iDreamPost
iDreamPost
చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. అనూహ్యంగా ఉన్నత పదవి అందుకున్నారు. ఇంకెన్నో పదవులు అలంకరించి రాజకీయంగా ఎదుగుతారని అనుకుంటున్న సమయంలోనే విధి కన్నెర్ర చేసింది. అనారోగ్యం రూపంలో కాటేసింది. ఆ కుటుంబ ఆశలను తుంచేసింది. విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ కుమార్ హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా సహచరుడిని కోల్పోయి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతిచెందిన అనిల్ కుమార్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు స్వయానా మేనల్లుడు.
మామ వెంటే రాజకీయాల్లోకి..
విజయనగరం జిల్లా సాలూరు మండలం సన్యాసిరాజు పేట గ్రామానికి చెందిన అనిల్ కుమార్ వయసు 30 ఏళ్లు. ఇంకా వివాహం కాలేదు. తండ్రి కార్మిక శాఖ అధికారిగా పనిచేస్తుండగా తల్లి శ్రీకాకుళం సోషల్ వెల్ఫేర్ విభాగం డీడీగా పనిచేస్తున్నారు. సోదరి వైద్యురాలు. విజయనగరంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. యువకుడైన అనిల్ కుమార్ మొదటి నుంచి మేనమామ రాజన్నదొర వెంట ఉంటూ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మొదట కాంగ్రెస్, తర్వాత వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు.
2013లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో సాలూరు నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సాలూరు జెడ్పీటీసీగా విజయం సాధించారు. జిల్లా పరిషత్ లకు ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. జిల్లా పరిషత్ రెండో ఉపాధ్యక్షుడిగా పార్టీ అనిల్‌ను ఎంపిక చేయడంతో అతి చిన్న వయసులోనే జెడ్పీటీసీ సభ్యుడిగా.. జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన ఘనత సాధించారు. కానీ ఆ ఆనందం ఆ కుటుంబంలో ఎన్నాళ్లో నిలవలేదు.రెండు నెలల్లోనే విధి వక్రించింది. శనివారం ఉదయం గుండెపోటుతో అనిల్ మృతి చెందారు.
Also Read : Bail For Pattabhi – పట్టాభికి బెయిల్.. రెండు రోజుల్లోనే బయటకు..