iDreamPost
android-app
ios-app

మాస్ ఎనర్జీకి నిర్వచనం – Nostalgia

  • Published Mar 27, 2021 | 9:24 AM Updated Updated Mar 27, 2021 | 9:24 AM
మాస్ ఎనర్జీకి నిర్వచనం – Nostalgia

మాస్ మహారాజాకు ఇంత ఫాలోయింగ్ ఏర్పడటంలో అతని ఎనర్జీనే ప్రధాన కారణమని కొత్తగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమకు వచ్చి ఎన్నో ఏళ్ళ తర్వాత బ్రేక్ దొరికినా తన బాడీ లాంగ్వేజ్, నటనతో అమాంతం అభిమాన గణాన్ని పెంచుకోవడం తనకే సాధ్యమయ్యింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో రవితేజ సినిమాల తాలూకు కామెడీ సీన్లు, యాక్షన్ సన్నివేశాలను వాడుకుని మీమ్స్ తయారు చేసి పాపులారిటీ సంపాదించుకున్న ఫేస్ బుక్, ఇన్స్ టా పేజీలు వందల్లో ఉంటాయి. ఆ ఎపిసోడ్లు అంతగా పేలడానికి బ్రహ్మానందం లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు మాస్ రాజా టైమింగ్ ఎంతగా ఉపయోగపడిందో చెప్పే సినిమానే వెంకీ.

2004 సంవత్సరం. రవితేజ ఫామ్ మాములుగా లేదు. ఇడియట్, ఖడ్గం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు ఒక రాజు ఒక రాణి, దొంగోడు, ఈ అబ్బాయి చాలా మంచోడు లాంటి అంచనాలు అందుకోలేకపోయిన సినిమాలతో ప్రయాణం సమాంతరంగా సాగుతోంది. ఆ టైంలో దర్శకుడు శ్రీను వైట్ల చెప్పిన సబ్జెక్టే వెంకీ. అతని మొదటి చిత్రం ‘నీ కోసం’ హిట్ అయితే ‘ఆనందం’ చాలా పేరు తీసుకొచ్చింది. కానీ అదే ఫార్ములాలో తీసిన సొంతం, ఆనందమానందమాయే ఫలితాలు నిరాశ కలిగించడంతో కామెడీ, యాక్షన్, మ్యూజిక్, లవ్ ఇలా అన్ని అంశాలు పొందుపరిచిన వెంకీ కథ శ్రీను వైట్లకు బాగా నచ్చేసింది. హీరోయిన్ గా స్నేహను తీసుకున్నారు

రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ ల కాంబినేషన్ కి ఇండస్ట్రీలో అప్పటికే మంచి క్రేజ్ ఉంది. తనకు మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు అడగటంతో పాటు స్క్రిప్ట్ బ్రహ్మాండంగా నచ్చడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పేశారు. ఉద్యోగం కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాళ్ళు అనుకోకుండా హీరోయిన్ తండ్రి మర్డర్ కేసులో చిక్కుకోవడం, అసలు విలన్ తాము పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న బాసే కావడం లాంటి ట్విస్టులతో సినిమా ఆడియన్స్ కి సూపర్ గా నచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో పెద్ద ప్లస్. నలభై నిమిషాల దాకా సాగే సుదీర్ఘమైన ట్రైన్ ఎపిసోడ్ ని ఏ మాత్రం విసుగు రాకుండా నడిపించిన తీరు తర్వాత ఎందరికో స్ఫూర్తినిచ్చింది. 2004 మార్చి 23న విడుదలైన వెంకీ రవితేజ కెరీర్లో బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది