iDreamPost
iDreamPost
అతిశయోక్తి (exaggeration)కు కూడా హద్దులు ఉంటాయి…అతిశయోక్తి అలంకారం భాషా సౌందర్యాన్ని పెంచుతుంది కానీ వ్యక్తుల విషయంలో మాత్రం అబ్బా ఈయనకు అంత ఉందా అంటూ మాట విరిచేలా చేస్తుంది.
వ్యక్తులకు వారు చేస్తున్న వృత్తి వలన సమాజంలో కొంత గుర్తింపు వస్తుంది.. ఆ పదవి నుంచో,ఉద్యోగం నుంచో తప్పుకుంటే గౌరవాలు,పలకరింపులు పలచబడతాయి..వృత్తి జీవితంలో మంచి పనులు నాలుగు చేసి ఉంటే నలుగురు గుర్తుపెట్టుకుంటారు. జీవితమంతా విమర్శలు,సవాళ్లతో గడిపి ఉంటే ఆ గుర్తింపు కూడా ఉండదు…
Read Also :- నారా లోకేష్ హీరోగా సినిమా మిస్
ముఖ్యమంత్రి లేక మంత్రి పదవిలో ఉన్నప్పుడు కలెక్టర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు గడగడ లాడుతారు. మాజీ అయితే ఒక్క గడ కూడా ఉండదని దాదాపు అందరికి అనుభవంలోకి వచ్చిన సంగతే…. సినిమా తెర మీదనో టీవీ స్క్రీన్ మీదనో కనిపించే వారి సంగతి కూడా ఇంతే. ఫలానా వారు టీవీ మీద కనిపించటం లేదని పేక్షకులు టీవీ చూడటం మానరు.. ఫలానా నటుడు రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన అభిమానులు గంపగుత్తగా ఓట్లు వేయరు.. ఇప్పటికి నాలుగు దశాబ్దాల కిందట ఎంజీఆర్ ఎన్టీఆర్ సాధించిన విజయాలే చెప్పుకోవలసి వస్తుంది . నాటి రాజకీయ శూన్యత ,ఏక పార్టీ ఆధిపత్యం వెరసి కొత్త పార్టీకి కలిసొచ్చింది.. ఇప్పుడు అభిమానుల లెక్క వేరు.. సినిమా అభిమానం రాజకీయంగా పెద్దగా ఉపయోగపడదని గత పది సంవత్సరాలలో ఆంధ్రాలో రెండుసార్లు నిరూపితం అయ్యింది .
ఈ చరిత్ర అంతా తెలిసి కూడా ఒక న్యూస్ ప్రెజంటర్ టీవీ చర్చలో నాకు నియోజకవర్గానికి నాలుగు ఐదు వేల ఓట్లు ఉన్నాయంటూ ఛాలెంజ్ విసరటం ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఆయన అతివిశ్వాసమా లేక స్క్రీన్ తెచ్చే మత్తా ?
Read Also :- రాధాకృష్ణ పగటికలలు కొనసాగుతూనే ఉన్నాయి …
తమ ఆలోచనలు ముఖ్యంగా వారం వారం వీక్ ఎండ్ కామెంట్ పేరుతొ ఛానల్లో ,”కొత్తపలుకులు” పేరుతో పత్రికలో కేంద్రం తలుచుకుంటే ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ అవుతాడు అంటూ తమ అభీష్టాన్ని జర్నలిజం పేరుతో ప్రసారం చేసే ఆంధ్రజ్యోతి,ఏబీఎన్ పద్దతికి వెంకట కృష్ణ యాడ్ ఆన్ చేస్తున్నాడు.
పాతిక సంవత్సరాల అనుభవం వలనో లేక ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆశల మేరకో వెంకట కృష షో మొత్తం జగన్ వ్యతిరేకంగా నడుస్తుంది.. ప్రతి పత్రిక,ఛానల్ ఒక స్టాండ్ తీసుకున్నాయి కాబట్టి దాన్ని విమర్శించవలసిన పని లేదు కానీ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో జరిగిన డిబేట్లో శాసనసభ, శాసనమండలి, సచివాలయం అమరావతిలోనే కొనసాగేలా చేస్తే తనకు ప్రతి నియోజకవర్గంలో నాలుగు ఐదు వేల ఓట్లు ఉన్నాయని , బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారు..
నిన్నటివరకు అసెంబ్లీ,కౌన్సిల్లో అది కూడా రాజకీయ నేతలే చేసుకునే సవాళ్లు ఇప్పుడు టీవీ ఛానళ్ల న్యూస్ ప్రెజంటర్లు మొదలు పెట్టారు.. వెంకట కృష్ణ చాలా కాన్ఫిడెంట్ గా నాకు ఎంతో కొంత ఉంటుందిగా?ముప్పై వేలో నలబై వేలో యాబై వేలో అంటూ ప్రతి నియోజకవర్గంలో నాలుగు ఐదు వేల ఓట్లు ఉన్నాయి.. అవి మీ బీజేపీకి పడేలా ప్రచారం చేస్తాను అని సోము వీర్రాజు కు ఆఫర్ ఇచ్చాడు..
ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ అయినా వెంకట్ కృష్ణ అయినా సింగల్ పాయింట్ అజెండా.జగన్ ప్రభుత్వం కూలిపోవాలి లేదా కనీసం జగన్ ను జైలుకు పంపి తద్వారా ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి.ప్రతి రాతలో చర్చలో కేంద్ర బిందువు ఇదే!
