iDreamPost
iDreamPost
సాధారణంగా మన సినిమాల్లో ఏ పాత్రలు ఎలా ఉన్నా చివరికి వచ్చేసరికి హీరోదే డామినేషన్. విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్న సరే చివరికి కథానాయకుడి చేతిలో ఓడిపోవల్సిందే. కథలు రాసుకునే టైంలోనే దర్శక రచయితలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా కాకుండా చాలా దుష్టలక్షణాలు ఉన్న విలన్ పాత్రే హైలైట్ అవుతూ హీరో పరిధి తక్కువగా ఉంటే. అసలలా ఊహించగలమా. కాని ఇలాంటి విభిన్న లక్షణంతో వచ్చిన ఓ సినిమా ఘన విజయం సాధించడం మాత్రం విశేషమే. దానికి ఉదాహరణ 1994లో వచ్చిన ఎం ధర్మరాజు ఎంఎ. అదే సంవత్సరం జనవరిలో తమిళ్ లో బాహుబలి కట్టప్ప డ్యూయల్ రోల్ లో ‘అమైది పదై’ వచ్చింది. డబ్బింగ్ సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న నటుడు మణివన్నన్ దీనికి డైరెక్టర్.
అక్కడ ఘన విజయం సాధించాక తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాత జొన్నాడ రమణమూర్తి. అప్పటికే దీన్ని చూసేసిన మోహన్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీమేక్స్ లో చేయి తిరిగిన రవిరాజా పినిశెట్టి దర్శకుడిగా రంగంలోకి దిగారు. రాజ్ కోటి సంగీతంతో పాటు క్యాస్టింగ్ కూడా భారీగా సెట్ అయ్యింది. ఇక కథ విషయానికి వస్తే ఓ చిన్న ఊళ్ళో కొబ్బరిచిప్పలు ఏరుకునే ఓ యువకుడిని రిజర్వేషన్ కోటా వల్ల స్థానిక ఎమెల్యే అతన్ని పోటీకి నిలబెడతాడు. కాని గెలిచాక ఇతగాడు ఎక్స్ ఎమెల్యేని తన చెప్పు చేతల్లో పెట్టుకుని దుర్మార్గాలు, అరాచకాలు, హత్యలు చేస్తూ రాజకీయంగా ఎదిగిపోతాడు. ఈ క్రమంలో తనను నమ్మిన ఓ అమ్మాయికి మోసం చేస్తే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది. వాడు పెరిగి పెద్దయ్యి పోలీస్ ఆఫీసర్ గా మారి తన తండ్రి అంతు చూసే శపథం పూనుతాడు.
ఇక అటుపై కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. తమిళమంత బ్లాక్ బస్టర్ కాకపోయినా ఎం ధర్మరాజు ఎంఎ మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ముఖ్యంగా విలన్ పాత్రలో మోహన్ బాబు విశ్వరూపం చూపించేశారు. సినిమా చూస్తున్నంత సేపు పోలీస్ గా కన్నా పొలిటీషియన్ గానే కలెక్షన్ కింగ్ మనల్ని అద్భుతంగా మెప్పిస్తాడు. రంభ, సురభి హీరొయిన్లు కాగా సత్యనారాయణ, సుజాత, సాక్షి రంగారావు, చలపతిరావు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డిసెంబర్ 11న విడుదలైన ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబులోని నెగటివ్ షేడ్స్ వాడుకుని సక్సెస్ అందుకుంది. అప్పటికే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న కలెక్షన్ కింగ్ ఇలాంటి సబ్జెక్టు ఒప్పుకోవడం ఆ సమయంలో హాట్ టాపిక్ గా నిలిచింది