iDreamPost
iDreamPost
ఏ ముహూర్తంలో భాగ్ మిల్కా భాగ్ బ్లాక్ బస్టర్ అయ్యిందో కానీ ఇక అప్పటి నుంచి నాన్ స్టాప్ గా బయోపిక్కులు వస్తూనే ఉన్నాయి. కాదేది సినిమాకనర్హం అనే రీతిలో క్రీడాకారులు, తారలు, రాజకీయ నాయకులు, బందిపోటు దొంగలు అనే తేడా లేకుండా అందరివీ తెరకెక్కుతున్నాయి. తాజాగా శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం కూడా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అతని పాత్రలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డర్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటనను వెలువరించబోతున్నారు.
అయితే ఇలా బయటి దేశానికి చెందిన స్పోర్ట్స్ మెన్ బయోపిక్ ని తెరకెక్కించడం మాత్రం ఇదే మొదటి సారి. ఇప్పటిదాకా వచ్చిన సచిన్, ధోని, అజారుద్దీన్ సినిమాలన్నీ మనవాళ్ళవే. కానీ ముత్తయ్య మురళీధరన్ ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ ఇతను పరాయివాడే. అయినా ఎందుకు ఎంచుకున్నారో కానీ మొత్తానికిది పెద్ద విశేషమే. కానీ ఇక్కడో రిస్క్ ఉంది. తమిళ నిర్వాసితుల పట్ల శ్రీలంకలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఎప్పటి నుంచో అగ్గి రాజుకుంటోంది. రాజీవ్ గాంధీ హత్యకు దారి తీసింది కూడా ఈ దమనకాండే. ద్వైత్వ సంబంధాల వల్ల ఇప్పుడు కొంత చల్లారినట్టు కనిపిస్తున్నా ఇది దశాబ్దాలుగా అంటుకున్న దావానలం.
మరి తమిళ ప్రేక్షకులు ఇలా తమ హీరో అక్కడి క్రికెటర్ కథలో నటించడం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మాములుగా వివాదాలకు దూరంగా సౌమ్యుడిగా పేరున్న విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవడం విశేషమే. అసలే జనాల మనోభావాలు చాలా సున్నితంగా మారుతున్న కాలమిది. అలాంటప్పుడు దీని పట్ల నిరసన వ్యక్తం కాకుండా ఉండకపోదు. బౌలింగ్ పట్ల వివాదాలను ఎదుర్కున్న మురళీధరన్ టెస్టుల్లో 800, వన్ డేల్లో 534 వికెట్లు తీసి తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్నాడు. అతని జీవితంలో చాలా ఎగుడుదిగుడులు, అవమానాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి లాంటి నటుడైతేనే ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాడు. మరి ఇలా విదేశీ క్రీడాకారుల కథలను తీసే ట్రెండ్ ని మొదలుపెట్టబోతున్న ముత్తయ్య కథ మరికొందరికి స్ఫూర్తినిచ్చి ఇకపై దేశాల భేదాలు లేకుండా అందరి బయోపిక్కులకు దారి చూపుతాడేమో లెట్ వెయిట్ అండ్ సి…