ఒక న్యూస్ ప్రజెంటర్ లేక ఒక ఛానల్ ఎడిటర్ కు నియోజకవర్గానికి నాలుగు ఐదు వేల ఉంటాయా?నియోజకవర్గానికి ఐదు వేలు అంటే 175 నియోజకవర్గాలకు కలిపి ఎనిమిది లక్షల డెబ్భై ఐదు వేల ఓట్లు.. మరో విధంగా చెప్పాలంటే 2009 ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీకి వచ్చిన ఏడు లక్షల నలబై వేలకన్నా లక్షా ముప్పై వేలు అధికం. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేనకు వచ్చిన 16.75 లక్షల ఓట్లలో సగం కన్నా (దాదాపు 52%) ఎక్కువ ఓట్లు .
Read Also :- తెలుగుదేశం కాషాయీకరణ చెందుతోందా?
ఎన్ని ఓట్లు అనే లెక్కలు సంగతి పక్కన పెడితే ఒక జర్నలిస్ట్ కు అనుచరులు , ఓటర్లు వుంటారా? .
గతంలో ఎవరైనా జర్నలిస్ట్ ఇలాంటి ప్రకటన చేశారా?ఏ ధైర్యంతో వెంకట కృష్ణ ఇలాంటి ప్రకటన చేశారు?
వెంకట కృష్ణ కైనా మరొకరికైనా ఏ ఛానల్లో పనిచేసే అవకాశం లేకుంటే వారిని గుర్తుపెట్టుకునే వారు ఎందరు?. ఈ మధ్య ఏబీఎన్ లో చేరక ముందు 24/7లో పనిచేసినంత కాలం ఆ ఛానల్ ప్రభావం ఎంత? . వెంకట కృష్ణ అభిమానులంతా ఆ ఛానల్ ను చూసినా టీఆర్పీ రేటింగ్లో ఆ ఛానళ్ల మంచి స్థానంలో ఉండేవి.. వెంకట కృష్ణ వేసుకున్న సూట్ తీసి పక్కన పెడితే ఆయనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో ఆయనకు అర్ధమవుతుంది.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రవి ప్రకాష్ తొలి స్టార్.. ఆయన తరువాత కరీమ్.. టీవీ 9 నుంచి బయటకొచ్చిన తరువాత రవి ప్రకాష్ గురించి కేసుల చర్చ తప్ప ఆయన మీడియాలో లేకపోవటం లోటని ఎవరన్నా రాశారా?. కరీమ్ పేరు ఎంతమందికి గుర్తుంది?
Read Also :- పిఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి నియామకం
ఆ మధ్య ఒక టీవీ జర్నలిస్ట్ (ఈయన కూడా వివాదాస్పదుడే) అమరావతి కోసం అని ఒక ర్యాలీ తీస్తే ఆయన వెనుక అమరావతి ధర్నా శిబిరాలలో ఉన్న కొన్ని వందల మంది నడిచారు.. వారిని చూసి ఆయన ఉప్పొంగిన ఛాతితో నినాదాలు చేశారు. అదే జర్నలిస్ట్ కేసులో ఇరుక్కుంటే ఆయనకు మద్దతుగా పట్టుమని పది మంది కూడా స్పందించలేదు.. ర్యాలీలు ధర్నాలు చేసే ఆసక్తి ఓపిక ఎవరికీ లేవు!
తాము నిర్వర్తిస్తున్న బాధ్యతల వలన వచ్చిన మద్దతు తమ వ్యక్తిగత బలం అనుకొని బోల్తాపడ్డవాళ్లు చాలా మందే ఉన్నారు.వెంకట్ కృష్ణ కు అది తెలియని సంగతి కాదు .. అయినా రాధాకృష్ణ ఛానల్ కాబట్టి ఓట్లు అంటూ అన్ని గట్లు దాటి మాట్లాడాడు..
తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ కోసం పనిచేసిన ఈనాడు జర్నలిస్టులు కూడా ఎవరూ ఇలా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో కొందరు 1983 నాటి సంగతులు రాస్తుంటారు కానీ పలానా నాయకుడికి నా వల్ల టికెట్ వచ్చిందని,నేను రాసిన కథనాలతో గెలిచాడని కానీ రాయరు..
వెంకట్ కృష్ణ కు రాజకీయ ఆలోచన ఉంటే స్వయంగా రాజకీయాలలోకి దూకటం మంచిది. ఆయన్ను ఆదరించే పార్టీ ఎలాగూ ఉంది.. అయితే టికెట్ ఇస్తారా?అంటే చెప్పలేము.. ఒక్కసారి కండువా వేసుకున్న తరువాత ఆ నాయకుడికి అందరు సమానమే.. వెంకట కృష్ణ అసమాన్య రాజకీయ నేతల మధ్య సామాన్య నేతగా కొత్త పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది. అప్పటి వరకు సార్ అంటూ పిలిచిన రాజకీయ నాయకులు ఏమయ్యా వెంకట కృష్ణ అని సంబోధించినప్పుడు ఇంట్లో భద్రపరిచిన సూట్ వైవు చూసి బాధపడవలసి వస్తుంది..
క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళండి కలలు సాకారం చేసుకోండి వెంకట కృష్ణ గారు !