iDreamPost
iDreamPost
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ గాలి వీచినా విశాఖ నగర వాసులు మాత్రం సైకిల్ సవారీ చేశారు. టీడీపీకి పట్టం కట్టారు. విశాఖ నగర పరిధిలోని నాలుగు సీట్లలోనూ టీడీపీ విజయం సాదించింది. జీవీఎంసీ పరిధిలోని భీమిలి, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకున్నప్పటికీ విశాఖ లో మాత్రం అదే ఊపు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో విశాఖలో దక్కిన ఉత్సాహం టీడీపీలో కనిపించడం లేదు. తొలుత అధికారం కోల్పోవడంతో ఢీలా పడిన ఆ పార్టీ నేతలు తాజా పరిణామాలతో మరింత తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధిష్టానం తీరు కారణంగా తలలు పట్టుకుంటున్నారు.
పాలనా వికేంద్రీకరణ విషయంలో జగన్ వ్యూహం విశాఖ టీడీపీని వణికిస్తోంది. ఉక్కిరిబిక్కిరిగా మార్చింది. అమరావతి పేరుతో చంద్రబాబుని నడిపిన హంగామా తో ఆపార్టీ విశాఖ వాసుల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాజధానిని ఉత్తరాంధ్రకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చట్టపరమైన ఆటంకాలను అధిగమించిన ప్రభుత్వానికి న్యాయస్థానాల ద్వారా అదుపుచేయాలని ఆశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖకు రాజధాని తరలివస్తుందని ఆశించిన నగర ప్రజలకు చంద్రబాబు తీరు మింగుడుపడడం లేదు. ఆ ప్రభావంతో స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలయితే అటు ప్రజలకు, ఇటు పార్టీ అధినేతకు మధ్య నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబు కారణంగా ఇప్పటికే గంటా శ్రీనివాసరావు దాదాపుగా టీడీపీతో తెగతెంపులు చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. కానీ ఆయనకు స్పష్టమైన దారి కనిపించకపోవడంతో ఎదురుచూస్తున్నారు. ఇక దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అయితే బాబు మీద గుర్రుగా ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులు మరణించిన సమయంలో కనీసం పలకరించడానికి కూడా రాని చంద్రబాబు తీరుని ఆయన తట్టుకోలేకపోతున్నారు. త్వరలో ఆయన బాబుకి వ్యతిరేకంగా గొంతు విప్పే అవకాశం ఉందనే ప్రచారం అనుచరుల్లోనే వినిపిస్తోంది. ఇక నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెస్ట్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా టీడీపీ అధిష్టానంతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా ఆయన తీరు మారింది. చివరకు ఇటీవల రాజధాని అంశంలో తన పేరుతో సోషల్ మీడియాలో చేసిన ఓ ప్రచారాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. విశాఖ రాజధానికి తాను వ్యతిరేకం అన్నట్టు చూపించే ప్రయత్నం సరికాదని కూడా చెప్పేసి ఆశ్చర్యపరిచారు.
సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రం టీడీపీ విధానానికి కట్టుబడి ఉన్నానని తేల్చిచెబుతున్నారు. పైగా విశాఖ విషయంలో ఆయన ఊగిసలాట లేకుండా సాగుతున్నారు. దాంతో ఆయన పట్ల ప్రజల్లో చాలాకాలంగా ఉన్న సానుకూలత సన్నగిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది. దానిని గ్రహించిన తర్వాతే ఇతర ఎమ్మెల్యేలు కూడా టీడీపీ దారిలో సాగేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేరని భావిస్తున్నారు. ఏమయినా ఈ పరిణామాల కారణంగా విశాఖలో బలంగా ఉందనుకున్న టీడీపీ పరిస్థితి పేలవంగా మారింది. పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. కనీసం పార్టీ కార్యాలయం నిర్వహణ కూడా సజావుగా సాగడం లేదు. దాంతో టీడీపీకి కొత్త చిక్కులు వచ్చినట్టేనని చెప్పవచ్చు. విశాఖలో ఆపార్టీ ఉనికి గడ్డు స్థితిలో ఉన్నట్టు భావించవచ్చు.