంటే చాలా టైం పడుతుంది. అలియా భట్, ఒలీవియాలు ఇంకా ఎంటర్ కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం కావాలి. ఈ లెక్కన 2021 సమ్మర్ లో రావడం కూడా అంత సులభంగా కనిపించడం లేదు. టీజర్లకే ఇంత ఆలస్యం జరిగినప్పుడు ఇక సినిమా గురించి చెప్పేదేముంది.