iDreamPost
android-app
ios-app

ఇంత జరుగుతున్నా…ఆమెందుకు మౌనంగా ఉన్నారు..?

ఇంత జరుగుతున్నా…ఆమెందుకు మౌనంగా ఉన్నారు..?

రాజస్థాన్‌లోని రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కొన అంచుల దాకా వెళ్లిపోయింది. సంక్షోభంలో పడేంతగా కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అగ్రనేతలు వెళ్తున్నారు..వస్తున్నారు..సీఎల్పీ సమావేశం జరిగింది..రాజకీయాలు ఇంత వేడి మీదున్నా.. మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత వసుంధర రాజే సింధియా మాత్రం పత్తా లేకుండా పోయారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపిలో సీనియర్…పైగా మాజీ ముఖ్యమంత్రి.. అయినా ప్రస్తుత పరిణామాలపై ఒక్కసారి కూడా స్పందించలేదు.

పోనీ.. ట్విట్టర్ వేదికగా అయినా స్పందించారా? అంటే..అదీ లేదు. ఎందుకు ఆమె అంత మౌనంగా ఉండిపోతున్నారు? అన్నదే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. రాజస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై మధ్యప్రదేశ్‌లో ఇటీవలి కాంగ్రెస్ నుంచి బిజెపి‌ చేరిన కాంగ్రెస్ మాజీ యువనేత, బిజెపి రాజ్యసభ ఎంపి, వసుంధర రాజే మేనల్లుడు జ్వోతి రాధిత్య సింథియా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌లోని సీనియర్లు పెత్తనం గురించి విమర్శలు చేశారు.‌ సచిన్ పైలట్ కి తన మద్దతు ప్రకటించాడు. కాని వసుంధర రాజే మాత్రం స్పందించటం లేదు. దీనికి కారణం అశోక్ గెహ్లాట్ కు వసుంధర రాజేకు ఏమైనా ఒప్పందం జరిగిందా? అనే చర్చ జరుగుతుంది. అయితే సచిన్ పైలట్ పై ఉన్న కోపంతోనే వసుంధర రాజే స్పందించటం లేదని భోగట్టా..!

అయితే రాజస్థాన్‌లోని నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి తనయుడు, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు ఓపి మాథుర్ లాంటి సీనియర్లు మాట్లాడుతున్నారు. కానీ మాజీ సిఎం వసుంధర రాజే సింధియా మాత్రం పెదవి విప్పడం లేదు. కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న వర్చువల్ జనసంవాద్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఆ తరువాత బెంగాల్‌లో ఎమ్మెల్యే దేవేంద్ర నాథ్ ఉరేసుకున్న వ్యవహారంపై వసుంధర రాజే ట్వీట్ చేశారు. ఆ తరువాత నైపుణ్యాభివృద్ధిపై ప్రధాని మోడీ చేసిన సంభాషణపై కూడా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పోలిస్తే…ఇవేమీ పెద్ద పరిణామాలు కావు. కానీ వీటిపై స్పందించి…రాజకీయంపై మాత్రం కిమ్మనడం లేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ఆమె అంతగా ఉత్సాహంగా లేరని పేర్కొన్నారు.

గెహ్లాట్ సర్కార్‌ను ముప్పుతిప్పలు పెట్టాలన్న బిజెపి ఆలోచనతో ఆమె ఏమాత్రం ఏకీభవించడం లేదని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. వసుంధర రాజే ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో విమర్శలకు దిగి… ఆమె అధికారం పోడానికి ఒకింత కారణమైన పైలెట్ ఆమెకు అంతగా రుచించడం లేదు. అంతేకాకుండా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బిజెపి, పైలట్ మధ్య ఏర్పడిన సత్సంబంధాలపై కూడా ఆమె గుస్సా ఉన్నట్లు సమాచారం.

గుర్జర్ వర్గ ప్రతినిధిగా ముద్ర పడ్డ పైలట్… రమేశ్ మీనా, విశ్వేంద్ర సింగ్ లాంటి సన్నిహితుల సూచనలతో మెళ్లిగా ఆ ముద్రను చెరిపేసి…రాష్ట్ర నాయకుడిగా ఎదగడం ప్రారంభించారు. ఈ ‘’పరిణామ క్రమమే’’ సింధియాకు ఇబ్బందిగా మారబోతోందని ఆమె ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. సచిన్ పైలట్ గురి మొత్తం కూడా సిఎం పదవిపైనే. ఈ లక్ష్యమే వసుంధరకు అడ్డంకిగా మారే సూచనలున్నట్లు ఒకింత ఆమె ఆందోళనలో పడ్డారు.

