ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా ఇక్కడ సాఫ్ట్ వేర్ రంగాల్లో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ప్రముఖ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తుండడంతో టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న విప్రో ఎస్ఈజెడ్ క్యాంపస్… పల్సస్ సెంటర్‌గా మారిపోయింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో త్వరలోనే మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రూ. 100 కోట్ల వరకూ ప్రోత్సాహకాలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో ఈ రంగం విశాఖలో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం రూ. 100 కోట్ల వరకూ ప్రోత్సాహకాలు విడుదల చెయ్యడంతో చాలా కంపెనీలు ఊపిరి పోసుకుంటున్నాయి. ప్రభుత్వం సహకారంతో వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. రాబోయే కాలంలో కనీసం 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి ఆయా సంస్థలు పని చేస్తున్నాయి. ఐటీ సామ్రాజ్యం విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ లో టాప్ ప్లేస్
ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న డిజిటల్ మార్కెటింగ్‌లో విశాఖ నగరం ప్రపంచ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవని ఐటీ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖపట్నం కేంద్ర బిందువు కానుందని పల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు అన్నారు. ఒకప్పుడు మార్కెటింగ్ అంటే ప్రజలు షాపింగ్ మాల్స్‌కి వెళ్లి చేసేవారనీ.. ట్రెండ్ మారుతున్న తరుణంలో ఎక్కువ మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్ యాప్స్‌పైనే ఆధారపడుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించనుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 50 దేశాల వరకూ విశాఖపట్నం నుంచే సేవలు అందించే రోజులు సమీపంలో ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బోలెడు అవకాశాలు
ప్రస్తుతం ఐటీ, ఐటీఎస్ అవకాశాలను హైదరాబాద్, బెంగళూరు నగరాలు సొంతం చేసుకున్నాయనీ.. మిగిలిన డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు విశాఖవేనని శ్రీను అంటున్నారు. సంప్రదాయ మార్కెటింగ్ స్థానంలో దూసుకొస్తున్న డిజిటల్ మార్కెటింగ్ రోజు రోజుకీ ఎదుగుతున్నా.. సమర్థ మానవ వనరుల కొరత మాత్రం ఉందన్నారు. ఆసక్తి, అభిరుచి ఉన్నవారు తగిన నైపుణ్యాల్ని పెంపొందించుకుంటే బోలెడు అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చని సూచించారు. డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, విజువలైజేషన్ కన్సల్టెంట్స్, ఆపరేషన్ అనలిస్ట్, సప్లై చైన్ అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, డేటా మోడలర్‌తో పాటు విభిన్న రకాల ఉద్యోగాలు ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా రాబోతున్నాయని తెలిపారు. పల్సస్ సాఫ్ట్వేర్ సంస్థ విశాఖలో కేవలం 20 మందితో కార్యకలాపాలు ప్రారంభించిందనీ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండంటంతో సేవలు విస్తరించి… ఇప్పుడు 940 మంది ఉద్యోగులతో కిటకిటలాడుతోందని వివరించారు.