కేరళలో ప్రారంభమయిన “వాటర్ బెల్” కార్యక్రమాన్ని, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలల దినోత్సవం సందర్భంగా కర్నూల్ జిల్లాలో కలెక్టర్ వీర పాండ్యన్ ప్రారంభించారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా జిల్లా అంతటా “వాటర్ బెల్” కార్యక్రమాన్ని అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసారు. ఇందులో భాగంగా ఉదయం మరియు మధ్యాహ్నం బెల్ కొట్టగానే పాఠశాల విద్యార్థులు నీళ్లు తాగేలా చూడాలని ఆ బాధ్యతలను సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని కర్నూల్ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు.
ఇంతకూ ఏంటీ “వాటర్ బెల్”?
నీళ్లు తక్కువగా తాగడం వల్ల విద్యార్థులు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారని భావించిన కేరళ ప్రభుత్వం “వాటర్ బెల్” పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకి మూడుసార్లు పాఠశాలల్లో “బెల్” కొడతారు. ఆ సమయంలో విద్యార్థులంతా నీళ్లు తాగాలి. మొదటి గంట ఉదయం 10.30 కి, రెండో గంట మధ్యాహ్నం 12.00గంటలకు, మూడవ గంట 2.00 గంటలకు కొడతారు. ఈ వాటర్ బ్రేక్ వ్యవధి 15-20 నిమిషాల మధ్యలో ఉంటుంది. కేరళతో పాటుగా కర్ణాటక కూడా ఈ వాటర్ బెల్ పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది.