లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. ఆ సినిమాకి విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. అయితే, విజయశాంతిని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా చూపించి వుంటే బావుండేదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాలో ఇంకాస్త ‘పవర్‌ఫుల్ రోల్’ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట సూపర్ స్టార్ విజయశాంతి. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న ఇక్కడ. ఇటీవల ఓ ప్రముఖ హీరో సినిమాలో కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదిస్తే, అందులో పాత్ర తన ‘పవర్’కి తగ్గట్టు లేదని ఆమె సున్నితంగా తిరస్కరించారట. దాంతో, ఆ చిత్ర నిర్మాత కొంచెం నొచ్చుకున్నారని సమాచారం. సదరు నిర్మాతకి విజయశాంతితో గతంలో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ, సినిమాలో తన పాత్ర విషయమై అస్సలేమాత్రం రాజీ పడేది లేదని విజయశాంతి తేల్చి చెప్పేశారంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలోనూ విజశాంతికి మంచి రోల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమా షూటింగ్‌లో బిజీగా వుండేవాడే. కానీ, కరోనా దెబ్బకి అన్ని ప్లానింగ్స్ గందరగోళంగా తయారయ్యాయి. వచ్చే ఏడాదిగానీ ‘ఎఫ్3’ పట్టాలెక్కేలా కన్పించడంలేదు. ఈలోగా ఈక్వేషన్స్ మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. 2024 నాటికి రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్న విజయశాంతి ఈలోపలే ఒకటి రెండు సినిమాలు చేసే అవకాశం వుందని తెలుస్తోంది.