iDreamPost
iDreamPost
పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఈ జిల్లాలో పరిషత్ ఎన్నికలు.. ఫలితలు అధికార పార్టీకి ఏకపక్షం. చైౖర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. చివరి నిమషంలో ఎటువంట అద్భుతాలు జరగకుండా ఉంటే ముందు నుంచి అనుకుంటున్నట్టుగా జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీ యువ నేత కౌరు శ్రీనివాస్‌కు దక్కనుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 48 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. పెనుగొండ వాయిదా పడగా, రెండు జెడ్పీటీసీలు ఏలూరు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 45 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 43 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆచంట, జనసేన వీరవాసరం జెడ్పీటీసీ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీనితో జెడ్పీ చైర్మన్ ఎన్నిక వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకోవడం లాంఛనమే.
Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం
వైసీపీకి చెందిన బీసీ నేత కౌరు శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్ కానున్నారు. వీరవసరం మండలానికి చెందిన ఆయన ఈసారి యలమంచలి నుంచి ఏకంగా 13,496 ఓట్ల భారీ మెజార్టీతో విజేతగా నిలిచారు. రాజకీయంగా ఉత్సాహవంతమైన నేతగా జిల్లాలో పేరొందిన ఆయన వీరవాసరం ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. గత ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ గెలిచిన ఏకైక ఎంపీపీ స్థానం ఇదే కావడం విశేషం. ఎంపీపీగా ఉంటూ చేసిన అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా తక్కువ కాలంలోనే పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎన్నికల ముందు ఆయన ఆచంట నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించారు. ఇక్కడ నుంచి ప్రస్తుత రాష్ట్ర గృహనిర్మాణా శాఖమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజుకు అవకాశం వచ్చింది. టిక్కెట్ రాకున్నా నిబద్ధతతో పార్టీకి పనిచేయడం కలిసివచ్చిన అంశం. ప్రస్తుతం ఆయన పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును బలంగా ఢీ కొంటున్నారు. ఇతని అభ్యర్థిత్వం పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారు. దీనికితోడు జిల్లా నుంచి ఎంపికైన ఇతర బీసీ జెడ్పీటీసీల నుంచి పెద్దగా పోటీ లేదు. ఇది కూడా కలిసి వచ్చే అంశంగా మారింది. ఇంకా నాలుగు పదుల వయస్సు రాకున్నా పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్మన్ అవడం ద్వారా కౌరు శ్రీనివాస్ అరుదైన ఘనత సాధించనున్నారు.
Also Read : పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?