iDreamPost
iDreamPost
మాజీ ఎంపీ సబ్బం హరితో మొదలయ్యింది.. ఆ తర్వాత గీతం వరకూ చేరింది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆక్రమణలపై గురిపెట్టారు. ఇక ఆదివారం ఉదయం అదే పరంపరలో టీడీపీ నేత హర్ష కి చెందిన ఆక్రమణలపై జీవీఎంసీ దృష్టి పెట్టింది. ఉదయాన్నే పోలీసు పహార మధ్య వీఎంఆర్డీయే స్థలాన్ని ఆక్రమించి, నిర్మించిన ఫ్యూజన్ ఫుడ్స్ ని తొలగించారు.
విశాఖ సిరిపురం ప్రాంతంలో వీఎమ్‌ఆర్‌డీఏ కి సంబంధించిన స్థలంలో ఫ్యూజన్ ఫుడ్స్ నిర్మించారు. దానిని అక్రమించి నిర్మించడంతో తొలగించాని గతంలోనే పలుమార్లు నోటీసులు వెళ్లినా అధికారంలో ఉన్న ప్రభుత్వం అండతో దాని నుంచి తొలగకుండా వ్యవహారం కొనసాగించారు. ఈ నేపథ్యంలో వీఎమ్‌ఆర్డీఏ అధికారులు రంగంలో దిగారు. లీజు పేరుతో స్థలం తీసుకుని అనుమతుల్లేకుండా చేసిన నిర్మాణాలను తొలగించే ప్రక్రియ చేపట్టారు.
అయితే తమకు నోటీసులు ఇవ్వలేదని హర్ష వర్గం వాదిస్తుండడం విశేషం. 2024 వరకు లీజు ఉన్నప్పటికీ నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం లీజు గడువు పూర్తయిపోవడంతోనే ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక హర్ష గతంలో విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనలో ప్రముఖంగా వినిపించిన నేత. ఆయన్ని అప్పట్లో జగన్ పై కోడికత్తి కేసులో విచారణకు కూడా పిలిచారు. ఆయన మీద తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. హర్ష అప్పట్లో విశాఖ ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ కూడా కాంటాక్ట్ నిర్వహించారు. ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి జనుపల్లి శ్రీనివాస్ నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. టీడీపీలో కీలకనేతగా ఉన్న హర్ష ఇప్పుడు తాజాగా ఆక్రమణల విషయంలో తెరమీదకు రావడం విశేషమే.