iDreamPost
android-app
ios-app

తీరనున్న ప్రజల ఇబ్బందులు

  • Published Sep 05, 2020 | 11:57 AM Updated Updated Sep 05, 2020 | 11:57 AM
తీరనున్న ప్రజల ఇబ్బందులు

సాధారణంగా వీధిలో బల్బుపోతే సదరు పంచాయతీ బాధ్యుల దృష్టికి విషయం వెళుతుంది. ఆ తరువాత వారు మెకానిక్‌ను పిలిచి బాగు చేయించడమో, బల్బు పోతే కొత్తబల్బు తెచ్చి పెట్టడమో చేస్తారు. ఇక్కడ వీలైనంత వేగంగా వెంటనే సమస్య పరిష్కారం అయిపోతుంది.

కానీ మన వీధిలో బల్బు పోతే.. దానికి మార్చేందుకు ఒక ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చి, ప్రతి నెలా ఇంత సొమ్ము ఇస్తామని ఒప్పందపడి, తీరా బల్బు పోయే సమయానికి సదరు ఏజెన్సీ వాళ్ళు నెలల తరబడి రాకపోవడం, చీకట్లోనే మసలాల్సి రావడం వంటివి జరిగితే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడి పాలనే అవుతుంది.

గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నది ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. మచ్చుకు కొన్ని పంచాయతీల మాట అటుంచితే మెజార్టీ గ్రామాల్లో వీధి దీపాల సమస్య తీవ్రమైన సమస్యగా మారిపోయింది. పంచాయతీ సిబ్బందిపై జనం తిరగబడే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి.

పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వారు ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ప్రతి మూడు నెలలకు ఒక్కో వీధిలైటుకు సదరు ఏజెన్సీకి రూ. 150లు నిర్వహణా ఖర్చుల క్రింద చెల్లించేవారు. మండలానికి ఒక టెక్నీషియన్‌ను ఏర్పాటు చేసి ఆ మండలంలోని వీధి దీపాలకు ఏ సమస్య వచ్చినా మరమ్మత్తులు చేయించేందుకు నిర్ణయించారు. ఇదంతా వినేందుకు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిభిన్నంగా ఉండేది.

ఎల్‌ఈడీ లైట్లలో సగానికిపైగా వెలిగేవి కాదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ప్రైవేటు ఏజెన్సీకి సమాచారం ఇచ్చేవారు. కానీ వారు నెలల తరబడి స్పందించేవారు కాదు. బల్బు మాడిపోతే కొత్తబల్బులు వేసేవారు కాదు. దీంతో ఆ వీధిలోని వారంతా పంచాయతీ సిబ్బంది మీద దండెత్తేవారు. ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ వీధిలైట్లు వెలిగించడం లేదంటూ నానా మాటలు అనేవారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుక్కూర్చునేవారు. పంచాయతీ నిధుల నుంచి వీధిలైట్లు వేసేందుకు అనుమతి ఉండేది కాదు. ప్రైవేటు ఏజెన్సీ వారు నెలల తరబడి స్పందించేవారు కాదు.

అయితే ఇక్కడ సమస్యను గుర్తించిన వైఎస్‌ జగన్‌ సర్కారు. వీధి లైట్ల నిర్వహణా బాధ్యతల నుంచి ప్రైవేటు ఏజెన్సీని తప్పించింది. గ్రామ సచివాలయాల పరిధిలో ఉండే ఎనర్జీ అసిస్టెంట్‌లకు 200 పోల్స్‌ చొప్పున కేటాయిస్తోంది. సదరు పోల్స్‌పై వీధి దీపాల నిర్వహణా బాధ్యలను ఇకపై సచివాలయ పరిధిలోని ఎనర్జీ అసిస్టెంట్‌లే చూసారు. దీంతో సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా ఎల్‌ఈడీ లైట్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందన్న ఆరోపణలు అప్పట్లో జోరుగానే విన్పించాయి. బహిరంగ మార్కెట్‌లో యేడాది వారంటీతో సహా వెయ్యి రూపాయల లోపునే దొరికే ఎల్‌ఈడీ లైట్‌ను అంతకు మూడు రెట్లు ధరకు పంచాయతీలకు అంటగట్టారని ప్రజలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ అప్పట్లో నోరు మెదపలేదు. దీనిపై కూడా విచారణ చేస్తే అక్కడ జరిగిన అక్రమాలు? ఎన్నికోట్ల నిధులు పక్కదారి పట్టాయన్న నిజానిజాలు బైటకు వస్తాయని పలువురు చెబుతున్నారు.