Idream media
Idream media
ఏపీ, తెలంగాణల మధ్య జల జగడాల సంగతి ఎలాగున్నా… అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రాజెక్టుల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వం ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేస్తూ పోతుంటే.. మరో పక్క ప్రతిపక్షమైన కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అంటూ.. ఉద్యమాలు చేస్తోంది.
కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల నిర్మాణం కావాలనే ప్రభుత్వం చేపట్టడం లేదని ఆరోపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2నే కాంగ్రెస్ నేతలు జలదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేశారు. నాడు.. కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీస్తూ.. నిరసన దీక్షలు చేపట్టడానికి సమాయత్తం అయ్యారు. అసలే రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో.. నిరసనలు తగదంటూ కాంగ్రెస్ నేతలను ఎవ్వరినీ ఇళ్ల నుంచి కదలకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పీసీసీ ఉత్తమ కుమార్ రెడ్డిని, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను హౌస్ అరెస్ట్ చేశారు. కోమటిరెడ్డి, జానారెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ రోజున దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది.
మళ్లీ ఈ నెల 11న పెండింగ్ ప్రాజెక్టులతో పాటు విద్యుత్ తదితర సమస్యలపై కాంగ్రెస్ సచివాలయం ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా నేడు పెండింగ్ నీటి ప్రాజెక్టుల సందర్శనకు ఆ పార్టీ పిలుపు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులు గోదావరి నదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను సందర్శించనున్నారు. గత రెండు పర్యాయాలు ప్రాజెక్టులపై కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఈ సారి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాశారు. పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు తక్కువ సంఖ్యలో వెళతామని, అడ్డుకోవద్దని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ మా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అంటే.. చట్టం లోని ఏ నిబంధన ప్రకారం అడ్డగిస్తున్నారో.. రాత పూర్వకంగా తెలపాలని వెల్లడించారు.
అధికార పార్టీ నాయకులు నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు చేపడుతున్నా అడ్డు తగలడం లేదని, కాంగ్రెసు నేతలకే ఆంక్షలు విధిస్తూ ఉన్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. పార్టీల నేతలు బృందాల వారీగా విడిపోయి ఆయా ప్రాజెక్టులను సందర్శిస్తారు. ఉత్తమ్ ఆధ్వర్యంలోని బృందం ఆసిఫాబాద్ జిల్లా కౌతాల మండలం తుమ్మిడి హెట్టిలోని ప్రతిపాదిత ప్రాణహిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించ నుంది. ఆయన వెంట మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉంటారు. ములుగు జిల్లాలోని తుపాకుల గూడెం సమీపంలోని గోదారి నదిపై నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీని ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సందర్శిస్తారు. పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, పోడెం వీరయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఇతర ప్రాజెక్టులను సందర్శిస్తారు.
అయితే.. గత రెండు పర్యాల మాదిరిగా ఈసారి కూడా కాంగ్రెస్ నేతలను ఎక్కడి కక్కడ పోలీసులు అడ్డగిస్తారా.. డీజీపీకి ఉత్తమ్ లేఖ రాసిన నేపథ్యంలో అనుమతి ఇస్తారా చూడాలి. ప్రాజెక్టుల సందర్శన తర్వాత వాళ్ళు ఏ స్టెప్పు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం మాత్రం తాను పూర్తి చేయానకుంటున్న ప్రాజెక్టులను మాత్రం ఒక్కొకటిగా అందుబాటులోకి తీసుకు వస్తోంది. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపిస్తోంది.