వసుంధర వయస్సు ప్రస్తుతం 70 సంవత్సరాలు. అయినా సరే.. మరోసారి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయాలని ఆమె ఆకాంక్షతో ఉన్నట్లు ఆమె కోటరీ నేతలు చెబుతున్న మాట. ముఖ్యమంత్రి పదవి ఎలాగైనా చేపట్టాలన్న మొంకి పట్టుదలతో ఉన్న పైలట్..తప్పిపోయి, అన్నీ అనుకూలిస్తే బిజెపిలో చేరితే మాత్రం వసుంధర ‘‘లక్ష్యానికి’’ అడ్డుపుల్ల పడ్డట్లే. అందుకే పైలట్ కమల దళంలోకి రావడానికి దాదాపుగా సిద్ధమైనా…వసుంధర అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. 

ఇక రెండో మాట కూడా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు, ఈమెకు మధ్య ఓ అవగాహన ఉన్నట్లు సమాచారం. అందుకే రాజకీయంగా బద్ధ విరోధి అయినా…గెహ్లాట్‌ను ఆమె సుతి మెత్తగానే విమర్శిస్తారు తప్పించి… పెద్దగా సూటిపోటి మాటలతో విమర్శలకు దిగినట్లు ఆధారాల్లేవు. ఆ అంశం కూడా ఇప్పుడు పనిచేస్తోందని ఓ వర్గం నేతల టాక్.

అలాగే ప్రస్తుతం బిజెపికి ఉన్న 73 మంది ఎమ్మెల్యేల్లో వసుంధర రాజేకు కేవలం 43 మందే మద్దతు ఇస్తున్నారు. మిగతా వారు వసుంధర రాజేను వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఒకవేళ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయి..బిజెపి అధికారంలోకి‌ వచ్చిన వసుంధర రాజేకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని నమ్మకం లేదు. కనుక ఆమె రాజస్థాన్‌లో జరుగుతున్న పరిస్థితుల పట్ల మౌనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ మాత్రం వసుంధర రాజేపై విమర్శలు గుప్పిస్తోంది. బిజెపి మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ అధినేత, నాగౌర్‌ లోక్‌సభ ఎంపి హనుమాన్ బెనివాల్ వసుంధర రాజ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తిరుగుబాటుదారుడు సచిన్ పైలట్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న భారీ ముప్పు నుంచి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గట్టెక్కెందుకు సహాయం చేయడానికి బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎంపి హనుమాన్ బెనివాల్ చేసిన ట్విట్ లో “రాజస్థాన్‌లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోరాటం ఒక మలుపు తిరిగింది. వసుంధర రాజే తిరుగుబాటు శిబిరాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని పోస్టు చేశారు. “మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన దగ్గరున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వమని కోరారు. సికార్, నాగౌర్‌లోని ప్రతి జాట్ ఎమ్మెల్యేను పిలిచి సచిన్ పైలట్ నుండి దూరం ఉండమని వారిని కోరారు. దీనికి నా దగ్గర రుజువు ఉంది” అని హనుమాన్ బెనివాల్ ట్వీట్ చేశారు.

“ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు గెహ్లాట్ కు సహాయం చేయమని చెప్పారు. కాబట్టి మేము మీకు సహాయం చేయం. ఎందుకంటే అశోక్ గెహ్లాట్ సర్కార్ (ప్రభుత్వం) కూలిపోదు” అని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు తెలిపారు. అయితే అందుకు భిన్నంగా రాజస్థాన్ బిజెపి చీఫ్ సతీష్ పునియా స్పందించారు. “బెనివాల్ అలాంటి ప్రకటనలు చేయవద్దని కోరేందుకు తమ పార్టీ నాయకులు ఆయనతో మాట్లాడారు. వసుంధర రాజే మా గౌరవనీయ నేత” అని పునియా అన్నారు.

రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి సీనియర్ నేత గులాబ్ చంద్ కటారియా గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఫ్లోర్ టెస్ట్ కోసం తమ పార్టీ డిమాండ్ చేయటం లేదన్నారు. “ప్రస్తుతానికి అలాంటి అవసరాన్ని (ఫ్లోర్ టెస్ట్ కోసం) మాకు అనిపించడం లేదు. మాకు అవసరం అనిపిస్తే, పార్టీ (బిజెపి) కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాం” అని కటారియా అన్నారు.