iDreamPost
android-app
ios-app

గాన గంధర్వుడి ‘నట’ సౌరభాలు – Nostalgia

  • Published Sep 25, 2020 | 12:38 PM Updated Updated Sep 25, 2020 | 12:38 PM
గాన గంధర్వుడి ‘నట’ సౌరభాలు – Nostalgia

దేవుడు కోట్లాది జనాభాలో కొందరిని మాత్రమే కారణజన్ములుగా పుట్టిస్తాడు. వారి జన్మకో సార్థకత చేకూరేలా అంతులేని విద్వత్తుని కానుకగా ఇచ్చి పంపిస్తాడు. దాన్ని పదుగురికి పంచి వాళ్ళ జీవితాల్లో ఓ భాగ్యమయ్యే భాగ్యాన్ని కలిగిస్తాడు. ఆ కర్తవ్యం నెరవేర్చగానే తన దగ్గరకు నిర్దయగా పిలిపించుకుంటాడు. దశాబ్దాల తరబడి గాయకుడిగా సగటు భారతీయుడి సంగీత ప్రపంచంలో ఇంకిపోయిన ఎస్పి బాలసుబ్రమణ్యం అలియాస్ బాలు నటుడిగానూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. వృత్తిపరంగా ఊపిరిసలపనంత పాటల్లో మునిగితేలేవారు కానీ లేదంటే రోజుకు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే మాత్రం ఖచ్చితంగా తనలో నటుడిని ఇంకా గొప్పగా పరిచయం చేసేవారు.

బాలు తెరమీద మొదటిసారి నటుడిగా కనిపించింది 1972లో వచ్చిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో. ఆ తర్వాత కన్యాకుమారి, పక్కింటి అమ్మాయి, మల్లెపందిరి, చెన్నపట్నం చిన్నోళ్ళు ఇలా చెప్పుకోదగ్గ చిత్రాల్లో మంచి వేషాలు వేశారు. 1988లో వెంకటేష్ ప్రేమలో వ్యసనాలకు బానిసైన హీరో గురువు పాత్రలో అద్భుతంగా మెప్పించారు. 1992లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట, పర్వతాలు పానకాలులో హీరోతో సమానమైన పాత్రలు చేశారు బాలు. 1995 ప్రేమికుడు చిత్రంలో ప్రభుదేవా తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా ఇచ్చిన పెర్ఫార్మన్స్ మర్చిపోయేది కాదు. ప్రేమదేశం, దొంగదొంగ, పవిత్రబంధం, పెళ్ళివామండి, రక్షకుడు, ఆరో ప్రాణం, మెరుపు కలలు, దీర్ఘసుమంగళిభవ, గొప్పింటి అల్లుడు, మెకానిక్ మావయ్య, దేవుళ్ళు, ఇంద్ర, ఫూల్స్, ఇంద్రగంటి మాయాబజార్, రూమ్ మేట్స్, శుభప్రదం, శక్తి తదితర సినిమాల్లో వేసినవి సపోర్టింగ్ క్యారెక్టర్సే అయినప్పటికీ వాటి విజయంలో బాలు పాత్ర చాలా కీలకంగా నిలిచింది.

తనికెళ్ళ భరణి తీసిన మిధునం బాలులోని అసలు సిసలైన నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించింది. ఎవరికీ తీసిపోని రీతిలో అవార్డులు రివార్డులు కూడా సాధించుకున్నారు. తరుణ్ చిరుజల్లులో నెగటివ్ షేడ్స్ లో బాలు మెప్పించడం ఒక స్వీట్ అండ్ షాకింగ్ సర్ప్రైజ్. తెలుగులోనే అత్యధికంగా 50పైగా సినిమాల్లో నటించిన బాలసుబ్రహ్మణ్యం తమిళం, కన్నడ, హిందిలలో కలిపి అంతకన్నా తక్కువే చేయడం మన గడ్డ చేసుకున్న అదృష్టం. ఒకపక్క పాటల ప్రవాహంలో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే మరోవైపు తనలోని నటతృష్ణని తీర్చుకునేలా బాలు చూపించిన బహుముఖ ప్రజ్ఞ తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత వరకు సజీవంగానే ఉంటుంది. కేవలం పాటల రూపంలో వినిపించడమే కాదు పైన చెప్పిన సినిమాలు ఎప్పుడు చూసినా అదే వాడని చిరునవ్వుతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు బాలసుబ్రహ్మణ్యం.