iDreamPost
android-app
ios-app

పాటలతో అలరించిన వాసు – Nostalgia

  • Published Apr 15, 2021 | 11:08 AM Updated Updated Apr 15, 2021 | 11:08 AM
పాటలతో అలరించిన వాసు – Nostalgia

ఏ సినిమాకైనా దాని విజయంలో సంగీతం ఎంత కీలకపాత్ర పోషిస్తుందో మనకు లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అయితే కేవలం పాటలతోనే హిట్లు రావు. బలమైన కంటెంట్, ఎమోషన్లు ఉన్నప్పుడే మూవీ జనానికి కనెక్ట్ అవుతుంది. దీనికి శంకరాభరణం, గీతాంజలి, సీతాకోకచిలుక, బొమ్మరిల్లు లాంటివి మంచి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. అయితే ఇవి స్టార్ హీరోలు చేస్తున్నప్పుడు కొంత రిస్క్ ఉంటుంది. ఏ ఒక్క అంశం బ్యాలన్స్ తప్పినా దాని ఫలితం నేరుగా బాక్సాఫీస్ మీద పడుతుంది. అభిమానుల అంచనాలు అందుకోవడంలో తడబాటు ఎదురవుతుంది. కమర్షియల్ గానూ నష్టం వస్తుంది. అలాంటిదే విక్టరీ వెంకటేష్ నటించిన వాసు.

2002 సంవత్సరం. పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ తీశాక దర్శకుడు కరుణాకరన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. రెండో సినిమా ‘యువకుడు’ నిరాశ పరిచినప్పటికీ అందులో కామెడీకి, భావోద్వేగాలకు పర్వాలేదనిపించే మార్కులు పడ్డాయి. ఆ టైంలో వెంకటేష్ కో కథ చెప్పాడు కరుణాకరన్. సంగీతమంటే ప్రాణమిచ్చే యువకుడు పోలీస్ ఆఫీసరైన తన తండ్రి మాటను కాదని మరీ స్వంత ప్రయత్నాలు చేస్తూ లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడనేదే మెయిన్ పాయింట్. వెంకీకి కథ బాగా నచ్చింది. కరుణాకరణ్ సంభాషణల కోసం చింతపల్లి రమణను అనుకున్నా ‘నువ్వు నాకు నచ్చావ్’లో త్రివిక్రమ్ పనితనం నచ్చిన వెంకీ రికమండేషన్ తో ఇది తనకే ఇప్పించాడు. వెంకటేష్ కు చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నిర్మాత కెఎస్ రామారావుకు ఈ ప్రాజెక్ట్ దక్కింది

మ్యూజిక్ ఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశంతో కోలీవుడ్ నుంచి ప్రత్యేకంగా హారిస్ జైరాజ్ ను తీసుకొచ్చారు. ఆయన అంచనాలకు మించి అద్భుతమైన ఆల్బమ్ ని కంపోజ్ చేశారు. ఇదే తన తెలుగు డెబ్యూ మూవీ. 2002 ఏప్రిల్ 10న విడుదలైన వాసులో లవ్ , కామెడీ, ఎమోషన్స్, డ్రామా అన్ని ఉన్నప్పటికీ హీరో క్యారెక్టర్ సంగీత ప్రయాణాన్ని కాస్త ల్యాగ్ చేయడంతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి సంతృప్తినివ్వలేకపోయింది. వెంకీ ట్రెండీ లుక్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చినా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి వాసు ఓ మోస్తరుగానే నచ్చాడు. ఫలితంగా అంచనాలకు సగం దూరంలోనే ఆగిపోయాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రెండు లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోవడం అప్పట్లో ఓ రికార్డు. ఇప్పడొస్తున్న ఎంటర్ టైనర్స్ తో పోల్చుకుంటే మాత్రం ‘వాసు’ వంద రెట్లు నయమనిపిస్తాడు