iDreamPost
android-app
ios-app

నీటిపై న్యాయ పోరు..!

నీటిపై న్యాయ పోరు..!

తెలుగు రాష్ట్రాల జల జగడం రోజురోజుకు పెద్ద వివాదం లా మారుతుండటంతో న్యాయ పోరాటం కోసం ఓ రైతు కదిలాడు. న్యాయవ్యవస్థ తమకు దిక్కు అని కోర్టులే న్యాయం చెప్పాలంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు తెలంగాణ ప్రభుత్వ తీరు మీద హైకోర్టును ఆశ్రయించాడు.

తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసేలా నాగార్జున సాగర్ పులిచింతల లో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా జీవో జారీ చేసింది. ఇది గత నెల 28వ తేదీన అప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల వద్ద తెలంగాణ అధికారులు పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.

పులిచింతల నుంచి భారీగా నీరు ప్రకాశం బ్యారేజీకి రావడంతో నిత్యం అర టీఎంసి పైగా నీరు సముద్రం పాలవుతోంది. ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం మూడు టి.ఎం.సి లే అవడం తో పులిచింతల నుంచి భారీగా వస్తున్న నీటిని కిందికి వదలక తప్పడం లేదు. ప్రకాశం బ్యారేజ్ లోని 42 గేట్ల లో రోజువారీ 15 నుంచి 20 గేట్లు ఎత్తి, నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు మేర ఉంటే, బ్యాక్ వాటర్ ద్వారా పోతిరెడ్డిపాడు కు నీరు తరలించేందుకు వీలుంటుంది. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుంది. నెల్లూరు కు సైతం పోతిరెడ్డిపాడు వల్ల నీరు వస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది మిగులు జలాల మీద గొడవ పెడుతోంది. కేవలం శ్రీశైలం రిజర్వాయర్కు వరదనీరు వచ్చినప్పుడే భారీగా నీరు చేరుతుంది. ఆ సమయంలోనే పోతిరెడ్డిపాడు కు నీరు ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. అంటే వరద నీరు వస్తేనే పోతిరెడ్డిపాడు నీరు వెళుతుంది. అంటే కృష్ణా జలాల పంపిణీ అంశం దీనిలోకి రాదు. కేవలం వరద నీరు మాత్రమే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు.

తాజాగా కృష్ణానది జలాల మీద వివాదం రాజుకుంది నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలని వైఎస్ జగన్ కోరారు. మరోపక్క ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు తెలంగాణ మంత్రులు తమ స్వరాన్ని పెంచారు. కృష్ణా జలాలు ఆంధ్ర – తెలంగాణకు 50 శాతం వాటా ఉండాలని ఇప్పుడు వాదిస్తున్నారు. జనాభా ప్రకారం చూసుకున్నా, నదీ పరివాహక ప్రాంతం, దాని కింద సాగయ్యే భూమి వివరాలు చూసుకున్న ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువగా దక్కాలి. ఇప్పటివరకు యేడాదికి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు (36 శాతం), ఆంధ్రప్రదేశ్ కు 514 టీఎంసీలు (64 శాతం ) మేర పంపకాలు జరుగుతున్నాయి. కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ పంపిణీ సాగుతోంది. అయితే ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ ఉత్పత్తికి పూనుకుంది.

ఇప్పుడు ఈ అంశం మీద, నిరంతరం కృష్ణ నీరు వృధాగా సముద్రం పాలు అవ్వడం మీద కృష్ణా డెల్టా రైతు ఒకరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే దీనిపైన కోర్టులు తగిన నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రభుత్వ చర్యను నిలువరించాలని వృధాగా పోతున్న నీటిని అరికట్టాలని ఆరైతు కోరుతున్నాడు. కృష్ణా నది నీరు ప్రతి చుక్క చాలా విలువైనదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరదలు లేని సమయంలో వృధాగా పోతున్న నీటిని అరికట్టాలని, తెలంగాణ ప్రభుత్వ తీరు మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని రైతు కోరుతున్నాడు.

Also Read : మాజీమంత్రి నారాయణ మెడకు భూకుంభకోణం ఉచ్చు