iDreamPost
android-app
ios-app

ప‌వ‌న్‌ రాజ‌కీయాల‌కు దారేది?

ప‌వ‌న్‌ రాజ‌కీయాల‌కు దారేది?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రెస్‌మీట్‌

“విలేఖరులంటే నాకు గౌర‌వం. అలాగ‌ని చెడ్డ విలేఖర్ల‌ను స‌హించ‌ను. క‌ర్ర‌ల‌తో కొట్ట‌మ‌ని నా అభిమానుల‌కు చెబుతాను” అన్నాడు.

విలేఖరులు జ‌డుసుకుని “అస‌లు ఎప్పుడు, ఎక్క‌డ ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా?” అని అడిగారు.
“నెగ్గ‌డం నాకెలాగూ తెలియ‌దు. అందుక‌నే త‌గ్గి ఉంటున్నా. ఇంగ్లీష్ రాక‌పోవ‌డం వ‌ల్లే నేను షేక్‌స్పియ‌ర్‌ని చ‌ద‌వ‌లేదు. అందుకే ప్ర‌జ‌ల్ని చ‌దువుతున్నా. ప్ర‌జ‌లు అర్థంకార‌ని మొన్న‌టి ఎన్నిక‌ల్లో తెలిసింది. అందుకే ఊర్లు తిరుగుతున్నా”

“మీరు చంద్ర‌బాబు ఏజెంట్ అని అంటున్నారు”
“యాక్చువ‌ల్‌గా ఏజెంట్ 111 అని నేను సినిమా తీస్తామనుకున్నా. కానీ కుద‌ర‌లేదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. చంద్ర‌బాబుకి ఏమీ రాదు. అందుకే ఆయ‌న నాయ‌కుడ‌య్యాడు. ఏమీ రాక‌పోయినా నాయ‌కుడు కావ‌ల‌నేది నా త‌ప‌న . అందుకే ఆయ‌న్ని ఫాలో అవుతున్నా”
విలేఖరులు బుర్ర గోక్కొని “రాయ‌ల‌సీమ‌ని ఎందుకు తిడుతున్నారు?” అని అడిగారు.
“రాయ‌ల‌సీమ‌లో ఇంకా పులివెందుల పంచాయితీ జ‌ర‌గుతోంది కాబ‌ట్టి”
“పులివెందుల మున్సిపాలిటీగా మారి చాలా కాల‌మైంది. మీరింకా పంచాయితీ అంటున్నారు” అన్నారు విలేఖరులు.
రాయ‌ల‌సీమ‌లో పాలెగాళ్లు అనే పుస్త‌కం చూపించి…”ఇది ప‌రిస్థితి. సీమ‌లో ఫ్యాక్ష‌న్ ఏలుతోంది. ర‌క్తం రాజ్య‌మేలుతోంది అన్నాడు” ప‌వ‌న్‌.
“అది 25 ఏళ్ల క్రితం వ‌చ్చిన పుస్త‌కం. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. మీ సినిమాల్లో త‌ప్ప ఇంకెక్క‌డా ఫ్యాక్ష‌న్ లేదు. అయినా చంద్ర‌బాబు ప‌వ‌ర్‌లో ఉన్న‌ప్పుడు ఇవ‌న్నీ మీకు ఎందుకు క‌న‌ప‌డ‌లేదు”
“అప్పుడు క‌న‌ప‌డ‌వు. నా క‌ళ్ల‌కి చ‌త్వారం వ‌చ్చింది. ఇప్పుడు అన్నీ క‌నిపిస్తున్నాయి”
“అంటే జ‌గ‌న్ వ‌స్తే సీమ ఫ్యాక్ష‌న్ కనిపిస్తుందా?”
“జ‌గ‌న్ వ‌చ్చి తెలుగుని నాశ‌నం చేశాడు. నేను ఈ రోజు ఆముక్త‌మాల్య‌ద చ‌ద‌వ‌లేక‌పోతున్నానంటే జ‌గ‌నే కార‌ణం”
“మీ చ‌దువుకి జ‌గ‌న్‌కి ఏంటి సంబంధం?”
“అన్నీ జ‌గ‌నే చేశాడు. నా పార్టీ వాళ్లంద‌ర్నీ ఓడించాడు”
“ఒక్క‌రు గెలిచారు”
“అక్క‌డ ఆయ‌న్ని చూసి ఓటు వేశారు. న‌న్ను చూసి కాదు. అయినా నేను 30 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉంటా. అరాచ‌కాల‌కు తెర‌తీస్తా. దుర్మార్గుల తిత్తి తీస్తా. ఆఖ‌రి పంచ్ మ‌న‌దైతే ఆ కిక్కే వేరు”
“ఇట్లా డైలాగ్‌లు చెబుతూ ఉంటే మీ తర్వాత సినిమా పేరు రాజ‌కీయాల‌కు దారేది? అని ఉంటుంది. 30 ఏళ్లు వెతికినా దొర‌క‌దు” అని విలేఖరులు వెళ్లిపోయారు.