iDreamPost
iDreamPost
హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి చెంది తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా దర్శక రచయితలు కథలు రాసుకోవడం తెలుగు పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే కమర్షియల్ అంశాలను పొందుపరిచే క్రమంలో ఏ మాత్రం తేడా కొట్టినా కోట్ల రూపాయల కష్టం వృథా అయిపోతుంది. అలాంటి ఉదాహరణే 1986లో వచ్చిన ‘వేట’. తమకు మొదటి ప్రయత్నంలోనే ‘ఖైదీ’ లాంటి ఇండస్ట్రీ హిట్ దక్కిన ఆనందంలో సంయుక్త మూవీస్ అధినేతలు మరోసారి దాన్ని మించిన బ్లాక్ బస్టర్ తీయాలనే సంకల్పంతో 1975లో విడుదలైన ఇంగ్లీష్ మూవీ ‘ది కౌంట్ అఫ్ మౌంట్ క్రిస్టో’ని ఎంచుకున్నారు. ఇది 175 ఏళ్ళ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ నవలకు సినిమా రూపం. అలెగ్జాండర్ డ్యూమస్ రచయిత.
‘రాంబో ఫస్ట్ బ్లడ్’ లోని కొంత భాగాన్ని తీసుకుని మెగాస్టార్ కు మర్చిపోలేని మలుపుగా ఖైదీని తీర్చిదిద్దిన పరుచూరి సోదరులకే వేట స్క్రిప్ట్ బాధ్యతను అప్పజెప్పారు దర్శకుడు కోదండరామిరెడ్డి. అప్పట్లోనే కోటి రూపాయలతో బడ్జెట్ కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒరిజినల్ స్టోరీకి ఎక్కువ మార్పులు చేయకుండా మన ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు కొన్ని మాస్ ఎలిమెంట్స్ జోడించి వేటను రెడీ చేశారు పరుచూరి ద్వయం. హీరోయిన్ గా జయప్రదను తీసుకున్నారు. సుమలత రెండో కథానాయిక. చక్రవర్తి సంగీతం, లోక్ సింగ్ ఛాయాగ్రహణం బాధత్యలు నెరవేర్చారు. రంగనాథ్, నూతన్ ప్రసాద్, రాజవర్మ, జగ్గయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
వివిధ లొకేషన్లలో ఖర్చుకు వెనుకాడకుండా వేట నిర్మాణం సాగింది. ప్రేయసిని దూరం చేసి తనను అన్యాయంగా అండమాన్ జైలుకు పంపిన శత్రువుల మీద హీరో ప్రతీకారం తీర్చుకోవడమే వేట కథ. అయితే జయప్రదకు విలన్ తో పెళ్లి చేయడం, వాళ్లకు పుట్టిన బిడ్డ చిరంజీవి సంతానమే అని చెప్పడం అభిమానులకు నచ్చలేదు. అంతేకాదు సెకండ్ హాఫ్ లో ఈ సెంటిమెంట్ డ్రామా డోస్ ఎక్కువయ్యింది. క్లైమాక్స్ లో జయప్రద చనిపోవడం కూడా సినిమాను దెబ్బ తీసింది. చాలా స్టైలిష్ గా కొత్త తరహా కాస్ట్యూమ్స్ తో చిరంజీవి ప్రతాప్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసినా లాభం లేకపోయింది. గురి తప్పిన వేట ఫలితం నిరాశనే మిగిల్చింది. కానీ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. రాణి మహారాణి, ఊరేమిటమ్మా, ఓ లేడీ కూన పాటలు మ్రోగిపోయాయి.