iDreamPost
android-app
ios-app

టీడీపీకి సంక‌ట‌మే : విశాఖ‌లో ముందుకెళ్ల‌డం ఎలా..?‌

టీడీపీకి సంక‌ట‌మే : విశాఖ‌లో ముందుకెళ్ల‌డం ఎలా..?‌

2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ గ్రేట‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని నాలుగు నియోజక వర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రం అంతా ప‌రువుపోయినా విశాఖ‌లో కాస్త కాపాడుకోగ‌లిగింది. ఇప్పుడు విశాఖ‌లో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. బాబు విశాఖ‌ను రాజ‌ధానిగా వ్య‌తిరేకించ‌డంతో సీన్ రివ‌ర్స్ అయింది. వైసీపీ హుషారైంది. ఏడాది కిందట నగర పాలక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పుడు జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంటామంటూ టీడీపీ నేత‌లు ప్ర‌క‌టన‌లు గుప్పించేవారు. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా వ‌చ్చే నెల 10న ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సారి తెలుగుదేశం నుంచి గొంతెత్తి మాట్లాడే నాయ‌కుడే క‌నిపించ‌డం లేదు. విశాఖను రాజ‌ధానిగా వ్య‌తిరేకించ‌డంతో ఇక్క‌డ టీడీపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఉన్న నేత‌లు ఎన్నిక‌ల్లో ముందుకు ఎలా వెళ్లాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

మేయర్‌ పీఠం ప్రతిష్టాత్మకం

రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా పోరాడాల్సిన ప‌రిస్థితి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్ద న‌గ‌రం విశాఖ‌ప‌ట్ట‌ణం. ఇది 1858 లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. త‌ర్వాత 1979 లో కార్పొరేషన్ గా అభివృద్ధి చెందింది. జాతీయ పట్టణ అభివృద్ధి ప‌థ‌కం ద్వారా విశాఖప‌ట్ట‌ణాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి విశాఖ పట్నం పురపాలక సంఘాన్ని, 21 నవంబర్ 2005 న మహా నగర పాలక సంస్థ గా మార్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 20,91,811 జ‌నాభా గ‌ల విశాఖ‌లో 2021 జనవరి 21 నాటికి వార్డుల సంఖ్య 81 నుంచి 98 కి పెరిగాయి. దీంతో రాజ‌కీయంగా కూడా ఇప్పుడు ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది.

గ‌తంలో ఇక్క‌డ తెలుగుదేశానికి మంచి ప‌ట్టు ఉండేది. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా విశాఖ‌లో టీడీపీ ప‌ట్టు నిలుపుకుంటూ వ‌చ్చేది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ తుఫానులోనూ టీడీపీ విశాఖ న‌గ‌రంలో నాలుగు సీట్లు సాధించింది. విశాఖ‌పై టీడీపీ ప‌ట్టును నిలుపుకుంది. అలాగే 2014 ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ సైతం ఓడిపోయారు. దీంతో విశాఖ‌లో ఇక తిరుగులేద‌ని టీడీపీ విర్ర‌వీగింది. కానీ ప్ర‌స్తుతం సీన్ మారిపోయింది.

జ‌గ‌న్ పాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ను ప్ర‌క‌టించిన అనంత‌రం ఉత్త‌రాంధ్ర అంతా ఆయ‌న‌కు జై కొడుతోంది. అంతేకాదు… విశాఖ న‌గ‌రంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం వైసీపీ కే జై కొట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్ప‌టికే విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వాసుప‌ల్లి వైసీపీ కి మ‌ద్ద‌తు ప‌లికారు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను వైసీపీలో చేర్పించారు. విశాఖ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పెత‌కం శెట్టి గ‌ణ‌బాబు ప్ర‌స్తుతం త‌ఠ‌స్థంగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌శ్నార్థ‌కంగా కూర్చుని ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌రంలో పాల్గొనేందుకు నేత‌లు క‌రువైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి తోడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఉద్య‌మంలో కూడా వైసీపీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇటీవ‌ల ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు అపూర్వ స్పంద‌న ల‌భించింది. ఇలా అన్ని ర‌కాలుగానూ వైసీపీ వీర విహారం చేస్తుంటే.. తెలుగుదేశం చుక్కాని లేని నావ‌లా కొట్టుమిట్టాడుతోంది.