iDreamPost
android-app
ios-app

సేఫ్ గేమ్ ఎంచుకున్న రానా టీమ్

  • Published Apr 14, 2021 | 9:39 AM Updated Updated Apr 14, 2021 | 9:39 AM
సేఫ్ గేమ్ ఎంచుకున్న రానా టీమ్

థియేటర్లు తెరుచుకున్నాయి, జనం ముందు లాగా వస్తున్నారు, హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయన్న ఆనందం మొదలై పట్టుమని మూడు నెలలు దాటిందో లేదో మరో సారి ఇండస్ట్రీలో ఆందోళన ఘడియలు మొదలయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల లవ్ స్టోరీ, టక్ జగదీష్ లు ఇప్పటికే పోస్ట్ పోన్ అయిపోయి అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తాయి. తర్వాత లిస్ట్ లో రాబోతున్న సినిమా విరాట పర్వం. రానా సాయిపల్లవి కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించిన ఈ పీరియాడిక్ నక్సలైట్ మూవీ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులోనూ టీజర్లు పోస్టర్లు ఆసక్తిని పెంచాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి.

అంతా బాగానే ఉంది కానీ ఏప్రిల్ 30కి ముందు చెప్పిన డేట్ ప్రకారం విరాట పర్వం వస్తుందా రాదా అనే ప్రశ్నకు చెక్ పెడుతూ వాయిదాని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చేతిలో కేవలం15 రోజుల సమయం ఉంది. ఇంకా ట్రైలర్ లాంచ్ జరగలేదు. ప్రీ రిలీజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయడం కష్టమే. ఇంకా లిరికల్ వీడియోస్ బ్యాలన్స్ ఉన్నాయి. మరి అవన్నీ పూర్తి చేసి టార్గెట్ రిచ్ కాగలరా అంటే అనుమానమే. అందుకే కఠినమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆచార్య, నారప్పలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో విరాట పర్వం రిస్క్ చేసేందుకు రెడీగా లేదు. ఆ సూచనలు ముందు నుంచే ఉన్నాయి.

జనాలు కరోనా భయంతో పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం అయితే మానుకోలేదు. వకీల్ సాబ్ ని అందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మరీ ఇండస్ట్రీ రికార్డులు అనే స్థాయిలో కాకపోయినా భారీ వసూళ్లు అయితే నమోదవుతున్నాయి. నిన్నటిదాకా సెలవులతో సందడి కనిపించింది కాబట్టి ఇవాళ్టి నుంచి కీలకంగా మారనుంది. విరాట పర్వంతో సహా ఇతర యూనిట్లు ఈ విషయం మీద దృష్టి సారించాయి. ఒకవేళ యాభై శాతం ఆక్యుపెన్సీ వచ్చినా కూడా సగం సీట్లతో తమ సినిమాలను విడుదల చేసేందుకు బడ్జెట్ నిర్మాతలు రెడీగానే ఉన్నారు. కానీ విరాటపర్వంకు అలా సాధ్యం కాదు. అందుకే ఈ పోస్ట్ పోన్ సేఫ్ గేమ్ ఆడక తప్పలేదు.